రాజకీయం అన్నది ఏడాదికో, అయిదేళ్లకో పరిమితమైనది కాదు. అది ఓ నిరంతర ప్రయాణం. కొన్ని సిద్దాంతాలు, కొన్ని మద్దతులు, కొన్ని సామాజిక బంధాలు, ఇలా చాలా వ్యవహారాలకు కట్టుబడి ప్రయాణించాల్సి వుంటుంది. కేవలం ఓ నాయకుడి మనోభావాల మీదే ఆధారపడి వుండదు. నాయకుడి సామర్థ్యం ఎంత అవసరమో, అదే నాయకుడి ఓపిక, వ్యూహరచన అంతే అవసరం.
పొలిటికల్ ఇండస్ట్రీలో అనుభవం పడించుకున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గత రెండు మూడునెలల్లో వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఆయన చాలా అసహనంతో వున్నారని, అధికారం లేకుండా వుండలేకపోతున్నారని, కనీసం కొన్నేళ్లపాటు వేచి చూడలేకపోతున్నారన్నది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న విషయం. కొత్త ప్రభుత్వం వచ్చింది, తప్పులో, ఒప్పులో కొన్నాళ్లు వేచిచూడాలి. తప్పులు చేస్తే బాబుగారికే మంచిది కదా? ప్రజలకు తెలియవస్తుంది. కానీ అలా వేచి వుండకుండా, ఎందుకు చంద్రబాబు ఇంతలా విరుచుకుపడుతున్నారు. అసహనం వ్యక్తం చేస్తున్నారు.
వాలంటరీ వ్యవస్థ, విలేజ్ సెక్రటేరియట్, దశలవారీ మద్యనిషేధం వంటివి కూడా చంద్రబాబుకు ఎందుకు రుచించడం లేదు. అసలు ఆయన వయోభారం కారణంగానా? అధికారం కోల్పోయిన కారణంగానా? ఎందుకు అంతలా అసహనానికి గురవుతున్నారు. అస్సలు ఒక్కరోజు కూడా ఆగలేకపోతున్నారు? ఇదంతా ఏమిటి? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. లాభం లేకుండా వ్యాపారి వరద జోలకిపోడు అన్నది సామెత. చంద్రబాబు కూడా అంతే. విషయం లేకుండా ఆయన విరుచుకుపడరు. ఆయన ఇంతలా అసహనానికి గురవుతూ, ప్రభుత్వం మీద విరుచుకుపడడానికి పెద్ద కారణమే కాదు, కారణాలే వున్నాయి. అయితే అవి రాజకీయ కారణాలు కాదు. సామాజిక బంధాలు.
తెలుగుదేశం పునాదులు అయిన సామాజిక వర్గాన్ని చాలా సైలంట్‌గా దెబ్బతీసే వ్యూహం అమలు అవుతుండడంతో, పార్టీని నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగా, తాను వున్నానని, తనలో చేవ చచ్చిపోలేదని, పోరాట స్ఫూర్త్తి అణగారిపోలేదని, తెలియచెప్పడంలో భాగమే ఈ అసహనం. అసలు ఆ సామాజిక బంధాలు ఏమిటి? వాటిని దెబ్బతీస్తున్న ప్రభుత్వ వైనమేమిటి? ఇతరత్రా వ్యవహారాలు ఏమిటి? చూద్దాం.
ఇలా చూడ్డానికి ముందు మొహమాటం లేకుండా చెప్పుకోవాల్సిన విషయం తెలుగుదేశం పార్టీకి వున్న మూల సామాజిక బంధాలు. కమ్మ సామాజిక వర్గ ప్రయోజనం అన్న పాయింట్ లేకుండా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగింది అని చెబితే నమ్మడానికి రాజకీయాలు తెలిసిన వారు ఎవరూ సిద్దంగా లేరు. ఎన్టీరామారావు, నాదెండ్ల భాస్కరరావు కాంబినేషన్‌లో, దగ్గుబాటి వెంకటేశ్వర రావు, ఉపేంద్ర తదితరుల మంత్రాంగంతో, రామోజీరావు లాంటి మీడియా దిగ్గజం మద్దతుతో ప్రారంభమైన పార్టీ అది.
