సమయం, సందర్భం లేకుండా గుడ్డ కాల్చి వైసీపీ పైన వేయడం టీడీపీకి భలే సరదా. ఈ క్రమంలో ఆ పార్టీ సిగ్గుతో పాటు, లాజిక్స్ కూడా వదిలేస్తుంది. తాజాగా డ్రగ్స్ పై టీడీపీ చేస్తున్న ఆరోపణలు ఇలానే ఉన్నాయి.
ముంద్రా పోర్టులో దొరికిన 3వేల కిలోల హెరాయిన్ కు, వైసీపీ నేతలకు సంబంధం ఉందని ఆరోపిస్తోంది టీడీపీ. టీడీపీ వాదనలో నిజం ఉంటే బీజేపీ ఊరుకుంటుందా? జగన్ ఎక్కడ దొరుకుతాడా అని ఎదురుచూస్తున్న కమలదళం పండగ చేసుకుంటుంది కదా.
కానీ ఈ అంశంపై స్థానిక బీజేపీతో పాటు.. జాతీయ స్థాయి నేతలు కూడా సైలెంట్ గా ఉన్నారు. జగన్ ను ఒక్క మాట అనలేదు సరికదా.. ఈ ఇష్యూకు, ఏపీ ప్రభుత్వానికి అసలు లింక్ పెట్టి చూడడం లేదు. తాజాగా ఈ అంశానికి సంబందించి ఏపీ ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చింది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ. టీడీపీ మాత్రం అవకాశం దొరికిందని రెచ్చిపోతోంది. లాజిక్ లేకుండా ఆరోపణలు చేస్తోంది.
డ్రగ్స్ రాకెట్ కు వైసీపీ ఎమ్మెల్యేలకు సంబంధం ఉన్నట్టు జరుగుతున్న సోషల్ మీడియా ప్రచారంపై ఆల్రడీ కేసులు నమోదయ్యాయి. అరెస్ట్ లు కూడా మొదలయ్యాయి. అదే సమయంలో అటు మత్స్యకార వర్గాలను కూడా టీడీపీ కించపరిచిందనే ఆరోపణలు కూడా వచ్చాయి.
కాకినాడ పోర్ట్ సమీపంలో పడవ తగలబడిపోయిందని, అందులో హెరాయిన్ ఉందని రచ్చ చేస్తోంది టీడీపీ. తగలబడిపోయిన పడవలో ఏముందో ఎవరికీ తెలిసే అవకాశం లేదు కాబట్టి, ఇలా మాట్లాడుతున్నారనే విషయం అందరికీ తెలిసిందే.
అయితే వైసీపీ ఎమ్మెల్యేకు నేరుగా డ్రగ్స్ రాకెట్ తో సంబంధం ఉన్నట్టు చేస్తున్న ఆరోపణలు టీడీపీ మెడకే చుట్టుకుంటున్నాయి. ఇంకోసారి మాట్లాడితే నీ సంగతి తేలుస్తా పట్టాభీ అంటూ అటువైపు నుంచి వార్నింగ్ లు కూడా వస్తున్నాయి. అయితే ఒకరకంగా వైసీపీ వర్గాలను రెచ్చగొట్టడంలో మాత్రం టీడీపీ సోషల్ మీడియా మేథావులు సక్సెస్ అయ్యారు. విపరీతంగా తిట్టించుకుంటున్నారు, దాదాపు కొట్టించుకున్నంత పనిచేశారు.
ఆరోపణల్లో పసలేనప్పుడు, అదే విషయంపై విడిచిపెట్టకుండా విమర్శలు చేస్తే ఎంతో కొంత నిజం ఉండకపోవచ్చు అని జనం ఓ అభిప్రాయానికి వస్తారు. ప్రస్తుతం టీడీపీ చేస్తోంది కూడా అదే. సంక్షేమ కార్యక్రమాలతో జగన్ ని ఢీకొనలేక, అభివృద్ధి కార్యక్రమాలకు వంక పెట్టలేక చివరకు ఇలా డ్రగ్స్ దందా అంటూ టీడీపీ హంగామా మొదలు పెట్టింది.
మిగతా విషయాల్లో విమర్శలు చేస్తే గణాంకాలతో గట్టిగా బుద్ధి చెబుతుంది వైసీపీ. అందుకే ఇలా రుజువులు లేని విమర్శలతో విరుచుకుపడుతోంది పచ్చబ్యాచ్. ఓవైపు కేంద్రం క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ, టీడీపీ బ్యాచ్ తగ్గేదే లే అంటోంది.