ఏపీలో ఒక పెద్ద ప్రయోగమే జరుగుతోంది. గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సృష్టించిన తీరు ఆసక్తికరమైనది. నిజానికి నాలుగు నెలల వ్యవధిలో సుమారు రెండు లక్షలమంది వలంటీర్లను, లక్షాముప్పై వేలమంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలను ఏర్పాటు చేసి అందుకు అవసరమైన పరీక్షలు నిర్వహించడం అంటే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆలోచన జగన్ ది. ఆచరణ అధికారులది. పర్యవేక్షణ మంత్రులది. ఈ ప్రభుత్వం సమర్థంగా చేయగలుగుతుందన్న విషయాన్ని ఈ ఉద్యోగాల ఎంపిక రుజువు చేసింది.
సహజంగానే దీనికి సంబందించి పాజిటివ్ మెస్సేజ్ వెళితే వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు, ముఖ్యమంత్రి జగన్‌కు విశేషమైన పేరు వస్తుంది. అది రాజకీయంగా మరింత లాభం చేస్తుంది. అందుకే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కాని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వంటివారు వాటికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. చేస్తున్నారు. నిజమే వీటిలో ఏవైనా లోపాలు ఉంటే ఎత్తి చూపవచ్చు. కాని వారు అలా చేయలేదు. కేవలం విష ప్రచారానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. తెలుగుదేశం మీడియా అయితే సచివాలయ ఉద్యోగాల ప్రక్రియలో ఏదో జరిగిపోయిందని, పరీక్ష పత్రాలు లీక్ అయ్యాయని పెద్దఎత్తున వదంతులు వ్యాపింప చేసేయత్నం చేసింది.
దానిని చంద్రబాబు నాయుడు అందిపుచ్చుకుని మొత్తం 19 మంది లక్షలమంది నిరుద్యోగులకు అన్యాయం జరిగిపోయిందని సెలవిచ్చేశారు. ఈ వ్యాఖ్య ద్వారా ఆయన తనకు తెలియకుండానే ఒక విషయాన్ని అంగీకరించేశారు. తన ప్రభుత్వ హయాంలో నిరుద్యోగుల సంఖ్య ఇబ్బడి, ముబ్బడిగా పెరిగిపోయిందని ఆ సంఖ్య 19 నుంచి 20 లక్షల సంఖ్య వరకు ఉందని చంద్రబాబు ఒప్పుకున్నారన్నమాట. మనదేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఒక ఉద్యోగానికి వందల సంఖ్యలో కాదు.. వేల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నమాట నిజం.
యూపీలో అయితే ఒక అటెండర్ ఉద్యోగానికి వెయ్యికిపైగా దరఖాస్తులు వచ్చాయని ఆ మద్య వార్తలు వచ్చాయి. ఇప్పుడు లక్ష్యాముప్పైవేల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఇన్ని లక్షలమంది హాజరు అవడం ఒక ఎత్తు అయితే, వాటిని ఎక్కడా ఇబ్బంది లేకుండా నిర్వహించడం ఒకఎత్తు అనిచెప్పాలి. ఈ పరీక్షలలో ఎంపికైన వారికి స్వయంగా ముఖ్యమంత్రి, మంత్రులు నియామకపత్రాలు అందచేశారు. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రసంగం హుందాగా సాగింది.
ఎక్కడా ప్రతిపక్షం చేసే పిచ్చి ఆరోపణలు, విమర్శలను ప్రస్తావించలేదు. కేవలం ఉద్యోగాలు పొందినవారు నిజాయితీగా పనిచేయాలని, ప్రజలకు సేవలందించడం ద్వారా మంచి పేరు తమకు, తద్వారా ప్రభుత్వానికి తేవాలని హితబోధ చేశారు. అంతేకాదు.. జనవరి నుంచి ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్‌లు ఇస్తామని ఆయన ప్రకటించారు. అసలు చంద్రబాబు ఊసే ఎత్తలేదు. అదే చంద్రబాబు ఇలాంటి కార్యక్రమం తాను అధికారంలో ఉన్నప్పుడు చేపట్టి ఉంటే తన గురించి తానే ఎంత గొప్పగా చెప్పుకునేవారో.. అలాగే అప్పట్లో ప్రతిపక్ష నేత జగన్‌పై ఎన్ని విమర్శలు కురిపించేవారో.. కాని జగన్ మాత్రం అలాంటివాటి జోలికి వెళ్లకపోవడం హర్షదాయకం.