ఇక్కడ ఏ ఒక్కరు కమ్మేతరులు లేరు. పార్టీ పెట్టిన తరువాత ఏరియాల వారీ టికెట్‌ల పంపిణీలో, రాజకీయ అవసరాల కోసం బీసీలను అక్కున చర్చుకుని వుండొచ్చు. ఎక్కడికక్కడ కులాల ఈక్వేషన్ల చూసి వుండొచ్చు. కానీ బేసిక్‌గా కమ్మ సామాజిక వర్గ ప్రయోజనం అన్నది విస్మరించజాలని విషయం. దీన్ని కూడా ఎవరైనా కొట్టి పారేయవచ్చు. కానీ తొలి ఎన్నికల్లోనే అప్పట్లో వన్ పర్సంట్ కమ్మ సామాజిక వర్గంలేని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కూడా ఒక్కో సీటు ఆ వర్గానికి కేటాయించిన సంగతి మరచిపోవడానికి లేదు. ఇదే చెబుతుంది ఆ పార్టీకి వున్న సామాజిక బంధాలను స్పష్టంగా చెబుతుంది.
సరే, ఉత్తరోత్తారా అనేక రాజకీయాలు జరిగాయి. కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తీరు, వచ్చిన తరువాత జరిగిన రాజకీయ పరిణామాలు వేరు. అప్పటి వరకు రాయలసీమ, తెలంగాణ, దక్షిణ కోస్తా, ఉత్తరకోస్తా ఇలా ఏరియాల వారీగా విడిపోయిన రెడ్లు మెల్లమెల్లగా ఒక్కటి కావడం ప్రారంభమైంది. కమ్మ సామాజిక వర్గంలో వున్న ఐక్యత, రాజకీయ అధికారం కోసం వారిలో వున్న పట్టుదల రెడ్లలో కూడా పెరిగింది. అంతకు ముందు సీమ రెడ్లకు, తెలంగాణ రెడ్లకు నప్పేదికాదు. వీరందరినీ ఒక తాటిపైకి తేవడంలో, వారికి ప్రాధాన్యత ఇవ్వడంలో వైఎస్ చూపించిన చొరవ క్లియర్‌గా కనిపించింది.
దీంతో 2004 నాటికి కమ్మసామాజిక వర్గంలో పట్టుదల మరింత పెరిగింది. ఎలాగైనా వైఎస్‌ను అధికారం నుంచి దింపాలన్న ప్రయత్నం ఆనాటి ఎన్నికల్లో గట్టిగా కనిపించింది. కానీ సాధ్యంకాలేదు. అయితే దురదృష్టవశాత్తూ వైఎస్ మరణించడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మళ్లీ తెలంగాణ-రాయలసీమ రెడ్లు వేరు వేరుగా కనిపించారు. దాని ప్రభావం జగన్ మీద పడింది. జగన్ జైలుకు వెళ్లారు. రాష్ట్రం రెండుగా విడిపోయింది. తెలుగుదేశం అధికారం సాధించింది.
అప్పుడు మొదలైంది
అప్పుడు, 2014లో రాష్ట్రంలో అసలు కథ మొదలైంది. చంద్రబాబు పగ్గాలు వదిలేసారో? లేదా అనుకూల నిర్ణయాలు తీసుకున్నారో మొత్తంమీద రాష్ట్రంలో ఆర్థికంగా కేవలం కమ్మ సామాజికవర్గం మాత్రమే బలపడేలా నిర్ణయాలు వెలువడ్డాయి. ప్రాజెక్టులు, పనులు, వ్యాపారాలు, ఇలా ప్రతి ఒక్కటీ వారికి కలిసి వచ్చాయి. ఇలాంటి టైమ్‌లో తెలంగాణ విడిపోయిన నేపథ్యంలో సీమ, ఆంధ్ర రెడ్లు ఒక్కటయ్యారు. బలమైన రాజకీయ వ్యూహాలు రచించారు. చంద్రబాబు స్వయంకృతాపరాధమో, జగన్ అవిశ్రాంత పోరు వల్లనో మొత్తానికి వైకాపా అధికారంలోకి వచ్చింది. ఇక్కడే ఇంకా అసలు సిసలు కథ మొదలైంది.
