గండం గడిచిందనుకున్నారు.. ప్రాణాలు దక్కాయని అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఆ తర్వాతే అసలు ఘోరం జరిగింది. దువ్వాడ రైల్వే స్టేషన్ లో ఫ్లాట్ ఫామ్, ట్రయిన్ మధ్య ఇరుక్కుపోయిన యువతి ప్రాణాలు కోల్పోయింది. ప్రమాదం నుంచి కాపాడినప్పటికీ ఆమెను కాపాడలేకపోయారు.
అన్నవరంకు చెందిన శశికళ, దువ్వాడలోని ఓ కాలేజీలో ఎంసీఏ చదువుతోంది. కాలేజ్ కు వెళ్లే క్రమంలో రైల్వేస్టేషన్ లో దిగుతుండగా, ప్రమాదవశాత్తూ కాలుజారి రైల్వే ఫ్లాట్ ఫామ్, ట్రయిన్ మధ్య ఇరుక్కుపోయింది. దానికి సంబంధించిన వీడియో కూడా నిన్నంతా వైరల్ అయింది.
అలా ఇరుక్కుపోయిన శశికళను రైల్వే రెస్క్యూ టీమ్ కాపాడింది. ఫ్లాట్ ఫామ్ కట్ చేసి మరీ ఆమెను బయటకు తీసింది. వెంటనే ఆమెను ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేసి చికిత్స అందించారు. ఇక్కడితో కథ సుఖాంతం అని అంతా అనుకున్నారు.
కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది, విధి వక్రించింది. ఇరుక్కుపోవడంతో ఆమె శరీరంలో పలు అవయవాలు దెబ్బతిన్నాయి. మరీ ముఖ్యంగా యూరిన్ బ్లాడర్ దెబ్బతిని బ్లీడింగ్ ఎక్కువైంది. ఆమెను బతికించేందుకు వైద్యులు చాలా ప్రయత్నించి విఫలమయ్యారు.