ఏపీలో కొర‌వ‌డిన ముంద‌స్తు ప్ర‌ణాళిక‌

ఏపీ ప్ర‌భుత్వానికి కొన్ని విష‌యాల్లో ముంద‌స్తు ప్ర‌ణాళిక కొర‌వ‌డింది. దీంతో జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి చెడ్డ పేరు వ‌స్తోంది. తాజాగా ఇంజ‌నీరింగ్ ప్ర‌వేశాల విష‌యంలో అధికారుల నిర్ల‌క్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. తెలంగాణ‌లో ఇప్ప‌టికే…

ఏపీ ప్ర‌భుత్వానికి కొన్ని విష‌యాల్లో ముంద‌స్తు ప్ర‌ణాళిక కొర‌వ‌డింది. దీంతో జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి చెడ్డ పేరు వ‌స్తోంది. తాజాగా ఇంజ‌నీరింగ్ ప్ర‌వేశాల విష‌యంలో అధికారుల నిర్ల‌క్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. తెలంగాణ‌లో ఇప్ప‌టికే మొద‌టి విడ‌త కౌన్సెలింగ్ పూర్తి చేసుకుని విద్యార్థులు త‌ర‌గ‌తుల‌కు కూడా వెళుతున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మాత్రం అందుకు పూర్తి భిన్న‌మైన ప‌రిస్థితి.

ఒక వైపు ఇంజ‌నీరింగ్ ఎంట్రెన్స్ ఫ‌లితాలు వెలువ‌డి నెల‌రోజులైంది. మ‌రోవైపు ఇంత వ‌ర‌కూ ప్ర‌వేశాల‌కు సంబంధించి కౌన్సెలింగ్ ఊసేలేక‌పోవ‌డంతో విద్యార్థులు, త‌ల్లిదండ్రుల్లో ఆందోళ‌న నెల‌కుంది. ఇదిగో నేడు, రేపు అంటూ కాల‌యాప‌న త‌ప్ప‌, షెడ్యూల్ మాత్రం రావ‌డం లేదు.
 
ముఖ్యంగా ఫీజుల ఖ‌రారులో ప్ర‌భుత్వానికి, ప్రైవేట్‌క‌ళాశాల‌ల‌కు మ‌ధ్య విభేదాలు త‌లెత్త‌డం వ‌ల్లే తీవ్ర జాప్యం జ‌రుగుతోంద‌నే వాద‌న‌లున్నాయి. కళాశాలలకు అనుబంధ గుర్తింపు ప్రక్రియను ఆగస్టు 31లోపు పూర్తి చేయాలని ఏఐసీటీఈ ఆదేశించినా విశ్వవిద్యాలయాలు సకాలంలో పూర్తి చేయలేదు. అక్టోబరు 1 నుంచి తరగతులు ప్రారంభించనున్నట్లు ఉన్నత విద్యాశాఖ ఇటీవల ఉమ్మడి అకడమిక్‌ క్యాలెండర్‌ను విడుదల చేసింది. అస‌లు కౌన్సెలింగే చేప‌ట్ట‌క‌పోతే, ఇక క‌ళాశాల‌ల ప్రారంభ‌మ‌నే ప్ర‌శ్నే ఉత్ప‌న్నం కాద‌ని అంటున్నారు.

మ‌రోవైపు కౌన్సెలింగ్‌కు మ‌రో ప‌ది రోజులు ప‌డుతుంద‌ని చెబుతున్నారు. ఈ లోపు ఇత‌ర ప్రాంతాల‌కు విద్యార్థులు వెళ్లిపోయే అవ‌కాశాలున్నాయి.  ఫీజుల ఖరారుపై ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్ ప్ర‌భుత్వానికి చేసిన విన‌తిపై ఇంత వ‌ర‌కూ సానుకూల స్పంద‌న రాలేద‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఇంజ‌నీరింగ్ కౌన్సెలింగ్‌పై నీలినీడ‌లు అలుముకున్నాయ‌ని ఇంజ‌నీరింగ్ క‌ళాశాల‌ల య‌జ‌మానులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.