వైఎస్ వ్యవహారం వేరు. జగన్ వ్యవహారం వేరు. వైఎస్ తనవాళ్లని చూసుకుంటూ, తనను శరణు అన్నవాళ్లనీ చూసారు. రెడ్లకు పెద్దపీట వేస్తూ, కమ్మవారినీ దగ్గరకు తీసారు. అది వాస్తవం. జగన్ కేసుల్లో చుట్టూ వున్నవారంతా ఎక్కువగా కమ్మసామాజిక వర్గ జనాలే. కానీ జైలుకు వెళ్లిన తరువాత జగన్‌కు జ్ఞానోదయం అయింది. ఎవరు తమవారో? ఎవరు కాదో? ఎవర్ని నమ్మాలో? అదే సమయంలో రెడ్డి సామాజిక వర్గం అంతా అతని వెనుక నిలిచింది. ఇదంతా అధికారంలోకి వచ్చాక జగన్ పనితీరు మీద ప్రభావం క్లియర్‌గా చూపించింది.
చంద్రబాబు-జగన్
అయిదేళ్ల పాటు చంద్రబాబు ఏ విధంగా అయితే కమ్మ సామాజిక వర్గానికి పనికివచ్చేలా, వారి వ్యాపారాలకు అనుకూలించేలా నిర్ణయాలు తీసుకున్నారో? సరిగ్గా వాటికి వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్. అదే అసలు సిసలు కారణం చంద్రబాబు అసహనానికి. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు కమ్మ సామాజిక వర్గ ఆర్థిక పునాదులను దెబ్బతీస్తున్నాయి. ఏ తెలుగుదేశం పార్టీకి బలమైన వెన్నుదన్నుగా వుంటారనుకున్నారో, ఆ వర్గం వచ్చే ఎన్నికల నాటికి ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితికి చేరుకుంటోంది.
ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు ఇప్పటి నుంచీ పోరాటం ప్రారంభించకుంటే, ఇప్పటి నుంచి పోరాటపటిమ ప్రదర్శించకుంటే, ఆ వర్గానికి తెలుగుదేశం పార్టీ మీద నమ్మకం సడలిపోతుంది. ఇప్పటికే కమ్మసామాజిక వర్గ జనాలు చాలామంది భాజాపాలో చేరారు. వాళ్లంతా కేంద్రం లెవెల్‌లో పని వున్నవారు. కానీ రాష్ట్రంలో పని వున్నవారి సంగతేమిటి? ఇక్కడ మరో ముచ్చట చెప్పుకోవాలి. కమ్మ సామాజిక వర్గం బేసిక్‌గా వ్యాపార వర్గం. అయితే ఉద్యోగాల్లో కూడా వుంటారు. ఎక్కువగా విదేశాల్లో. ఇక్కడ తక్కువశాతం. జగన్ చేస్తున్న పనులు ఈ ఉద్యోగ, వ్యాపార వర్గాలను ఎలా ఇబ్బంది పెడుతోంది అన్నది చూద్దాం.
