అందమైన అమ్మాయిల పేరిట జరిగే హనీ ట్రాప్ మోసాలు చూశాం. విదేశాల్లో లాటరీ అంటూ జరిగే ఆన్ లైన్ మోసాలు చూశాం. మొబైల్స్ ను హ్యాక్ చేస్తూ జరిగే సైబర్ క్రైమ్స్ కూడా చూశాం. కానీ ఇది మరో ఎత్తు. ఈసారి ఏకంగా తమ మోసాలకు పోలీసుల్నే వాడేశారు సైబర్ నేరగాళ్లు. హైదరాబాద్ లో జరిగిన ఈ ఆన్ లైన్ మోసం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
జీడిమెట్ల ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఎంఎస్సీ చదివాడు. ఉద్యోగం కోసం జాబ్ సైట్స్ లో వివరాలు నమోదు చేశాడు. ఆ వివరాల్ని సైబర్ నేరగాళ్లు పట్టుకున్నారు. అతడికి మెయిల్ చేశారు. తాము పోలీసులమని, ఓ అమ్మాయని వేధించినందుకు గాను, కేసు పెట్టామంటూ అతడికి మెయిల్ పెట్టారు. అందులో పలు సెక్షన్లను కూడా ప్రస్తావించారు. ఈ మేరకు ఓ మార్ఫింగ్ ఫొటోను కూడా మెయిల్ కు ఎటాచ్ చేశారు.
ఆ అమ్మాయి ఎవరో తనకు తెలియందంటూ బాధితుడు వాపోయాడు. కానీ పోలీసులమంటూ చెప్పుకున్న అగంతకులు మాత్రం తగ్గలేదు. ఇంటికి పోలీసుల్ని పంపిస్తామన్నారు. అమ్మాయిల తల్లిదండ్రులతో మాట్లాడి సెటిల్ చేసుకోమంటూ కొన్ని నంబర్లు ఇచ్చారు. వాళ్లకు ఫోన్ చేస్తే.. కేసు పెట్టకుండా ఉండేందుకు డబ్బులు కావాలంటూ డిమాండ్ చేశారు. అలా నలుగురు వ్యక్తులు వివిధ సందర్భాల్లో దాదాపు 7 లక్షల మొత్తాన్ని తమ ఖాతాలకు బదిలీ చేయించుకున్నారు.
అమాయకుడైన బాధితుడు కేసు కొట్టేశారా లేదా తెలుసుకునేందుకు ఫోన్లు చేయడంతో అవన్నీ స్విచాఫ్ వచ్చాయి. దీంతో తను మోసపోయానని గ్రహించి, అసలైన పోలీసుల్ని ఆశ్రయించాడు బాధితుడు.