మూవీ రివ్యూ: కొండపొలం

టైటిల్: కొండ పొలం రేటింగ్: 2.5/5 తారాగణం: వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్, సాయిచంద్, రవిప్రకాష్, హేమ, కోట శ్రీనివాస రావు, మహేష్ విట్టా, రచ్చ రవి తదితరులు కెమెరా: జ్ఞాన శేఖర్…

టైటిల్: కొండ పొలం
రేటింగ్: 2.5/5
తారాగణం: వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్, సాయిచంద్, రవిప్రకాష్, హేమ, కోట శ్రీనివాస రావు, మహేష్ విట్టా, రచ్చ రవి తదితరులు
కెమెరా: జ్ఞాన శేఖర్
ఎడిటర్: శ్రవణ్ కటిననేని
సంగీతం: కీరవాణి
నిర్మాతలు: సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి
రచన: సన్నపురెడ్డి వెంకటరామి రెడ్డి 
దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి
విడుదల తేదీ: 8 అక్టోబర్ 2021

నవలల స్ఫూర్తితో సినిమాలు తీయడం 1970ల కాలంలో ఎక్కువగా ఉండేది. కాలక్రమంలో తగ్గాయి. మళ్లీ ఇన్నాళ్లకి ఒక బహుమతి నవల ఆధారంగా ఈ చిత్రం వచ్చింది. తానా నవలల పోటీలో ఉత్తమ బహుమతి పొందిన సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన “కొండపొలం” నవల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఇది. 

కొన్ని కథలు చదవడానికి బాగుంటాయి. రచయిత చేసే వర్ణనలు, పాత్రల విశ్లేషణ కట్టిపారేయొచ్చు. పాఠకుడు అక్షరాల్లోంచి యాంబియన్స్ ని ఊహించుకుంటాడు. తనకు నచ్చిన విధంగా ఊహల్లో సెట్ వేసుకుంటాడన్నమాట. 

కానీ సినిమాగా మారినప్పుడు వర్ణనలు దృశ్యంగా మన ముందుకొచ్చేస్తాయి. ఇక అక్కడ ఊహించుకోవడానికి చాన్స్ ఉండదు. అలాగే పాత్రలు కూడా నటీనటుల రూపంలో కళ్ల ముందే కదులుతుంటారు. కనుక ఊహలకి ఫుల్ స్టాప్ పెట్టేసి దర్శకుడు చూపించేది చూడాలి. అలా ఒరిజినల్ రచయిత ప్రభావం కన్నా దర్శకుడి ప్రమేయం ప్రేక్షకులని నడిపిస్తుంది. అన్నీ కుదిరితే నవల లాగ సినిమా కూడా కట్టిపారేస్తుంది. లేకపోతే పరీక్షపెడుతుంది. 

అదిలా ఉంటే, బహుమతి పొందిన నవలలన్నీ కథాపరంగా అద్భుతాలు కాకపోవచ్చు. భాషలోని యాస కారణంగానో, సరికొత్త నేపథ్యం మూలానో పురస్కారాలు పొంది ఉండొచ్చు. లేదా కేవలం ఫలానా పోటీకి వచ్చిన నవలల్లో బెస్ట్ అవడం వల్ల ప్రైజ్ రావచ్చు. సినిమా తీయడానికి అవార్డు వచ్చిందన్నకారణం ఒక్కటీ సరిపోదు. కథ, కథలో భవోద్వేగాలు లెక్కేసుకుని దిగాలి. 

“కొండపొలం” కథంతా సింగిల్ లొకేషన్లో పూర్తవుతుంది. కానీ సినిమాగా రెండున్నర గంటల పాటు ఒకే చోట కథ నడాపలంటే కష్టమే. 

కథంతా అక్కడక్కడే తిరుగుతూ చూసిన సన్నివేశాలే మళ్ళీ మళ్ళీ చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఓపెనింగులోనే క్లైమాక్స్ చెప్పేయడం వల్ల ప్రేక్షకులకి క్యూరియాసిటీ కూడా ఏమీ ఉండదు. 

“నెసెసిటీ ఈజ్ ది మదర్ ఆఫ్ ఇన్వెన్షన్” అంటారు. అవసరాన్ని బట్టి మనిషి దేన్నైనా కనుగొంటాడు. ఒక్కోసారి తనలో భయం పొరల చాటున ఉన్న ధైర్యాన్ని కూడా కనుగొంటాడు. జాబ్ ఇంటర్వ్యూస్ లో సమాధానం చెప్పడానికి కూడా స్టేజ్ ఫియరుతో నీళ్లు నమిలే ఒక యువకుడు తాత ప్రోత్సాహంతో అడవిలోకి గొర్రెల్ని మేపడానికి వెళ్లి పులినే ఎదిరించి ఎలా ధైర్యాన్ని కూడగట్టుకున్నాడనేది కథ. ఆ ధైర్యంతో ఉద్యోగాన్ని ఎలా పొందాడనేది ముగింపు. 

అందరూ భయపడే ఒక శక్తిని ఓడిస్తే ఎక్కడలేని ఆత్మస్థైర్యం వస్తుంది. ఆ ఆత్మస్థైర్యం జీవితంలో ఇంకెన్నో పొందేలా చేస్తుంది. ఒక్కమాటాలో చెప్పాలంటే ఈ “కొండపొలం” కథలో సారాంశం ఇంతే. మిగతాదంతా యాంబియన్స్ మాత్రమే. 

“పులినే ఎదిరించి గొర్రెల్ని కాపాడుకున్నాం. మీ మనుషులు మాకొక లెక్కా” అని హీరో అడవిలో అడ్డుపడ్డ కొందరితో అంటాడు.