రియల్ ఎస్టేట్
కమ్మ సామాజిక వర్గం అడుగుపెట్టని రంగంలేదు. ముఖ్యంగా వ్యాపారరగంలో వాళ్లు కాలూనని రంగాలు తక్కువ. అన్నింటి కన్నా రియల్ ఎస్టేట్ అంటే పిచ్చి. భూమి అన్నది వాళ్లకు అత్యంత ప్రియమైనది. హైటెక్‌సిటీ విషయంలో ఏం చేసారో, అమరావతి విషయంలోనూ అదే చేసారు. దాంతో అక్కడ కోట్లకు కోట్లు పెట్టుబడులు పెట్టారు. కానీ ఎప్పడయితే జగన్ రాజధానిని అలా ఎక్కడవున్నది అక్కడ వుంచేసారో? బతకినివ్వకుండా, చావనివ్వకుండా వదిలేసారో, మొత్తం ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ పడిపోయింది. లక్షల కోట్ల పెట్టుబడి అలా వుండిపోయింది. ఇది చాలా గట్టిదెబ్బ.
మైనింగ్
రాష్ట్రంలో అటు శ్రీకాకుళం నుంచి ఇటు సీమ వరకు ఎక్కువ మైనింగ్ వ్యాపారం వున్నది కమ్మ సామాజిక వర్గం చేతుల్లోనే. మైనింగ్ అంటే కేవలం గ్రైనేట్ మాత్రమేకాదు, అలా అని రాయలసీమలోని రకరకాల ఖనిజాలు మాత్రమే కాదు, మామూలు కంకర దగ్గర నుంచి రకరకాలు లైసెన్స్‌లు చాలాచోట్ల వారివే. ఇప్పుడు రెన్యువల్స్ దగ్గరకు వచ్చేసరికి తేడా వస్తోంది. రాయలసీమలో అప్పుడే గడబిడలు మొదలయ్యాయి. ఇప్పుడు వ్యవహారం చూస్తుంటే మైనింగ్‌లు చేజారే అవకాశం కనిపిస్తున్నాయి.
మద్యం వ్యాపారం
మద్యం సిండికేట్‌ల సంగతి చెప్పనక్కరలేదు. ప్రతిచోటా ఈ సిండికేట్‌ల వెనుక కమ్మ సామాజిక వర్గ వ్యాపారులు వున్నారు. జగన్ మద్యం వ్యాపారాలను మూసేసారు. మద్యం వ్యాపారం మొత్తాన్ని ప్రభుత్వం టేకోవర్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం లిక్కర్ సిండికేట్‌లు కుదేలు అయిపోయాయి.
కాంట్రాక్టులు
రివర్స్ టెండరింగ్ అంటూ నవయుగ లాంటి పెద్ద సంస్థలకు వందలాటి కోట్ల నష్టం తప్పలేదు. ఇక మిగిలిన చిన్న, మధ్య తరగతి కాంట్రాక్టర్ల సంగతి చెప్పనక్కరలేదు. అదే సమయంలో కాంట్రాక్టుల విషయంలో ఆచితూచి వ్యవహరించడానికి వీలుగా ఓ సంస్థను ఏర్పాటు చేసారు. తెలుగుదేశం అనుకూల కాంట్రాక్టర్ల విషయంలో చాలా కీలకంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. దీంతో ఆ రంగాన్ని నమ్ముకున్న కమ్మ సామాజికవర్గ జనాలు ఇబ్బందుల్లో పడ్డారు.
పదవులు-పోస్టింగ్‌లు
రాజకీయ రంగంలో ఇవి కీలకమైనవి. పదవులు అన్నవి కమ్మ సామాజిక వర్గానికి అందనంత దూరంలోకి వెళ్లిపోయాయి. కొడాలి నానికి తప్ప మరొకరికి పదవిలేదు. నామినేటెడ్ పోస్టుల ఊసేలేదు. రెడ్డి సామాజిక వర్గం తరవాత బ్రాహ్మణులకు పెద్దపీట వేస్తున్నట్లు కనిపిస్తోంది. కమ్మవారికి అయితే రకరకాల పేర్లు అందువల్ల తెలుగుదేశం పార్టీ వారికి పెద్ద పీట వేసినా తెలిసేదికాదు. అయితే రెడ్లకు చివర్న రెండు అక్షరాలు తప్పని సరిగా వుండడంతో, ఈ తేడా క్లియర్‌గా తెలిసిపోతోంది. అదే సమయంలో పోస్టింగ్‌ల విషయంలో ప్రభుత్వం క్లియర్‌గా వ్యవహారిస్తున్నట్లు కనిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఓ వెలుగు వెలిగిన కమ్మ సామాజిక వర్గ జనాలను పూర్తిగా పక్కన పెట్టినట్లు కనిపిస్తోంది.
