కల్వకుంట్ల చంద్రశేఖరరావు భారతదేశ రాజకీయాలలో తన ప్రాభవం చూపించడానికి అధికారికంగా రంగం సిద్ధం అయింది. తెలంగాణ రాష్ట్ర సమితి అనే ప్రాంతీయ పార్టీకి భారతీయ రాష్ట్ర సమితి అనే పేరు మార్పుతో విస్తృత రూపం కల్పించడానికి ఎన్నికల సంఘం ఆమోదముద్ర లభించింది.
భారత రాష్ట్ర సమితి పేరుతో జాతీయ రాజకీయాలలో తన ముద్ర చూపించాలని, ప్రధాని నరేంద్ర మోడీ పతనాన్ని నిర్దేశించాలని కల్వకుంట్ల చంద్రశేఖర రావు తపన పడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. పార్టీకి జాతీయ హోదాతో అధికారిక గుర్తింపు రావడంతో ఇప్పుడు తొలి కార్యక్రమాన్ని ముందు అనుకున్నట్టుగా ఢిల్లీలో కాకుండా హైదరాబాదులోనే నిర్వహించబోతున్నారు. కొత్త రూపంలో ‘భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభ’గా ఈ కార్యక్రమం జరుగుతుంది.
భారత రాష్ట్ర సమితిని ప్రకటించిన తర్వాత అదే పేరుతో మునుగోడు ఎన్నికల్లోనే పోటీ చేస్తామని కేసీఆర్ అన్నారు. కానీ సాంకేతిక కారణాల వలన ఈసీ గుర్తింపు లభించలేదు. తెరాస పేరు మార్పు ప్రక్రియకు ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాల్సిందిగా ఆహ్వానించాలని.. అందుకు 30 రోజుల గడువు ఇవ్వాలని ఈసీ నిర్దేశించడంతో.. ఆ మేరకు కేసిఆర్ పత్రికల్లో ప్రకటన కూడా ఇచ్చారు. 30 రోజుల గడువు పూర్తి అయిన తర్వాత ఎన్నికల సంఘం వాటిని పరిశీలించి భారత రాష్ట్ర సమితిగా పేరు మార్పు ప్రక్రియకు ఆమోదముద్ర వేసింది.
అయితే దసరా పర్వదినం నాడే భారత రాష్ట్ర సమితిని ప్రకటించిన కేసీఆర్.. డిసెంబర్ 9వ తేదీన మధ్యాహ్నం 1.20 గంటలకు హస్తినలో భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని జాతీయ స్థాయిలో అందరి దృష్టిని తమ పార్టీ వైపు రాబట్టుకుంటామని ప్రకటించారు. అధికారికంగా ఈసీ గుర్తింపు రాకపోవడంతో ఆ కార్యక్రమం ఆలస్యం అవుతూ వచ్చింది.. తగిన సన్నాహాలు చేసుకోలేదు. 8వ తేదీన ఈసీ గుర్తింపు రావడంతో ఒక్కరోజులో హస్తినలో కార్యక్రమం నిర్వహణ సాధ్యం కాదు కాబట్టి.. భాగ్యనగరంలోని పార్టీ కార్యాలయంలోనే భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభను భారీగా నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు.
అదే ముహూర్తానికి అంటే మధ్యాహ్నం 1.20 గంటలకు హైదరాబాదులో పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. గుజరాత్ ఎన్నికలలో అపురూపమైన విజయాన్ని నమోదు చేయడం ద్వారా దేశవ్యాప్తంగా కూడా తన హవాకు తిరుగులేని ఆదరణ ఉన్నదని నరేంద్ర మోడీ నిరూపించుకుంటున్న నేపథ్యంలో.. ఆయన ప్రభుత్వాన్ని పతనం చేయడం ఒక్కటే తన లక్ష్యంగా ఉద్యమిస్తున్న కేసీఆర్ ఏ స్వరంలో ఈ ఆవిర్భావ సభలో విరుచుకుపడతారో వేచి చూడాలి.
ప్రధాని మోడీ మీద కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రకటిస్తున్న యుద్ధానికి ఇది తొలి శంఖారావం అవుతుంది. ముందు ముందు ఏ రకంగా తన జాతీయ పార్టీకి ఇతర రాష్ట్రాలలో కూడా ఆదరణ రాబడుతూ ముందుకు తీసుకువెళతారో చూడాలి.