ముఖ్యమంత్రి వైఎస్ జగన్ త్వరలో నర్శీపట్నానికి వస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా ఎన్నికల ప్రచారాన్ని ఆయన నర్శీపట్నం నుంచే ప్రారంభించారు. నాడు ఆయన ఇచ్చిన హామీల మేరకు అనేక అభివృద్ధి పనులను చేపడుతున్నారు. అయిదు వందల కోట్లతో నర్శీపట్నంలో మెడికల్ కళాశాలకు జగన్ శంకుస్థాపన చేస్తారు.
ఏలేరు కాలువ నీటిని తాండవ రిజర్వాయర్ తో అనుసంధానం చేస్తూ 470 కోట్ల రూపాయలతో నిర్మించే ప్రాజెక్ట్ కి జగన్ శ్రీకారం చుట్టనున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే 51 వేల పైగా ఎకరాలకు సాగు నీరు అందుతుంది. దీర్ఘకాలంగా అనావృష్టి తో సతమతమయ్యే రైతాంగం హర్షిస్తుంది. వీటితో పాటు అనేక ఇతర అభివృద్ధి కార్యక్రమాలు జగన్ చేపట్టనున్నారు.
ఉమ్మడి విశాఖ జిల్లాలో జగన్ మీద నిత్యం విరుచుకుపడే మాజీ మంత్రి టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు సొంత నియోజకవర్గం అయిన నర్శీపట్నంలో జగన్ సీఎం హోదాలో మొదటిసారిగా కాలుపెట్టడం రాజకీయంగా ఆసక్తిని గొలుపుతోంది. జగన్ ఈ సందర్భంగా ఏర్పాటు చేసే సభలో ఏమి మాట్లాడుతారు అన్నది ఉత్కంఠగా ఉంది.
గతలో పలు మార్లు మంత్రిగా ఉన్నా అయ్యన్న చేయలేని పనులను తమ పాలనలో చేస్తున్నామని, అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని నర్శీపట్నం వైసీపీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అంటున్నారు. జగన్ రాబోయే ఎన్నికల్లో గెలవడం నల్లేరు మీద నడక అని, మరో మూడు దశాబ్దాలు ఆయనే ఏపీకి సీఎం అని పెట్ల అంటున్నారు. జగన్ కి ఘనస్వాగతం పలికి నభూతో నభవిష్యత్తు అన్నట్లుగా నర్శీపట్నం సభను జరుపుతామని ఆయన చెబుతున్నారు.