బిజినెస్‌లు
తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విజయవాడ, గుంటూరు, విశాఖ ప్రాంతాల్లోని కమ్మ వ్యాపారస్థులు విపరీతంగా లాభపడ్డారు అన్నది వాస్తవం. హోటళ్ల రంగం మూడు పూవులు ఆరు కాయలుగా నడిచింది. విశాఖలో ఓ పేద్ద హోటల్‌కు ప్రభుత్వమే అన్నివిధాలా సహకరించడానికి తరచు అక్కడ సమావేశాలు ఏర్పాటు చేసి, లక్షలు బిల్లులు చెల్లించేది. ఇప్పుడు అదంతా గతంగా మారింది. అమరావతి హడావుడి తగ్గడంతో విజయవాడ, గుంటూరు వ్యాపారాలు కూడా తగ్గుముఖం పట్టాయి.
మీడియా
తెలుగుదేశం హయాంలో ఓ సెక్షన్ ఆఫ్ మీడియాకు ఆదాయమే ఆదాయం. ప్రభుత్వ ప్రకటనల రూపంలో కోట్లకు కోట్లు వచ్చి పడేవి. చానెళ్ల రేటింగ్‌ల్లో దాదాపు చివర్న వుండే రెండు అక్షరాల ఓ న్యూస్ చానెల్‌కు కోట్లు కుమ్మరించారు అంటే వ్వవహారం ఎలావుండేదో అర్థం చేసుకోవచ్చు. అది తెలుగుదేశం ప్రముఖుడిది అని టాక్ వుంది. ఇప్పుడు ఆ ఛానెల్‌నే కాదు, మరే ఛానెల్‌కు ప్రకటనలు లేవు. పైగా కీలక చానెల్ చేతులు మారాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ప్రింట్ మీడియా సంగతి సరేసరి, ఎక్కడా ప్రకటన అన్నదిలేదు.
బాబుగారు ఏ పథకం చేపట్టినా, కీలక నిర్ణయం తీసుకున్నా, ఫుల్ పేజీ ప్రకటనలే. కోట్లకు కోట్ల బిల్లులే. అలాంటిది ఆర్టీసీ, వాలంటీర్ల వ్యవస్థ, మద్యం ప్రయ్నివేటు దుకాణాల బంద్, విలేజ్ సెక్రటేరియట్ ఇలా ఏ నిర్ణయం తీసుకున్నా, హడావుడి లేదు, ప్రకటనలు లేదు. ఇలా అయిదేళ్లు మనుగడ సాగించాలంటే మీడియాకు చాలా కష్టం.
ఇదీ పరిస్థితి
ఇలా ఒకటికాదు, రెండు కాదు దాదాపు అన్ని రంగాల్లో కమ్మ సామాజిక వర్గానికి చుక్కెదురు అవుతోంది. దీనివెనుక జగన్ వ్యూహం ఒకటే అని కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీకి ఆర్థికంగా అన్నివిధాలా అండదండలుగా నిలిచేవర్గం ఆర్థిక మూలాలను దెబ్బతీయాలన్నదే లక్ష్యంగా కనిపిస్తోంది. అలాచేస్తే వచ్చే ఎన్నికల వరకు ఆ వర్గం తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకుని వుండడం కష్టం. వున్నా, వచ్చే ఎన్నికల్లో భారీగా సాయం చేయడం అన్నది ఇంకా కష్టం.
