బోర్డర్ సినిమాలను చూపిస్తే కాసుల వర్షం కురిపిస్తాం.. సినిమాల్లో దేశభక్తికి రోమాలు నిక్కబొడుచుకుంటాయి, మనదగ్గర దేశభక్తి, హిందుత్వం.. అన్నీకూడా కమర్షియల్ ఎలిమెంట్సే! వాటిని అమ్ముకోవచ్చు. వాటిలో రాజకీయం చేయొచ్చు. ప్రజల మీద అధిపత్యాన్ని, డబ్బును.. అన్నింటినీ సంపాదించుకోవచ్చు! ఏతావాతా ఇదీ పరిస్థితి. సినిమాల్లో చూపిస్తే కానీ మనకు కొందరు యోధులు గుర్తుకురారు. వారు ఉన్నట్టుగా కూడా మనకు పెద్దగా అవగాహన ఉండదు. ఇదీ సగటు భారతీయుల పరిస్థితి.
'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' సినిమాను తెరమీద పెద్దఎత్తున చూపిన నేపథ్యంలో చాలామంది ఆయనను స్మరించుకుంటున్నారు. అయితే ఇన్ని దశాబ్దాల్లో ఉయ్యాలవాడకు ఉండిన గుర్తింపు ఏమిటి? ఆయనకు మనం ఇచ్చిన గౌరవం ఏమిటి? అంటే.. ఏమీలేదు. ఒకవేళ ఉయ్యాలవాడ బయోపిక్ ఇప్పుడు రాకపోయి ఉంటే.. ఇప్పటికీ పరిస్థితి గతంలానే ఉండేది.ఆయన ఎవరో మెజారిటీ ప్రజలకు తెలిసేది కూడా కాదు.
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా సినిమాను తీసి, ఆ యోధుడి కథను అందరికీ అర్థమయ్యేలా చేయడం, వివరించడం మంచిదే. అయితే సినిమా వస్తే కానీ ఆయన గురించి చాలా మందికి కనీస ఎరుక లేకపోవడం మాత్రం మన వాళ్ల దౌర్భాగ్యాన్ని చాటుతూ ఉంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన తిరుగుబాటు దేశమంతా చర్చించుకున్నది కాకపోవచ్చు. అయితే మొదట తిరుగుబావుట ఎగరేసింది ఆయనే. ఆ విషయాన్ని గుర్తించలేదు.
ఈ విషయంలో ప్రజలే కాదు.. ప్రభుత్వాల తీరు కూడా అంతంత మాత్రమే. ప్రభుత్వాలు కూడా ఉయ్యాలవాడకు ఇన్నేళ్లూ ఎలాంటి గుర్తింపును ఇవ్వలేదు. ఆయన వర్ధంతిరోజు అయినా.. కనీసం నివాళి ఘటించే కార్యక్రమాలు లేవు. ఇదీ మన యోధుడికి మనం ఇచ్చిన గౌరవం.
ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి రేనాటి ప్రాంతంలో జానపదులు, సంచార జాతులవారు ఇచ్చిన గౌరవాన్ని కూడా ఇన్నేళ్లు ప్రభుత్వాలు ఇవ్వలేకపోయాయి. ఇది నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. మన తీరు ఎలా ఉందో.. మన మహనీయులకు మనం ఎలాంటి గౌరవాన్ని ఇస్తున్నామో.. అర్థం చేసుకోవడానికి ఇదొక ఉదాహరణ.