అద్దాల మేడలో కూర్చున్నవారు ఎదుటవాళ్ల మీద రాళ్లేయకూడదు. పైగా మనం నికార్సు, నిప్పు కానప్పుడు ఎదుటవాళ్ల మీద బురదేయడానికి అస్సలు ట్రయ్ చేయకూడదు. కానీ ఆంధ్రజ్యోతి ఆర్కే అలా కాదు, మొండిగా, పరమ జగమొండిగా వుంటారు. తాను అనుకున్నదే వార్త, తాను రాసిందే కామెంట్ అన్నట్లుగా వెళ్తారు. జగన్ అయినా, కేసిఆర్ అయినా ఆయన ఒంటి కాలిమీద లేచిపోతారు. ఈ మధ్య అలాగే కెలికారు కేసిఆర్ ప్రభుత్వం కోవిడ్ మరణాలను దాస్తూంది అంటూ ఓ పరిశోధనాత్మక కథనం వండి వార్చారు.
ఈ కథనం నిజమా? కాదా? అన్నది పక్కన పెడితే, తెరాస సంబంధిత నమస్తే తెలంగాణ పత్రిక మాత్రం సర్రున లేచింది. ఈ పత్రిక అంతలా లేవడానికి కూడా రీజన్ వుంది. అబద్దాలకు నమస్తే అంటూ ఓ సెటైరికల్ హెడ్డింగ్ పెట్టి గాట్టి వ్యాసం ఆంధ్రజ్యోతిలో రాయడమే ఇందుకు కారణం.
ఇక అక్కడి నుంచి చూస్కో నా సామి రంగా, నమస్తే తెలంగాణ, ఆర్కే పుట్టుపూర్వోత్తరాలు అన్నీ తవ్వి పోస్తోంది. తెలంగాణ ఉద్యమకాలం నుంచి ఇప్పటి వరకు ఆర్కే ఎన్నిరకాల వార్తలు వండి వార్చారు. వాటిలో సత్యం ఎంత? అవన్నీ అబద్దాలు అని ఎలా రుజువైంది. ఇలా డిటైల్డ్ గా గత మూడు రోజులుగా వార్తలు వండి, వండి పోస్తున్నారు. మొదటి పేజీలో పావు భాగం, రెండో పేజీ మొత్తం ఆర్కేను ఆంధ్రజ్యోతిని ఎండ గట్టడానికే కేటాయిస్తున్నారు.
కానీ పాపం, రుజువులు, సాక్ష్యాలు, తేదీలతో ఆంధ్రజ్యోతి వార్తలు అన్నీ బయటకు తీస్తూ, వాటి లెక్కలు తేలుస్తూ వుంటే, ఒక్క వార్త రాసిన తరువాత మళ్లీ ఈ రోజులు కిమ్మనడం లేదు ఆర్కే. తమలపాకుతో ఒకటంటే తలుపుచెక్కతో నాలుగు అంటించినట్లు అయింది పరిస్థితి. ఏదైనా రివర్స్ లో ఇస్తే, మళ్లీ అట్నుంచి మరో నాలుగు రాళ్లు ఎక్కువ పడతాయి. అందుకే మౌనం ఉత్తమం అన్నది ఇప్పుడు ఆంధ్రజ్యోతి పాలసీ అయినట్లు కనిపిస్తోంది.