పవన్ కల్యాణ్ తిరుపతి ప్రచారానికి సిద్ధమయ్యారు. బీజేపీ అభ్యర్థి తరపున ప్రచారానికి వెళ్తున్నా.. తనదైన శైలిలో ఆ ప్రచారానికి కవాతు అంటూ పేరు పెట్టుకున్నారు. అయితే ఈరోజు కవాతులో ఆయన వెంట ఎంతమంది కలసి వస్తారు? సభా వేదికపై పవన్ ఏం మాట్లాడతారనేదే ఆసక్తికర అంశం.
పాచిపోయిన లడ్డూల సంగతేంటి..? పవన్ కల్యాణ్ కి, తిరుపతికి అవినాభావ సంబంధం ఉంది. ఆ మాటకొస్తే.. ఏపీ ప్రత్యేక హోదాకి, టెంపుల్ సిటీకి కూడా అంతే ప్రత్యేక బంధం ఉంది. ఇదే తిరుపతి నుంచి నరేంద్ర మోదీ.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాం, అది మా ద్వారానే సాధ్యం అంటూ 2014 ఎన్నికల ప్రచారంలో ఢంకా భజాయించారు. ఆయన మాటలు విని మోసపోయిన ఏపీ ప్రజలు టీడీపీ-బీజేపీ కూటమికి ఓటు వేసి ఐదేళ్లు ఎదురుచూసి షాకయ్యారు.
హోదా వద్దు, ప్యాకేజీ చాలంటూ చంద్రబాబు యూటర్న్ తీసుకుంటే.. పవన్ కల్యాణ్ అప్పట్లో మామూలుగా రంకెలేయలేదు. పాచిపోయిన లడ్డూలంటూ కేంద్రానికి చీవాట్లు పెట్టారు. పవన్ కల్యాణ్ లో ఆ మహోగ్రరూపానికి కూడా సాక్షి తిరుపతే. తిరుపతి సభలోనే.. పవన్ నేరుగా బీజేపీ అధిష్టానాన్ని టార్గెట్ చేశారు, పాచిపోయిన లడ్డూలిస్తారా మీరేం మనుషులంటూ నిలదీశారు.
కట్ చేస్తే..ఇప్పుడు అదే తిరుపతిలో ఉప ఎన్నికల్లో ఓట్లు అడుగుతోంది బీజేపీ. హోదా ఇవ్వకుండా రాష్ట్రానికి తీరని అన్యాయం చేసి, భవిష్యత్తులో కూడా ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పి మరీ.. ఏపీ ప్రజల ఓట్లు అడగడం ఎంతవరకు న్యాయమో ఆ పార్టీ నేతలకే తెలియాలి. అదే సమయంలో తిరుపతిలో బీజేపీ తరపున ఓట్లు అడగడానికి వస్తున్న పవన్ కల్యాణ్ ఏ మొహం పెట్టుకుని ప్రచారానికి వస్తున్నారో ఆయన విజ్ఞతకే వదిలేయాలి.
ఆమధ్య నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పర్యటన చేసి, క్షేత్ర స్థాయిలో జనసేన పరిస్థితిని అంచనా వేసి, కార్యకర్తలు, నేతల్లో.. మనమే పోటీచేస్తామనే భరోసా నింపి, చివరకు బీజేపీ ముందు చేతులు కట్టుకున్న పవన్ కల్యాణ్ ఇప్పుడు ఆ పార్టీ అభ్యర్థికి ఓట్లు వేయాలంటూ అభ్యర్థిస్తున్నారు.
ప్రత్యేక హోదా పక్కనపెట్టారు, స్టీల్ ప్లాంట్ పై బీజేపీ అధిష్టానంతో విభేదిస్తామంటారు, అయినా సరే ఆ పార్టీ అభ్యర్థిని గెలిపించాలంటారు. ప్రజల కోసం అక్కర్లేదు, కనీసం పవన్ కల్యాణ్ అయినా తన మనస్సాక్షిని ప్రశ్నించుకుంటే.. తిరుపతిలో బీజేపీకి ఓట్లు అడిగే సాహసం చేయరు.
ప్రశ్నిస్తా అంటూ పార్టీ పెట్టిన జనసేనాని, తనను తాను ప్రశ్నించుకోవడం ఎప్పుడో ఆపేశారు. బీజేపీ చెప్పినట్టల్లా చేయడమే పనిగా పెట్టుకున్నారు. అందుకే ఈరోజు తిరుపతిలో అడుగుపెడుతున్నారు. ఇక ఇవాళ్టి పవన్ ప్రసంగంలో ఎన్ని యూటర్న్ మాటలు వినాల్సి వస్తుందో ఏమో!