టీడీపీ యువనేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ జనసేనలోకి వెళ్లనున్నారా? అంటే…ఔననే సమాధానం వస్తోంది. మరీ ముఖ్యంగా జనసేన సోషల్ మీడియా ఈ ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేస్తుండడం, దాన్ని అఖిలప్రియ ఖండించకపోవడంతో ప్రచారానికి బలం కలిగిస్తోంది.
గత ఏడాదిన్నరగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడంతో అఖిలప్రియ మనస్తాపానికి గురైనట్టు సమాచారం. గతంలో వైసీపీలో ఉండగా, జగన్‌ను దెబ్బతీసేందుకు తన కుటుంబాన్ని పావుగా వాడుకున్నారనే ఆవేదన భూమా అఖిలప్రియలో కనిపిస్తోంది.
అవసరం తీరాక తనను పట్టించుకోలేదనే కోపం ఆమెలో కనిపిస్తోంది. మరోవైపు అఖిలప్రియ కిడ్నాప్‌లు, భూదందాలకు పాల్పడుతూ పార్టీకి చెడ్డపేరు తీసుకొస్తోందనే ఆగ్రహం చంద్రబాబులో ఉన్నట్టు కర్నూలు టీడీపీ నేతలు చెబుతున్నారు.
భర్త, తమ్ముడితో కలిసి ఆమె పార్టీ పరువును బజారున పడేస్తున్నారనే ఫిర్యాదులు టీడీపీ అధిష్టానానికి వెల్లువెత్తినట్టు సమాచారం. అందుకే తెలంగాణలో ఆమెను జైల్లో వేసినా… చంద్రబాబు, లోకేశ్ ఏ మాత్రం పట్టించుకోలేదని కర్నూలు టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. మరోవైపు టీడీపీ కార్యకర్తలు, గ్రామస్థాయి నాయకులు అఖిలప్రియ అన్న ,బీజేపీ నేత భూమా కిషోర్‌రెడ్డికి దగ్గరవుతున్నారనే సమాచారం అధిష్టానానికి చేరింది.
కష్టాల్లో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేశ్ పట్టించుకోకపోవడం, అపాయింట్మెంట్ కోరినా పట్టించుకోకపోవడంతో టీడీపీలో తన భవిష్యత్‌పై ఆమెలో ఆందోళన మొదలైంది. 2024లో పార్టీ టికెట్ ఇస్తుందనే నమ్మకం రోజురోజుకూ సడలుతోంది. దీనికి టీడీపీ పెద్దల నిరాదరణే నిదర్శనమని ఆమె తన సన్నిహితుల వద్ద వాపోతున్నారని సమాచారం.
ఇలాగైతే టీడీపీలో కొనసాగడం వేస్ట్ అని అంటున్నట్టు తెలిసింది. దీంతో ముందుగానే ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక చూసుకునేందుకు అఖిలప్రియ ఆలోచిస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో తనకు జనసేన పార్టీనే సరైందనే అభిప్రాయానికి ఆమె వచ్చినట్టు కర్నూలు జిల్లాలో ప్రచారం జరుగుతోంది.
గతంలో తన తల్లిదండ్రులు ప్రజారాజ్యంలో చేరడం, ఆళ్లగడ్డ నుంచి శోభానాగిరెడ్డి గెలవడం తెలిసిందే. దీంతో చిరంజీవి, పవన్‌కల్యా ణ్లతో భూమా కుటుంబానికి మంచి సంబంధాలున్నాయి. తన భర్త భార్గవ్‌రామ్ సామాజిక వర్గం కూడా అఖిలప్రియకు జనసేనలో కలిసొచ్చే అంశంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం అఖిలప్రియ వెంట బలిజలు ఎక్కువగా ఉండడా నికి భర్త సామాజిక నేపథ్యమే కారణమని ఆమె నమ్ముతున్నారు.
జనసేనలోకి వెళితే టికెట్ దక్కడంతో పాటు ఆళ్లగడ్డలో బలమైన బలిజ సామాజిక వర్గం ఓట్లు తనకు లాభిస్తాయనే ఎత్తుగడతో ఆమె రాజకీయ ముందడుగు వేసే ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది. అఖిలప్రియ భవిష్యత్‌పై కాలమే జవాబు చెప్పాల్సి వుంది.