ఇండియాలో కోవిడ్-19 ని దాదాపు మర్చిపోయారు. చైనాలో జీరో కోవిడ్ పాలసీ వల్ల జనం పిచ్చెక్కిపోతున్నారు.
కానీ అమెరికాలో పరిస్థితి ఈ రెండు దేశాలకూ భిన్నంగా ఉంది. కోవిడ్-19 వల్ల ప్రపంచమంతా ఎఫెక్టయినా అమెరికా ఎక్కువగా ఎఫెక్టయిందేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయి కొన్ని పరిస్థితులు, గణాంకాలు చూస్తుంటే.
కోవిడ్-19 వచ్చి తగ్గినవాళ్లల్లో కొంతమందికి లాంగ్ కోవిడ్ లక్షణాలు కొనసాగడం గురించి చాలామంది విన్నారు. ఇండియాలో చుట్టూ చూసినా ఈ లాంగ్ కోవిడ్ లక్షణాల బారిన పడిన వాళ్లు పెద్దగా కనపడట్లేదు. కానీ అమెరికాలో లెక్కగా చూసినా, ఆ దేశ జనాభా నిష్పత్తి ప్రకారం లెక్కేసినా ఎక్కువగానే ఉన్నారు.
ఇంతకీ లాంగ్ కోవిడ్ అంటే ఏవిటి? ఉదాహరణకి ఒక కేస్ చూద్దాం.
చార్లెట్ అనబడే 41 ఏళ్ల యువతి 2020 నవంబర్ లో కరోనా బారిన పడింది. క్రమంగా కోలుకున్నా ఆమెకు విపరీతమైన చెవిపోటు మొదలయింది. తర్వాత ఆమె నడకలో మార్పొచ్చింది. చీటికీమాటికీ తూలి పడిపోవడం జరిగేది. ఎందుకో పరీక్షలు నిర్వహిస్తే తేలిందేమిటంటే కోవిడ్-19 కారణంగా ఆమె వెస్టిబ్యులర్ నెర్వ్ దెబ్బతిందని…ఫలితంగా ఆమె బాడీని బ్యాలెన్స్ చేసుకునే సిస్టం కోల్పోయిందని. డాక్టర్లు చెప్పిందేమిటంటే ఆమె నడక అప్పుడప్పుడే నడక నేర్చుకుంటున్న ఏడాది పాపతో సమానమని. ఒక రకంగా వైకల్యం వచ్చిందని అర్థం.
దీనికి తోడు ఆమె జ్ఞాపకశక్తి కూడా మందగించడంతో ఒక పెద్ద హాస్పిటల్లో పేషెంట్ కేర్ విభాగంలో పనిచేస్తున్న ఆమె తన ఉద్యోగాన్ని కొల్పోవల్సి వచ్చింది.
ఇటువంటివి లెక్కకు మించి ఉన్నాయని తాజా నివేదిక తెలుపుతోంది. ఇప్పటివరకు దాదాపు 20 లక్షల నుంచి నుంచి 40 లక్షల మంది వరకు లాంగ్ కోవిడ్ వల్ల ఉద్యోగాలు కొల్పోయిన వాళ్లున్నారట అమెరికాలో. వీళ్లంతా లేబర్ ఫోర్స్ కి చెందిన వాళ్లు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలైతే వెంటనే భర్తీ చేయవచ్చు కానీ ఇతర ఉద్యోగాల్లో అంత విరివిగా అభ్యర్థులు దొరకరు అక్కడ. అదే అమెరికా వ్యవస్థలో ఉన్న ఒక పొరపాటు.
సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కి కోకొల్లలుగా హెచ్1బి వీసాలిచ్చి అమెరికాకి పిలుస్తున్నట్టు ఇతర విభాగాల్లో విదేశాలనుంచి వర్కర్స్ ని పిలిపించునే వ్యవస్థ ఇంకా పెరగలేదు. ఇప్పుడిప్పుడే మెక్సికన్స్ కి ఆ రంగాల్లో తలుపులు తెరుస్తోంది.
