ఒకవైపు కరోనా వర్రీస్ కొనసాగుతున్నా, రికవరీస్ మాత్రం బాగానే ఉన్నాయి ఇండియాలో. ఈ క్రమంలో ఇండియాలో కరోనా వైరస్ బారి నుంచి బయట పడిన వారి సంఖ్య పది లక్షలను దాటేసిందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. రికవరీ పర్సెంటేజ్ 65 శాతం వరకూ ఉందని సమాచారం. దేశంలో ఇప్పటి వరకూ రిజిస్టర్ అయిన కరోనా కేసుల సంఖ్య 15,83,792 కాగా, వీరిలో కోలుకున్న వారి సంఖ్య 10,20,582గా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య 5,28,242 కాగా కోవిడ్-19 వైరస్ తో మరణించిన వారి సంఖ్య 34,968 అని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
16 లక్షల స్థాయి మంది కోవిడ్ -19 బారిన పడగా వారిలో పది లక్షల మందికి పైగా ఇప్పటికే కోలుకోవడం సానుకూలాంశమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇండియాలో రికవరీ రేటు మెరుగ్గా ఉందని, కోవిడ్-19 మరణాల శాతం క్రమక్రమంగా తగ్గుతోందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
ఇక గత ఇరవై నాలుగు గంటల్లో దేశంలో అత్యధిక కేసులు రిజిస్టర్ అయిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవడం గమనార్హం. ఏపీలో 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో తొమ్మిది వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో అత్యధిక టెస్టులు చేసిన రాష్ట్రంగా కూడా ఏపీ నిలిచింది. గత ఇరవై నాలుగు గంటల్లో 70 వేలకు పైగా పరీక్షలను నిర్వహించారు ఏపీలో. ఈ స్థాయిలో మరే రాష్ట్రంలోనూ పరీక్షలను నిర్వహించడం లేదు.
టెస్టింగ్, ట్రేసింగ్ మాత్రమే కరోనాను నిరోధిస్తుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఇటీవల కూడా మరోసారి స్పష్టం చేసింది. ఎక్కువ పరీక్షలు చేయాలని.. అప్పుడే ఉన్న కేసులన్నీ బయటకు వస్తాయని, తద్వారా కోవిడ్ -19ని వ్యాపించకుండా నివారించడానికి సాధ్యం అవుతుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు సూచించింది. అయితే కొన్ని రాష్ట్రాలు ఇప్పటికీ టెస్టింగ్స్ విషయంలో నంబర్లనే విడుదల చేయడం లేదు! ఎన్ని పరీక్షలు చేసింది కూడా చెప్పడం లేదు. దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతూ, ఇప్పుడు కరోనాకు గురై మరణించిన వారిని కరోనాతో మరణించినట్టుగా ప్రకటించడానికి లేదంటూ కొన్ని రాష్ట్రాల్లో వైద్య ఆరోగ్య శాఖా మంత్రులే వితాండవాదం చేస్తూ ఉన్నారు! వారిని కరోనాతో మరణించారని చెప్పడానికి వీల్లేదని వారు వాదిస్తూ ఉన్నారు.