పరిషత్ ఎన్నికల నుంచి చంద్రబాబు పలాయనం చిత్తగించడంతో బీజేపీ పండగ చేసుకుంటోంది. టీడీపీ పారిపోయే పార్టీ అని, ఎప్పటికైనా ఏపీలో వైసీపీని ఢీకొట్టే పార్టీ ఒక్క బీజేపీయేనని జబ్బలు చరుచుకుంటోంది కమలదళం. ఈమేరకు సోము వీర్రాజు పేరుమీద ఓ ప్రకటన విడుదలైంది. అయితే కొత్త నోటిఫికేషన్ కోసం హైకోర్టులో పిటిషన్ వేసి బీజేపీ పోరాడుతోంది. ఈరోజు రాబోతున్న న్యాయస్థానం తీర్పు ఆధారంగా ఆ పార్టీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఆల్ పార్టీ మీటింగ్ ని బహిష్కరించామని చెప్పారే కానీ, ఎన్నికల్ని బహిష్కరిస్తున్నామంటూ ఇప్పటి దాకా బీజేపీ, జనసేన నేతలెవరూ చెప్పలేదు. ఈలోగా చంద్రబాబు ఆవేశపడిపోయి ఎన్నికల బహిష్కరణ అనడం వారికి కలిసొచ్చే అంశంగా మారింది. ఈ పేరుతో పరిషత్ ఎన్నికల్లో వైసీపీకి అసలుసిసలు పోటీ మేమేనంటూ డప్పు కొట్టుకుంటున్నారు బీజేపీ నేతలు.
ఆ పార్టీ తరపున నామినేషన్లు ఎవరు వేశారో, అసలు పోటీలో ఉన్నారో లేరో కూడా తెలియని పరిస్థితి. అయినా కూడా రాష్ట్రాన్నంతా ఓన్ చేసుకుని మాదే సిసలైన పార్టీ, మేమే అసలైన ప్రతిపక్షం అంటున్నారు.
టీడీపీ సానుభూతి పరుల ఓట్లు పడతాయా..? పరిషత్ ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటున్నామని చంద్రబాబు చెప్పారంటే దానర్థం టెక్నికల్ గా ఆ పార్టీ పోటీలో లేదని. ఆ పార్టీ తరపున ఎవరూ ప్రచారం చేయరు అని అర్థం. అంతేకానీ బ్యాలెట్ పేపర్లో టీడీపీ గుర్తుతో పోటీ చేయబోతున్న అభ్యర్థుల్ని ఎవరూ తొలగించరు. ఆ పార్టీకి పడే ఓట్లను ఎవరూ తీసి పక్కనపెట్టరు. ఈ మేరకు నామినేషన్ల ప్రక్రియ పూర్తయిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
ప్రచారం చేసినా ఓడిపోతాం అనుకునే చోట టీడీపీ నేతలు కాడె పడేశారంతే. కార్యకర్తల బలం బాగా ఉంది, ప్రచారం చేయకపోయినా గెలుస్తాం అనుకునే చోట్ల సీక్రెట్ గా వ్యవహారం నడిపిస్తారు. పరీక్షకు హాజరు కాలేదు కాబట్టి సున్నా మార్కులొచ్చాయని చెప్పుకోవచ్చు. ఒకటీ అరా వచ్చాయంటే అది బోనస్ అనుకోవచ్చు.
టీడీపీ సానుభూతిపరుల ఓట్లు ఇంకే పార్టీకి వెళ్లవు, చంద్రబాబు వ్యూహం కూడా అదే. టీడీపీ ఓట్లు పడతాయని బీజేపీ కూడా ఆశించట్లేదు కానీ, టెక్నికల్ గా ప్రతిపక్షం మేమే, వైసీపీని ప్రత్యామ్నాయం మేమేనని చెప్పుకోడానికి ఆ పార్టీకి ఓ మంచి పాయింట్ దొరికింది.
ఈరోజు పవన్ కల్యాణ్ పర్యటనలో కూడా ఇదే పాయింట్ హైలెట్ చేయాలనుకుంటున్నారట. చంద్రబాబు పారిపోయారని, ధైర్యంగా వైసీపీని ఢీకొనే సత్తా తమకే ఉందని చెప్పుకుంటారట. ఆ రకంగా టీడీపీ కార్యకర్తల్ని డీమోరలైజ్ చేసి కాస్తో కూస్తో లాభం పొందాలనేది బీజేపీ ప్లాన్. ఎవ్వరూ తగ్గట్లేదు, ఎవరి పర్ఫామెన్స్ వారు ఇస్తున్నారు.