కొన్నివారాల ముందు చంద్రబాబు అననే అన్నారు. ఆర్థిక మూలాలను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోంది అని. అది ఇదే. అందుకే అసహనం. ఎందుకు అంటే ఇప్పుడు కనుక తన పార్టీకి అండగా వున్న వర్గాన్ని కాపాడుకుంటున్నట్లు బాబుగారు కనిపించాలి. లేదూ అంటే ఆ వర్గం ఇన్నాళ్లు తెలుగుదేశం పార్టీ మీద పెట్టుకున్న నమ్మకం సడలిపోతుంది. ఇప్పటికే అదే కమ్మ సామాజిక వర్గంలో లోలోపల నారాలోకేష్ మీద గుర్రుగా వుంది.
అయిదేళ్లు పార్టీలో, ప్రభుత్వంలో లోకేష్ వ్యవహరించిన తీరు కారణంగానే ఇప్పుడు ఈ పరిస్థితి దాపురించిందని వారు భావిస్తున్నారు. పైకి బాహాటంగా నినదించకపోయినా, లోకేష్ భార్యనో, బాలయ్యనో మొత్తంమీద నందమూరి ఫ్యామిలీకి పగ్గాలు అప్పగిస్తే బెటర్ అన్న ఆలోచనలు వున్నాయి. అక్కడక్కడ వినిపిస్తున్నాయి. ఇవికాస్త ముదిరితే బాబుగారికి, చినబాబుగారికి ఇబ్బంది. అందుకే తాను ఏదో ఒకటి చేస్తున్నట్లు కనిపించాలి. హుంకరించాలి. హడావుడి చేయాలి. అందుకే ఈ అసహనం అంతా.
రెండు అంచెల వ్యూహం
కానీ… సమస్య ఒకటే, జగన్ జనాల దృష్టిలో బాగానే వున్నాడు. కరెంట్ కోత అన్నది ఒక్కటి తప్ప మరేదీ జనాలకు పట్టే సమస్యలు కావు. జనాలకు ఉద్యోగాలు ఇచ్చాడు. ఆర్టీసి సిబ్బందిని ప్రభుత్వ సిబ్బందిని చేసాడు. వాళ్లకు మరో రెండేళ్లు సర్వీస్ పెంచాడు. ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ ఇచ్చాడు. ఫించన్ దారులకు కూడా కనీసం పదివేలు పెరిగేలా చేసాడు. అవినీతి అన్నది లేకుండా చేయడానికి కట్టుబడి వున్నాడు. ఆ విషయంలో ఎమ్మెల్యేలు కూడా దడదడ లాడుతున్నారు.
అందువల్ల ఏ వర్గానికి పెద్ద పీట వేస్తున్నాడు, ఏ వర్గాన్ని పక్కన పెడుతున్నాడు లాంటివి జనాలకు పట్టవు. జగన్ ఈ విషయంలో రెండు అంచెల వ్యూహంతో ముందుకు వెళ్తున్నాడు. అటు ప్రజలకు కావాల్సింది వాళ్లకు ఇవ్వడం, ఇటు ప్రతిపక్షం పని, దానికి మద్దతుగా వున్నవారి పని పట్టడం. ఇలాంటి నేపథ్యంలో నాలుగేళ్ల తరువాత చేయాల్సిన పోరును ఇప్పుడే చేస్తున్నారు చంద్రబాబు. అస్త్రాలన్నీ ఇఫ్పుడే వాడేస్తున్నారు. అసహనం అంతా ఇప్పుడే ప్రదర్శిస్తున్నారు. అవసరమైన టైమ్ వచ్చేసరికి అస్త్రాలు వుండవు. బలమూ వుండదు.
కానీ జగన్ మాత్రం ఇవేవీ పట్టనట్లు, ఇవేవీ చూడనట్లు, తన వ్యవహారం కాదన్నట్లు, తాను అనుకున్న వ్యూహాలు అలా అలా అమలు చేసుకుంటూ మొండిగా సాగిపోతున్నారు. ఆపడం కష్టమే.
-ఆర్వీ