‘మా’ ఎన్నికల్లో సీనియర్ నటుడు సీవీఎల్ నరసింహారావు ట్విస్ట్‌ల మీద ట్విస్టులు ఇస్తున్నారు. ‘మా’ ఎన్నికల పుణ్యమా అని ఎక్కువ ప్రచారం పొందిన నటుడెవరైనా ఉన్నారా? అంటే సీవీఎల్ నరసింహారావు పేరే చెబుతారు. ‘మా’ లో మూడో ప్రత్యామ్యాయంగా బరిలో నిలుస్తానని ఆయన ముందుకొచ్చారు.
ఆ తర్వాత నామినేషన్ కూడా వేశారు. మ్యానిఫెస్టోను ప్రకటించారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ తూచ్ తూచ్ అన్నారు. బరి నుంచి వెనక్కి తగ్గారు. ప్రకాశ్‌రాజ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రకాశ్‌రాజ్ హిందువుల వ్యతిరేకి అంటూ వివాదాస్పద అంశాన్ని ‘మా’ తెరపైకి తెచ్చారు.
శ్రీరామచంద్రుడు తన కలలోకి వచ్చి ప్రకాశ్‌రాజ్‌ను ఓడించాలని పిలుపు ఇచ్చినట్టు ప్రకటించి ఆశ్చర్యపరిచారు. తాజాగా ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో మరో సంచలన ఆశ్చర్యకర విషయాన్ని చెప్పుకొచ్చారు. తను చెప్పేది వింటే ఇది కాస్త వెటకారంగా ఉందే అని అనుకుంటారనడం విశేషం. ఇంతకూ ఆ వీడియోలో ఆయన ఏం చెప్పారంటే…
‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులందరికీ నమస్కారం. దాసరిగారు నాకు కలలోకి వచ్చారు. అందరికీ ఇది కాస్త వెటకారంగానే ఉంటుంది. ఎందుకంటే మొన్న రాముడు, ఇవాళ దాసరా? అని. కానీ ఆయనని మరచిపోలేం. ఆయనతో ఏంటండీ ఇదంతా అని అడిగాను(కలలో). అందుకు దాసరిగారు.. ‘మీరంతా నేను ఉన్నానని అంటుంటారుగా? మీరంతా ఏం చేస్తున్నారు. తండ్రికి మించిన తనయుడు, గురువును మించిన శిష్యుడు అంటుంటారుగా? మోహన్ బాబు నన్ను తండ్రిగా అనుకున్నాడు.
నేను అతన్ని కొడుకుగా, శిష్యుడిగా భావించాను. నా కొడుకుకి కొడుకు విష్ణు ఉన్నాడు. అతడిని గెలిపించమని చెప్పడం లేదు.. కానీ నేను మోహన్ బాబుకి నేర్పిన సంస్కారం, ఆయన వాళ్లబ్బాయికి నేర్పిన సంస్కారం తెలియంది కాదు. ఆ సంస్కారం వల్లే కదా పెద్దవాళ్లందరూ కలిసి తప్పుకోమంటే తప్పుకుంటానని అంది. సరే ఆ విషయం పక్కన పెడితే.. మీ వ్యవహారం ఏంటి?’ అని అడిగారు. దీనికి నేను.. పెద్దవారందరినీ కూర్చోబెట్టి యునానిమస్‌గా చేయడానికి నా దగ్గర వాళ్లందరి నెంబర్లు లేవు సార్ అని చెప్పా. అయితే మీరు చేసేది మీరు చేయండి నేను చేసేది నేను చేస్తానని దాసరిగారు అన్నారు’ అని సీవీఎల్ చెప్పడం గమనార్హం.
ఇంకా అనే విషయాలను ఆయన తెలిపారు. ఇంకా ఎన్నికలకు టైమ్ ఉంది కాబట్టి.. మీడియా ముఖంగా, మా సభ్యులందరూ టైమ్ కేటాయిస్తే పెద్దలను ఓ అరగంటో, గంటో టైమ్ కేటాయించేలా చేసి ఏకగ్రీవంగా మా ఎన్నిక జరిగేలా చేస్తానని ఆయన ప్రకటించారు. దాసరి కలలో రావడం ఏంటి? ఏకగ్రీవం చేయడం ఏంటి? అనే ప్రశ్నలు ఎవరూ వేయకూడదు. ఇంత వరకూ అందరూ అంతా వెండితెర మాయ అని అనుకునేవాళ్లం. ఇప్పుడు అంతా ‘మా’ ఎన్నికల మాయ అని సరిపెట్టుకోవాల్సిందే. ఎవరేం చెప్పినా వినాల్సిందే మరి!