ఇదిగో థియేటర్లు తీసేస్తున్నారు..అదిగో థియేటర్ల గేట్లు తెరుస్తున్నారు అంటూ గత రెండు మూడు రోజులుగా వార్తలు వినవచ్చాయి. ఎక్కువ థియేటర్లు చేతిలో వున్నవారు ప్రభుత్వం ఓకె అన్నా కూడా తాము మాత్రం థియేటర్లు తీసేదిలేదు అని చెప్పేసారు. మరోపక్క ఒకరిద్దరు సింగిల్ థియేటర్ జనాలు మాత్రం మేం రెడీ, పాతిక శాతం ఆక్యుపెన్సీ అయినా అని హుంకరించారు. కానీ ఇప్పుడు కేంద్రం థియేటర్లు తెరవడానికి అనుమతి ఇవ్వలేదు. మల్టీఫ్లెక్స్ లు తెరుచుకుంటాయని అనుకున్నారు. అది కూడా లేదని తేలిపోయింది.
ఈ లెక్కన ఆగస్టు కూడా టాలీవుడ్ కు సెలవు నెలగా మారిపోయింది. షూటింగ్ లు ఎలాగూ మరో రెండు వారాల పాటు వుండవు. ఆ తరువాత సంగతి చూడాలి. ఈ లెక్కన సెప్టెంబర్ నుంచే థియేటర్లు అయినా, షూటింగ్ లు అయినా. ఆగస్టు నుంచి షూటింగ్ లు వుంటే, దసరాకు సినిమాలు కొన్నయినా విడుదల చేయవచ్చని భావించారు. ఇక ఇప్పుడు 2020 మీద ఆశలు దాదాపుగా వదిలేసుకోవాల్సిందే.
ఆర్ఆర్ఆర్ సినిమా సంగతి కూడా ఇలాగే వుంది. ఏకంగా ఆ సినిమా దర్శకుడు రాజమౌళికే కరోనా వచ్చింది. అందువల్ల ఇక ఇప్పట్లో ఈ సినిమా యూనిట్ షూటింగ్ మాట మాట్లాడదు. వాక్సీన్ వస్తే తప్ప షూటింగ్ ప్రారంభం కాదు. అంటే ఆర్ఆర్ఆర్ 2022 సంక్రాంతికే తప్ప, ఈ లోపు విడుదల కావడం అసాధ్యం కావచ్చు.