నాగచైతన్య-సమంత జంట విడాకులు తీసుకోవడం చిత్రపరిశ్రమతో పాటు బయటి సమాజంలో కూడా పెద్ద చర్చనీయాంశమైంది. ప్రధానంగా సమంత వైఖరే విడాకులకు దారి తీసిందనే ప్రచారం విస్తృతమైంది.
మరీ ముఖ్యంగా ఫ్యాషన్ డిజైనర్ ప్రీతమ్ జుకల్కర్‌తో సాన్నిహిత్యమే సమంత-నాగచైతన్య మధ్య విభేదాలకు కారణమైందనే బలమైన వాదన తెరపైకి వచ్చింది. అలాగే పిల్లల్ని కనే విషయంలో అక్కినేని కుటుంబంతో సమంతకు తీవ్రస్థాయిలో విభేదాలు రావడం, అవే విడిపోయే వరకూ వెళ్లాయనేది మరో వాదన.
ఈ నేపథ్యంలో సమంత తాజాగా భావోద్వేగ ట్వీట్ చేశారు. నాగచైతన్యతో విడిపోవడం, అనంతరం తనపై సాగుతున్న దుష్ప్రచారంపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మరొకరితో ఎఫైర్స్‌పై నిజానిజాలేంటో ఆమె ట్విటర్ వేదికగా తేల్చి చెప్పారు.
‘నాపై మీరు చూపిస్తున్న సానుభూతికి కృతజ్ఞతలు. అయితే, కొందరు నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ రూమర్స్ వ్యాప్తి చేస్తున్నారు. నాకు ఎఫైర్స్ ఉన్నాయని, పిల్లల్ని వద్దనుకున్నానని, అబార్షన్ చేయించుకున్నానని, నేను అవకాశవాదినని అంటున్నారు. విడాకులు తీసుకోవడం అనేది ఎంతో బాధతో తీసుకున్న నిర్ణయం. నన్ను ఒంటరిగా వదిలేయండి. వ్యక్తిగతంగా నాపై దాడి నిర్దయతో కూడుకున్నదే. భవిష్యత్‌లో ఇలాంటి వాటిని ఎన్నటికీ సహించను’ అని సమంత ట్వీట్ చేశారు.
రూమర్స్ వ్యాప్తి చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేయడం ద్వారా…వాటిలో నిజం లేదని తేల్చి చెప్పినట్టైంది. అలాగే తనపై లేనిపోని అసత్య ప్రచారాలు, వ్యక్తిగత దాడి చేస్తున్న వాళ్లను ఎప్పటికీ సహించనని ఘాటుగా హెచ్చరిక చేయడం గమనార్హం.