గ్రామ సచివాలయానికి గ్రీన్‌సిగ్నల్
గోదావరి జిల్లాలపై ప్రత్యేకదృష్టి
ఇతర పార్టీల నేతల చేరికలకు ప్రాధాన్యత
ఆంధ్రప్రదేశ్ రాజకీయంగా సెంటిమెంట్ జిల్లాలుగా పేరొందిన గోదావరి జిల్లాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ఈ జిల్లాల్లో పార్టీ పరంగా మరింత పట్టు సాధించేందుకు ఆయన ప్రత్యేక వ్యూహంతో సాగుతున్నట్టు స్పష్టమవుతోంది. రాష్ట్రప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న గ్రామ సచివాలయ వ్యవస్థను తూర్పు గోదావరిజిల్లా కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కరప గ్రామంలో జగన్ ప్రారంభించారు. గ్రామ సచివాలయాలకు గోదావరి జిల్లాల నుండి అంకురార్పణ చేయడంతో జగన్ ఈ జిల్లాలపై ప్రత్యేక శద్ధ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
తెలుగువారి జీవనాడి పోలవరం ప్రాజెక్ట్‌కు కేంద్ర స్థానమైన గోదావరి ప్రాంతంపై ఇటీవల పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. బహుళార్ధక సాధక పోలవరం ప్రాజెక్ట్ సహా గోదావరి జిల్లాలకు సంబంధించి ఇక నుండి ప్రతీ అంశానికీ ప్రాధాన్యతనివ్వడం ద్వారా రాష్ట్ర రాజకీయాలపై తనదైన ముద్ర వేసేందుకు జగన్ వ్యూహాత్మకంగా సాగుతున్నట్టు తెలుస్తోంది. ఓ వైపు ప్రభుత్వ పరంగా గోదావరి జిల్లాలపై దృష్టి సారించడంతో పాటు పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వైకాపా మరింత పటిష్టం చేసేదిశగా సాగుతున్నారు. ఇందులో భాగంగా ఇతర రాజకీయ పార్టీలకు చెందిన నేతలను వైకాపాలో చేర్చుకుంటున్నారు.
ఆయా నియోజకవర్గాల్లో ఇతర పార్టీల నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తుండటాన్ని స్థానిక వైకాపా నేతలు వ్యతిరేకిస్తున్నప్పటికీ వారి వాదనకు జగన్ ప్రాధాన్యతనివ్వకపోవడం గమనార్హం! అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో ఇతర పార్టీలకు చెందిన జంప్ జిలానీల పట్ల పార్టీ నేతలు సానుభూతితో వ్యవహరించాలని జగన్ సూచిస్తున్నారు. ప్రత్యేకించి టీడీపీకి చెందిన సామాజికంగా, ఆర్థికంగా పట్టున్న ఇతర పార్టీల నేతలను పార్టీలో చేర్చుకోవడం ద్వారా తెలుగుదేశం పార్టీ ఉనికిలేకుండా చేయాలన్నది జగన్ వ్యూహంగా చెప్పుకుంటున్నారు.
అయితే వివిధ అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన ఇతర పార్టీల నేతలను (పార్టీకి అవసరం లేకపోయినా) వైకాపాలో చేర్చుకోవడాన్ని కొందరు పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. తెలుగుదేశం సహా కాంగ్రెస్, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన పలువురు నేతలు వైకాపాలో ఇప్పటికే చేరిపోయారు. ఈ చేరికల పట్ల కొన్ని నియోజకవర్గాల్లో వైకాపా శ్రేణులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. ఇదిలావుంటే వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత మూడు నాలుగు నెలల్లో సాధించిన విజయాలను జనంలోకి తీసుకువెళ్ళాలని జగన్ పిలుపునిచ్చారు.
కరప గ్రామంలో గ్రామ సచివాలయ వ్యవస్థను గాంధీ జయంతిరోజైన అక్టోబర్ 2న జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి పల్లెలు ఆత్మవంటివని గాంధీజీ చెప్పిన మాటలకు కట్టుబడి గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు జగన్ ప్రకటించారు. గ్రామ సచివాలయంలో నియమించిన ఉద్యోగులు, గ్రామ/వార్డు వలంటీర్లు ప్రజా సమస్యల పరిష్కారానికి ఇక నుండి కృషి చేస్తారని వెల్లడించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల సాధనకు ప్రభుత్వం ట్టుబడి ఉందన్నారు.
ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగంతో పాటు పార్టీ శ్రేణులు సైతం కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ఒకేరీతిలో అభివృద్ధి చేయడంతో పాటు ఆయావర్గాల ప్రజల సంక్షేమానికి తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతామని ఆయన ప్రజలకు హామీనిచ్చారు.