ఒకరకంగా అక్కడే కథ అయిపోయినట్టు. హీరో కి అప్పటివరకు ఏ ధైర్యమైతే లేదో అది పొందేశాడని ఈ సన్నివేశం చెబుతుంది. ఆ ధ్గైర్యంతోటే ఇంటర్వ్యూల్లో మనుషులు అడిగే ప్రశ్నలకి ధైర్యంగా సమాధానం చెప్పేసి కలెక్టరైపోతాడని దర్శకుడు చెప్పబోతున్నాడని తెలిసిపోతుంది… ఎందుకంటే ఓపెనింగ్ సీనే యూపీఎస్సీ ఇంటర్వ్యూ కాబట్టి. 

గొర్రెల్ని మేపడానికి ఊళ్లో నీళ్లు లేక అడవుల్లోకి తోలుకుపోయి జీవనం సాగించే మనుషులు, అక్కడ పులుల్లాంటి కౄర మృగాలతో పాటు గొర్రెల దొంగలతో పడే ఇబ్బందులు, గంధపుచెక్కల స్మగ్లర్ల ప్రస్తావన..మొత్తానికి అడవి కష్టాలన్నీ ఉన్నాయిందులో. 

ప్రాక్టికల్ గా సబ్జెక్ట్ నెర్చుకున్న నేపథ్యంతో అడవిని కాపడడానికి ఏరికోరి ఫారెస్ట్ సర్వీసులో చేరతాడు హీరో. ఇదే కథకి ముగింపు. 

ఒరిజినల్ నవలలోనే ఉందో లేక దర్శకుడి సృజనాత్మకతో తెలియదు కానీ గొర్రెల చుట్టూ నడిపిన సెంటిమెంటు లాజిక్ కి అందదు. కాపర్లు గొర్రెల్ని పెంచేదే వాటిని మాంసానికి అమ్మడానికి. గొర్రెల్ని పులి నోట కరుచుకుపోతుంటే తమ సంపాదన పోతోందన్న బాధ వారిలో చూపించాలి తప్ప నడుము విరిగిన గొర్రెని చూసి మహేష్ విట్టా ఏడవడం…తల్లి గొర్రెని పులి నోట కరుచుకుపోతే పిల్ల గొర్రె కోసం తల్లి గొర్రెని హీరో ప్రాణాలకు తెగించి కాపాడడం వంటివి ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకి షార్ట్ స్టోరీ టైపులో బాగుంటాయేమో తప్ప మెచ్యూర్ ఆడియన్స్ కి అర్థం కావు. 

పులి బతికేదే వేట మీద. అది నివసించే అడివిలోకి వెళ్లి, గొర్రెల మీద సెంటిమెంటుతో దాని నోటి దగ్గర ఆహారాన్ని లాక్కుని, దానిని హింసించే సన్నివేశం చాలా ఎమెచ్యూర్ రైటింగ్. ప్రతిఘటన తప్పు కాదు. దేనికోసమో సంభాషణల ద్వారా చెప్పాలి. నేపథ్యం బాగుంది కాబట్టి సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ధోరణిలో నడపుండాల్సిన కథ ఇది. 

ఇక నటీనటుల విషయానికొస్తే హీరో తండ్రిగా సాయిచంద్, హీరోయిన్ తండ్రిగా చేసిన నటుడు పాత్రలకి చాలాబాగా సరిపోయారు. కటారి రవీంద్రగా వైష్ణవ్ తేజ్ కూడా సెట్టయ్యాడు. 

ఓబులమ్మ పాత్రలో రకుల్ ప్రీత్ మాత్రం నేటివిటీకి సరిపోలేదు. ఎంత లంగాఓణీ వేసి విలేజ్ లుక్కిచ్చే ప్రయత్నం చేసినా ఆమెలో ఉన్న పాష్ లుక్ దాగలేదు. చూస్తున్నంతసేపూ రకులే కనిపించింది తప్ప ఓబులమ్మ కనపడలేదు. అదే పెద్ద మైనస్. ఇతర పాత్రల్లో రవిప్రకాష్ బాగా చేసాడు. 

బలమైన భావోద్వేగాలు పండాల్సిన చోట పండలేదు. అంత సిన్సియరుగా సహజత్వానికి దగ్గరగా తీస్తూనే మధ్యలో వైష్ణవ్-రకుల్ మీద ఒక గ్రూప్ డ్యాన్స్ పాట పెట్టారు. అది నాన్ సింక్ లాగ ఉంది. 

నేపథ్య సంగీతం “మర్యాదరామన్న”ని గుర్తుకు తెస్తుంది. అయినా ఈ సినిమాకి మెయిన్ అసెట్ మ్యూజిక్కే. కెమెరా వర్క్ బాగుంది కానీ కరువు వాతావరణాన్ని పెద్దగా చూపించలేదు. కథంతా పచ్చని అడవుల్లో నడుస్తుంది. కానీ అవి తాగడానికి ఆ పచ్చదనం మధ్య నీళ్లు మాత్రం ఉండవేంటో! 

సంభాషణలు ఇంకా పదునుగా ఉంటే బాగుండేది. నిజానికి ఆ అవకాశం ఉంది. కానీ పెద్దగా వాడుకోలేదు. 

అవార్డుల కోసమే తీసారేమో అనిపించిన సినిమా ఇది. చిన్నపాయింటుతో రాసిన నవలని ఉన్నంతలో సినిమాటిక్ చేసారు. కానీ కథ చిన్నగా ఉన్నప్పుడు ప్రతి మలుపులోనూ తీవ్రత చూపించాలి. అది లోపించిన ఈ సినిమా ఆకట్టువాల్సినంతగా ఆకట్టుకోదు. 

బాటం లైన్: పొలం పండలేదు