ఇప్పుడు మీడియాలో ఒక ప్రశ్న వినిపిస్తోంది. ఏమిటది? టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హుజూర్నగర్ ఉప ఎన్నికలో పార్టీ తరపున ప్రచారం చేస్తారా? అనేది. టీఆర్ఎస్ వర్గాలు కూడా దీనిపై ఆసక్తిగా ఉన్నాయి. చంద్రబాబు ప్రచారం చేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్కు మంచి ఆహారం దొరికినట్లే. చంద్రబాబును మళ్లీ ఆడుకోవచ్చు. ఆడుకోవడమంటే నోటికొచ్చినట్లు నానా విధాలుగా దుర్భాషలాడటం. తెలంగాణకు చంద్రబాబును పెద్ద శని మాదిరిగా అభివర్ణించడం, ఆయన కాలు పెడితేనే తెలంగాణ అపవిత్రమైనట్లుగా ప్రచారం చేయడం కేసీఆర్కు అలవాటు.
బాబును పెద్ద బూచిగా చూపించి రాజకీయ ప్రయోజనాలు సాధించుకోవడం ఆయన నైజం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబుపై కేసీఆర్ వేసిన వీరంగం అందరికీ తెలుసు. చంద్రబాబు ప్రచారానికి వస్తే మళ్లీ అదే జరుగుతుందని టీఆర్ఎస్, టీడీపీ నాయకులు అనుకుంటున్నారు. నిజానికి హుజూర్నగర్ ఉప ఎన్నికలో టీడీపీ పోటీదారే కాదు. ఉనికి కోసం పోటీ చేస్తున్నదంతే. గెలిచే అవకాశం లేదని రాష్ట్ర నాయకులకు తెలుసు. బాబుకూ తెలుసు. లోక్సభ ఎన్నికల్లో పూర్తిగా దుకాణం మూసేశారు. ఆ తరువాత మున్సిపల్ ఎన్నికలు జరిగితే పోటీ చేయాలనుకున్నారు.
వాటికి ఇంకొంత కాలం పడుతుంది. ఈలోగా హుజూర్నగర్ ఉపఎన్నిక వచ్చింది కాబట్టి పోటీ చేయాలని రాష్ట్ర నాయకులు బాబుపై ఒత్తిడి తెచ్చారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా పొత్తు పెట్టుకుని ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే పరిస్థితి కూడా లేదు కాబట్టి టీడీపీ కూడా రంగంలోకి దిగింది. ప్రధాన పోటీ టీఆర్ఎస్, కాంగ్రెసు మధ్యనే జరుగుతోంది. ఇదేదో పెద్ద కురుక్షేత్ర యుద్ధమన్నట్లుగా రెండు పార్టీలూ వ్యవహరిస్తున్నాయి. ఇది కేసీఆర్, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య వ్యక్తిగత పోరాటంగా మారింది.
బాహుబలి టైపు గొప్పలు చెప్పుకునే కేసీఆర్ చివరకు బలంలేని, తాను ఖాతరు చేయని సీపీఐ మద్దతు తీసుకున్నారు. ఉనికిలో లేని వైకాపా మద్దతు అడిగారు. దీంతో కేసీఆర్ భయపడుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక టీడీపీ విషయానికొస్తే బాబు నిన్న పార్టీ నాయకులతో సమావేశమై ఉపఎన్నిక వ్యూహంపై చర్చించారు. ఏం చర్చించారనే విషయం టీడీపీ అనుకూల మీడియాలోనూ రాలేదు. ఇతర పార్టీలకు దీటుగా ప్రచారం చేయాలని బాబు నాయకులకు చెప్పినట్లు వార్తలొచ్చాయి.
నిజమే… దీటుగా ప్రచారం చేయాల్సిందే. కాని ఎవరు చేయాలి? దీటుగా, ఘాటుగా ప్రచారం చేసే నాయకులు తెలంగాణ టీడీపీలో ఎవరున్నారు? అసలు నాయకులే లేనప్పుడు దీటుగా ప్రచారం చేస్తూ చేయడానికి ఎవరుంటారు? టీఆర్ఎస్ అధికార పార్టీ కాబట్టి అంగ బలంలో టాప్లో ఉంది. కాంగ్రెసులోనూ నేతలున్నారు కాబట్టి వారూ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. కాని టీడీపీలో జనంలోకి వెళ్లే నేతలు ఏరీ? ఏ కోణంలో చూసుకున్నా దీటుగా ప్రచారం చేయాల్సిన బాధ్యత చంద్రబాబు పైనే ఉందని చెప్పుకోవాలి.
కేసీఆర్ ఎంతగా విరుచుకుపడ్డా బాబుకు ప్రచారం చేయక తప్పదు. హుజూర్నగర్లో చంద్రబాబు ప్రచారం చేస్తే టీఆర్ఎస్ గెలుస్తుందని కొందరు టీఆర్ఎస్ నాయకులు చెబుతున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు కారణంగానే టీఆర్ఎస్ గెలిచిందని, ఇప్పుడూ అలాగే గెలుస్తుందని సెంటిమెంటుగా చెబుతున్నట్లు ఓ ఆంగ్ల పత్రిక కథనం. కొంతకాలం కిందట హైదరాబాదులోని టీడీపీ కార్యాలయానికి వచ్చిన బాబు నేతలతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఎప్పటిమాదిరిగానే ధైర్యం చెప్పారు. ఓదార్చారు.
తెలంగాణలో టీడీపీ ఉండటం చారిత్రక అవసరమన్నారు. ఏనాటికైనా ఈ రాష్ట్రంలో టీడీపీ జెండా మళ్లీ ఎగురుతుందని చెప్పారు. ఇకనుంచి ప్రతి శనివారం కార్యాలయానికి వచ్చి సమావేశం పెడతానన్నారు. తెలంగాణ టీడీపీ గురించి తాను చాలా సీరియస్గా ఉన్నట్లు సంకేతాలిచ్చారు. ఆ సీరియస్నెస్ ఫలితంగానే హుజూర్నగర్ ఉప ఎన్నికలో పోటీ.