అంతా ఊహించినట్టే జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ తగ్గలేదు. ఆర్టీసీని సగం ప్రైవేటీకరిస్తామని పరోక్షంగా ప్రకటించారు. విధుల్లోకి రాకపోతే ఉద్యోగం ఊడినట్టేనని ప్రత్యక్షంగా ప్రకటించారు. ఇదంతా నిన్నటి ముచ్చట. మరి ఇవాళ్టి నుంచి ఏం జరగబోతోంది. సమ్మె 3వ రోజుకు చేరుకుంది. అటు ప్రభుత్వం ఏం చేయబోతోంది? ఇటు ఆర్టీసీ కార్మిక యూనియన్లు ఏం చేయబోతున్నారు?
ప్రభుత్వం ఇప్పటికే తమ వైఖరిని స్పష్టంచేసింది. కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ 15 రోజుల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి, రవాణాశాఖ కమిషనర్ కసరత్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా తక్షణ చర్యగా 2500 బస్సుల్ని అద్దె ప్రాతిపదికన నడపాలని నిర్ణయించారు. స్టేజీ క్యారియర్లుగా నడుస్తున్న 4114 బస్సుల్ని ఆర్టీసీ పరిథిలోకి తీసుకురావాలని నిర్ణయించారు. దీంతో పాటు విధులకు హాజరుకాని ఉద్యోగుల్ని తొలిగించే ప్రక్రియను మరో 2 రోజుల్లో ప్రారంభించే ఆలోచనలో ఉంది ఆర్టీసీ.
ఈ వ్యవహారంపై హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. సమ్మెవల్ల రాష్ట్రంలో నెలకొన్న వాస్తవ పరిస్థితిపై అన్ని డిపోల మేనేజర్లు నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. విచారణను 10వ తేదీకి వాయిదావేసింది. ఇదే సమయంలో ఉద్యోగాల తొలిగింపుపై కోర్టుకు వెళ్తామని ఇప్పటికే ప్రకటించింది ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ. దీనిపై కోర్టు ఇచ్చే ఆదేశాల ఆధారంగా, ఉద్యోగాల తొలగింపు, కొత్త ఉద్యోగాల కల్పన కోసం నోటిఫికేషన్ వంటి అంశాలపై తుది నిర్ణయం తీసుకుంటారు.
విశ్లేషకులు అంచనా ప్రకారం, ఇలా వేల సంఖ్యలో ఉద్యోగాల్ని తొలిగించడం సాధ్యం కాకపోవచ్చు. ఈ విషయంలో హైకోర్టు, ప్రభుత్వానికి మొట్టికాయలు వేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇలాంటి జరుగుతుందని కేసీఆర్ ఊహించలేనంత అమాయకుడు కాదని, కాబట్టి ఉద్యోగాలు తొలిగింపు స్థానంలో సమ్మె చేస్తున్న ఉద్యోగుల్ని జీతం లేకుండా జీవితకాలం సస్పెండ్ చేసే అంశాన్ని పరిశీలిస్తారని భావిస్తున్నారు. ఇలా చేస్తే అది కోర్టు పరిధిలోకి వెళ్లదు. ఒకవేళ ఇలా జరిగినా అది కార్మికులకు నష్టమే.
మరోవైపు ఆర్టీసీ ప్రైవేటీకరణ ప్రక్రియ మరింత ఊపందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. స్టేజీ కారియర్లను ఆర్టీసీలోకి తీసుకోవడంతో పాటు.. మరిన్ని ప్రైవేట్ బస్సుల్ని అగ్రిమెంట్ రూపంలో సంస్థలోకి ఆహ్వానించడం అనివార్యంగా కనిపిస్తోంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఆ పని ఇవాళ్టి నుంచే మొదలుకాబోతోంది. అంటే అధికారిక రిక్రూట్ మెంట్ ను ఇలా అనధికారికంగా మొదలుపెట్టారని అనుకోవాలి. ఆర్టీసీలో జరుగుతున్న ఈ మొత్తం వ్యవహారాలపై సునీల్ శర్మ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ, ఈరోజు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించబోతోంది.
ఈ ప్రతిపాదనలు సమర్పించడానికి వారం రోజులు గడువు ఇవ్వగా, ఈరోజే ప్రభుత్వానికి అందించడానికి కమిటీ నిర్ణయించడం విశేషం, ఆశ్చర్యకరం. మరోవైపు కార్మికులు సమ్మెను ఉధృతం చేశారు. ఆదివారం అన్ని డిపోల వద్ద బతుకమ్మ ఆడి నిరసన తెలిపిన కార్మికులు.. ఇవాళ్టి నుంచి రోడ్లపైకి రావాలని నిర్ణయించారు. ముందుగా ఈరోజు గన్ పార్క్ వద్ద అమరవీరులకు ఆర్టీసీ జేఏసీ నివాళులు అర్పించాలని నిర్ణయించింది. ఆ తర్వాత ఇందిరాపార్క్ వద్ద నిరాహార దీక్షకు దిగాలని సంకల్పించింది.
దీనికి పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినప్పటికీ జేఏసీ నేతలు ముందుకెళ్తున్నారు. అటు ప్రభుత్వం మంకుపట్టు వీడకపోవడం, ఇటు కార్మికులు సమ్మె నుంచి వెనక్కి తగ్గకపోవడంతో.. ఆర్టీసీ సంక్షోభం మరింత ముదిరింది.