నెల్లూరు జిల్లా వైసీపీలో పెద్ద కుదుపు, జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అరెస్టై, ఆ వెంటనే బెయిల్ పై విడుదలయ్యారు. ఓ ప్రభుత్వ అధికారిణి పెట్టిన కేసులో ఏ-1గా ఉన్న శ్రీధర్ రెడ్డి విడుదల అనంతరం చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపాయి. సొంత పార్టీలోనే తనకు శత్రువులున్నారంటూ, వారిని ఓ కంట కనిపెట్టాలంటూ జగన్ కి ఆయన సూచించడం చర్చనీయాంశమైంది. ఇంతకీ శ్రీధర్ రెడ్డిని టార్గెట్ చేసింది ఎవరు? నెల్లూరు వైసీపీలో ముసలం ఎందుకు పుట్టింది?
రాజకీయ నేపథ్యం లేకపోయినా విద్యార్థి పోరాటాలతో గుర్తింపు తెచ్చుకున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ ఏర్పాటు అనంతరం జగన్ కి అత్యంత నమ్మకస్తుడిగా మారారు. అందుకే 2014లో కొంతమంది ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వొద్దని సూచించినా వినకుండా టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. 2019లోనూ అదే సీన్ రిపీటైంది. అయితే వైరి వర్గం మాత్రం కోటంరెడ్డిని టార్గెట్ చేయడం ఆపలేదు. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో చివరి నిమిషంలో టీడీపీ నుంచి వైసీపీలో చేరి నెల్లూరు ఎంపీ టికెట్ సాధించుకున్నారు ఆదాల ప్రభాకర్ రెడ్డి.
అప్పటి వరకూ ఆయన నెల్లూరు రూరల్ టీడీపీ అభ్యర్థి, అంటే కోటంరెడ్డికి ప్రత్యర్థి. ఒకే పార్టీలోకి వచ్చినా ఈ ఎడబాటు వీరిద్దరి మధ్యా అలాగే కొనసాగింది. ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి ఆదాల, తన పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ ఆర్థిక సాయం చేసి, కోటంరెడ్డిని మాత్రం వదిలేశారు. అయితే రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సాయంతో కోటంరెడ్డి బైటపడ్డారు. అప్పట్నుంచి ఆదాల, కోటంరెడ్డి మధ్య దూరం మరింత పెరిగింది.
ఇక సర్వేపల్లి ఎమ్మెల్యే, జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్దన్ రెడ్డి పేరు కూడా ఈ వివాదంలో బైటకు రావడం గమనార్హం. అరెస్ట్ అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే కోటంరెడ్డి, కాకాణి అనుచరులు ఎంపీడీవో సరళకు మద్దతుగా నిలిచారని ఆరోపించారు. తమ లేఅవుట్ కి వాటర్ కనెక్షన్ ఇవ్వకపోవడంపై కాకాణి హస్తం ఉందని కూడా పరోక్షంగా ప్రస్తావించారు. కాకాణి, కోటంరెడ్డి బంధువులే అయినా, ఇటీవల కాలంలో ఎంపీ ఆదాలతో పాటు ఆయన కూడా కోటంరెడ్డిని దూరం పెట్టారు.
సర్వేపల్లి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాలు ఒకదానికొకటి సరిహద్దులుగా ఉంటాయి. ఈ సరిహద్దు ఊర్ల దగ్గర లేఅవుట్ల పంచాయితీ కూడా వీరిమధ్య ఉంది. దీంతో వీరిద్దరికీ కొన్నాళ్లుగా పడటంలేదు. ఇక ముఖ్యమంత్రి జగన్ కి కూడా ఈ అంతర్గత రాజకీయాలు కొన్నినెలల క్రితమే తెలిశాయి. నెల్లూరుకు కోటంరెడ్డి పరిటాల రవిలాగా మారిపోయారని, ఎక్కడికక్కడ అందర్నీ బెదిరిస్తున్నారంటూ వైరివర్గం ఎంపీ ఆదాలతో జగన్ కి ఫిర్యాదు చేయించింది. అయితే జగన్ మాత్రం కోటంరెడ్డి సంగతి నాకు తెలుసు, ఇక ఈ విషయాన్ని మీరు ఇంతటితో వదిలేయండి అని సర్ది చెప్పారు.
కానీ ఆ గొడవే ఇప్పుడు పెరిగి పెద్దదై ఎమ్మెల్యే అరెస్ట్ కి దారితీసింది. రాజకీయ కక్షల నేపథ్యంలోనే వైసీపీ ఎమ్మెల్యే అరెస్ట్ అయ్యారనే విషయం స్పష్టమవుతోంది. కాకపోతే ఇది కాస్తా పార్టీ పరువుని బజారున పెట్టడం, గతంలో టీడీపీ చేసిన అరాచకాల్నే వైసీపీ కూడా చేస్తోందని చర్చ ప్రజల్లో రావడం జగన్ ను ఇబ్బంది పెట్టే విషయం. ఇకనైనా సీఎం జగన్ నెల్లూరు జిల్లా రాజకీయాలపై పూర్తిస్థాయిలో దృష్టిపెడితే బాగుంటుంది. లేదంటే వైసీపీ కంచుకోటకు బీటలు తప్పవు.