ఇండియాలో కూడా లాంగ్ కోవిడ్ బారిన పడినవాళ్లు, పర్యవసానంగా ఉద్యోగాలు పోగోట్టుకున్నవాళ్లు ఉండవచ్చేమో గానీ దీనిపై విస్తృతమైన సమాచారం మాత్రం ప్రచారం కాలేదు. ఎందుకంటే ఆయా ఉద్యోగాలు ఫిల్ అయిపోవడానికి ఇక్కడ అన్ని విభాగాల్లోనూ కావాల్సినంత జనాభా ఉంది. కనుక లాంగ్ కోవిడ్ వల్ల వ్యక్తులకి, వాళ్ల కుటుంబాలకి ఇబ్బందులుడవచ్చేమో గానీ దేశ ఆర్థిక పరిస్థితికి పెద్దగా దెబ్బ పడదు.
కానీ అమెరికాలో లాంగ్ కోవిడ్ బాధితుల వల్ల దేశ ఆర్థిక పరిస్థితి ప్రభావితమౌతోంది. వెంటనే ఆయా ఉద్యోగాలు భర్తీ చేయలేకపోవడం, తద్వారా ప్రొడక్టివిటీ పడిపోవడం, ఆపైన వైద్య సాయం…ఇలా మొత్తం లెక్కేసుకుంటే ప్రభుత్వం మీద పడే భారం ఏకంగా 4 ట్రిలియన్ డాలర్స్ అట.
దీనినిబట్టి అర్థమయ్యేదేమిటంటే అమెరికాకి ఇప్పుడు మరొక అవసరం పెద్దదవుతోంది. సాఫ్ట్వేర్ రంగం కోసం మాత్రమే కాకుండా హెల్త్ కేర్, ప్లంబింగ్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్…ఇలా అనేక విభాగాల కోసం విదేశీయులకి గణనీయంగా వీసాలిచ్చి పిలిపించుకోవాలి.
500$ ల టెస్లా ప్లగ్ ని బిగించడానికి 1000$ సర్వీస్ చార్జ్ వసూలు చేసే పరిస్థితి అమెరికాలో ఉందంటే వర్క్ ఫోర్స్ ఎంత తక్కువగా ఉందో, డిమాండ్ ఎంత ఎక్కువగా ఉందో తెలుస్తోంది.
అమెరికాలో ఎంత శ్రీమంతుడైనా కార్ డ్రైవర్ ని అంత తేలిగ్గా పెట్టుకోలేడు. ఇండియాలో అలా కాదు. ఇక్కడ మధ్యతరగతి వ్యక్తి కూడా ఇద్దరు పనిమనుషుల్ని పెట్టుకోగలడు. ఎగువ మధ్యతరగతికి వస్తే చాలు డ్రైవర్ని మెయింటైన్ చేయగలడు.
ఫోన్ కొడితే ఇంటికొచ్చి హెయిర్ కటింగ్ చేసి వెళ్లిపోయే బార్బర్స్, టాయిలెట్స్ కడిగి వెళ్లే క్లీనర్స్ అందరూ అర్బన్ క్లాప్ యాప్ లో దొరికేస్తున్నారు ఇండియాలో. ఇదంతా వర్క్ ఫోర్స్ ఉండబట్టి జరుగుతోంది. ఇండియాలో యువ జనాభా ఎక్కువ కాబట్టి పోటీతత్వంతో ఈ సేవలు మరింత విస్తృతమౌతున్నాయి. ఆ పరిస్థితి అమెరికాలో కూడా రావాలంటే వర్క్ ఫోర్స్ కి వీసాలివ్వడం మొదలు పెట్టాలి. ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికా ఇండియాలా మారాలి.
దేశం అభివృద్ధి చెందాలంటే ఎవరి పనులు వారే చేసేసుకోవడం కాకుండా…నలుగురికీ పనులు కల్పిస్తూ జీవించాలి. ఆ పద్ధతిని ఇండియాని చూసి నేర్చుకోవాలి.
– శ్రీనివాసమూర్తి