ఆంధ్రజ్యోతి పత్రికన్నా, ఏబీఎన్ చానల్ అన్నా టీడీపీకి మన అనే భావన. అందుకు తగ్గట్టుగానే ఆ పత్రికలో, చానల్లో వార్తా కథనాలు ప్రచురితం కావడంతో పాటు ప్రసారమవుతుంటాయి. అలాంటి పత్రికలో గురువారం ‘టార్గెట్’ టీడీపీ శీర్షికతో ప్రచురిం చిన కథనం…ఆ పార్టీలో వణుకు పుట్టించేలా ఉంది. సహజంగా టీడీపీకి నష్టం కలిగించే అంశాలకు ఆ పత్రికలో చోటు ఉండదు. అలాంటిది ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు కొత్తగా నియామకం అయిన నేపథ్యంలో…దాని వెనుక బీజేపీ వ్యూహం ఏంటో విశదీకరిస్తూ రాశారు. ఈ కథనం ప్రకారం టీడీపీకి ఇక నూకలు చెల్లినట్టే. ఒకసారి కథనాన్ని విశ్లేషిద్దాం.
పశ్చిమబెంగాల్, త్రిపురలో మాదిరిగా రాజకీయ వ్యూహానికి బీజేపీ తొలి అడుగు కన్నా లక్ష్మినారాయణ ప్లేస్‌లో సోము వీర్రా జును తీసుకొచ్చారనేది వార్త సారాంశం. త్రిపురలో బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం అక్కడ సీపీఎంను దెబ్బ తీయడమేనని, అలాగే పశ్చిమబెంగాల్లో బలంగా ఉన్న ప్రతిపక్ష సీపీఎంను కూకటి వేళ్లతో సహా పెకలిస్తూ శూన్యం చేయ డం వల్లే బీజేపీ బలపడుతోందని, రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు మార్గం సుగుమం చేసుకుందని రాసుకొచ్చారు.
ఆ రాష్ట్రాల్లో అనుసరిస్తున్న ఫార్ములానే ఏపీలో కూడా అమలు చేయడానికి ముఖ్యంగా ప్రతిపక్ష టీడీపీని బలహీనపరచాలనే ఎత్తుగడలో భాగంగా…ఆ పార్టీ అంటే ఒంటికాలిపై లేచే సోము వీర్రాజే సరైన నాయకుడిగా బీజేపీ భావించిందని ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది. రాజధానికి అనుకూలంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మినారాయణ జనసేనాని పవన్‌కల్యాణ్‌తో కలిసి ఫిబ్రవరిలో భారీ ర్యాలీకి సిద్ధమయ్యారని, దాన్ని బీజేపీ అధిష్టానం బ్రేక్ వేసిందని కథనంలో పేర్కొన్నారు. జగన్ మూడు రాజధానుల ఆకాంక్షకు వ్యతిరేకంగా కన్నా వెళ్లడం కూడా అధిష్టానం ఆగ్రహానికి గురైందని రాసుకొచ్చారు.
ఈ కథనంలో మరీ ముఖ్యంగా సుజనాతో దోస్తీ, చంద్రబాబు డబ్బులిచ్చి లక్ష్మీనారాయణతో మాట్లాడిస్తున్నారని విజయ సాయిరెడ్డి పదేపదే చేసిన ఆరోపణలు కూడా ముప్పు తెచ్చాయని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారంటూ రాశారు. సోము వీర్రాజు నియామకం అయినప్పటి నుంచి ఇక టీడీపీకి గడ్డురోజులే అనే అభిప్రాయం మాత్రం సర్వత్రా వినవస్తోంది. దాన్నే మనసు కష్టమైనా ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది.
చంద్రబాబునాయుడు తన మనుషులను కొందరిని బీజేపీలోకి పంపించి సీట్లు ఇప్పించారని వీర్రాజు ఆరోపించడాన్ని బట్టి…బీజేపీలోకి వలస వచ్చిన వాళ్లపై ఆయన ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారో స్పష్టంగా తెలుస్తోంది. ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న సోము వీర్రాజుకు పార్టీలో బలమైన పట్టు ఉంది. తన మాట చెల్లుబాటు అయ్యేలా నిర్ణయాలు తీసుకోవడంలో చురుగ్గా ఉంటారనే పేరు ఉంది. ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం ఒక రకంగా టీడీపీకి వార్నింగ్ అని చెప్పక తప్పదు. బీజేపీ వ్యూహం ఫలిస్తే మాత్రం టీడీపీ బలహీన పడడం ఖాయం.