మాజీ ఎమ్మెల్యే ఎవరు? ఆయన అన్నయ్య ఎవరు? ఈయన తెలంగాణాకు చెందిన మాజీ ఎమ్మెల్యే, మాజీ అంటే మరీ మాజీ ఎమ్మెల్యే కాదులెండి. తాజాగా అంటే కొన్ని రోజుల కిందటే మాజీ ఎమ్మెల్యే అయ్యాడు. ఓవరాక్షన్ చేసి ఎమ్మెల్యే పదవి పోగొట్టుకున్నాడు. ఆయనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మునుగోడు ఉపఎన్నికలో ఓడిపోయిన సంగతి తెలిసిందే కదా. పాపం బీజేపీ ప్రలోభాలకు లొంగిపోయి అనవసరంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఉప ఎన్నిక తెప్పించుకొని ఓవరాక్షన్ చేసి ఓడిపోయాడు.
ఇక ఈయన అన్నయ్య కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. ఆయనదీ ఓవరాక్షన్ టైపే. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీయే కదా. భువనగిరి ఎంపీ. ఆయన కూడా తమ్ముడితోపాటే బీజేపీలో చేరుతారనే పుకార్లు వచ్చాయి. కాకపొతే తమ్ముడు గెలుస్తాడో ఓడిపోతాడో తెలియదు కదా. అందుకే ఆగాడు. కానీ వెంకట్ రెడ్డికి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండాలని లేదు.
ఉప ఎన్నికలో తమ్ముడు గెలుస్తాడని ఘంటాపథంగా చెప్పాడు. తమ్ముడిని గెలిపించాలని కూడా పిలుపునిచ్చాడు. కాంగ్రెస్ తరపున అసలు ప్రచారం కూడా చేయలేదు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా కోమటిరెడ్డి పలు రకాల కామెంట్లు చేశాడు.
ఈ కారణంగా ఆయనకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నుంచి రెండు సార్లు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. వాటికి ఆయన సమాధానం ఇచ్చాడు. కాంగ్రెస్ హైకమాండ్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ కోమటిరెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నాడు.
తాజాగా తాను కాంగ్రెస్ పార్టీలో లేనని పరోక్షంగా చెప్పాడు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నానని అన్నాడు. ఏ పార్టీలో చేరాలన్నది ఎన్నికలకు నెల రోజుల ముందు డిసైడ్ చేసుకుంటానన్నాడు. వచ్చే ఏడాదిన్నర పాటు తన నియోజకవర్గం అభివృద్ధిపైనే దృష్టి కేంద్రీకరిస్తానని చెప్పాడు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి పీసీసీ చీఫ్ పదవిని కోరుకున్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆ అవకాశాన్ని రేవంత్ రెడ్డికి ఇచ్చింది. అప్పటి నుండి కోమటిరెడ్డి అసంతృప్తి స్వరం వినిపిస్తున్నాడు. మధ్యలో ఆయన రేవంత్‌తో కలిసి పని చేసేందుకు సిద్ధమయ్యాడు. పార్టీ హైకమాండ్ కూడా ఆయనకు స్టార్ క్యాంపెయినర్ పదవి ఇచ్చింది.
కొద్ది రోజులుగా బాగానే ఉన్నా..తర్వాత మళ్లీ రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేస్తూ.. రాజకీయం వేడెక్కించారు. ఈ సందర్భంలోనే ఆయన సోదరుడు.. బీజేపీలో చేరడం.. కాంగ్రెస్ తరపున మునుగోడులో ప్రచారానికి వెనుకంజ వేయడంతో కాంగ్రెస్ పార్టీతో దూరం పెరిగింది. మరి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఏ పార్టీలోకి పోతాడో చూడాలి.