ఆ రకంగా జగన్ పరిణితితో వ్యవహరిస్తే చంద్రబాబు మాత్రం ఏదిబడితే అది మాట్లాడి పరువు తీసుకుంటున్నారు. వలంటీర్లను, గ్రామాలలో, పట్టణాలలో ఉండే మహిళలను అవమానించే రీతిలో ఆయన మాట్లాడారు. ఆడవాళ్లు ఒంటరిగా ఇళ్లలో ఉన్నప్పుడు ఈ వలంటీర్లు వెళతారా అని ఘీంకరించారు. దానికి సోషల్ మీడియాలో వచ్చిన కౌంటర్లు చూస్తే చంద్రబాబుకు దిమ్మదిరిగినంత పని అవుతుంది. ఒక వలంటీర్ ఒక వృద్ధురాలైన అవ్వను 108 అంబులెన్స్ ఎక్కిస్తూ సేవచేస్తుంటే, చంద్రబాబు కుమారుడు, మాజీమంత్రి లోకేష్ గతంలో తన గర్ల్‌ఫ్రెండ్స్‌తో ఆడుకుంటున్న ఫోటోలను జతచేసి మరీ కామెంట్ చేశారు.
అది చంద్రబాబుకు ఎంత అప్రతిష్ట అన్నది ఆలోచించుకోవాలి. అంత పెద్ద సీనియర్ అయిన చంద్రబాబు ఏదిబడితే అది మాట్లాడి అదేదో జగన్‌ను సాధిస్తున్నానని అనుకుంటన్నారు. కాని తన ప్రతిష్టను మరింత దిగజార్చుకుంటున్నారన్న సంగతి తెలుసుకోవాలి. జగన్ ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తున్నప్పుడు కొందరు అభ్యర్ధులు మాట్లాడిన తీరు ఆశ్చర్యంగా ఉంటుంది. చెవుడు, మూగ అయిన ఒక యువతి సైగలు చేసి తన భావాలను వ్యక్తపరుస్తుంటే, ఒక వ్యక్తి వాటిని అనువదించారు. ఆ సన్నివేశం నిజంగా అబ్బురమైంది.
అసలు ఉద్యోగమే దొరకదేమో అనుకుంటున్న ఆ సామాన్య యువతికి సచివాలయ ఉద్యోగం రావడం, ఆమె తన కుటుంబ పరిస్థితి వివరించి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన తీరు ఒక్కటిచాలు.. జగన్ ఈ విషయంలో చేసిన ప్రయోగం విజయవంతం అయిందని. ఆయన లక్ష్యం నెరవేరిందని. జగన్ ఈ రకంగా వలంటీర్లు, సచివాలయాలను సృష్టించకపోతే ఇన్ని లక్షలమందికి అవకాశం వచ్చేదికాదు కదా.. వారంతా నిరుద్యోగులుగానే కాలం గడపాలి కదా. ఇది పెద్ద ఉద్యోగం కాకపోవచ్చు.
కాని వారి కుటుంబాలకు ఇది పెద్ద ఆసరా అవుతుందన్నది వాస్తవం. అయితే భవిష్యత్తులో ఈ వ్యవస్థల వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో తెలియదు. అలా రాకుండా ప్రభుత్వం జాగ్రత్తపడుతుండాలి. అలాగే ఈ ఉద్యోగాలు పొందినవారు ప్రజలకు చక్కగా సేవలందించగలగాలి. అప్పుడే ఈ ప్రయోగం పూర్తిగా విజయవంతం అవుతుంది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా, వలంటీర్ల ద్వారా ప్రజల ఇళ్ల వద్దకే ప్రభుత్వం చేరాలన్న జగన్ లక్ష్యం పరిపాలన వికేంద్రీకరణలో సరికొత్తమలుపు. ఇది విజయవంతం అయితే దేశానికే ఒక రోల్ మోడల్ అవుతుంది.
అన్ని రాష్ట్రాలు ఏదో ఒక రూపంలో దీనిని అనుసరించే యత్నంచేస్తాయి. అయితే ఇవి తేలికగా విజయవంతం అయిపోతాయనో, విజయవంతం అయిపోయాయనో అనుకోకుండా ఎప్పటికప్పుడు ప్రభుత్వం అప్రమత్తంగా ఉండవలసి ఉంది. సచివాలయాలు ఆరంభం అయ్యాయి కనుక ఆరునెలల తర్వాత కాని వీటి ఫలితాలు తెలియవు. అంతవరకు ఇది ప్రయోగమే. ఒక్కసారి ఫలితాలు సానుకూలంగా ఉంటే జగన్‌కు తిరుగు ఉండదు. కాని వీటిని విజయవంతం కానివ్వకుండా ఎన్నో ఆటంకాలు సృష్టించడానికి ప్రయత్నాలు జరుగుతాయి.
యజ్ఞం జరుగుతుంటే రాక్షసులు అడ్డుపడుతుంటారని అంటారు. గతంలో చంద్రబాబు నాయుడు పదే, పదే ఈ మాట అంటుండేవారు. గతంలో ప్రతిపక్షం అడ్డుపడిందా? లేదా అన్నది వేరే విషయం. ఆయన ఓటమితో ఆయన ఆరోపణలు అవాస్తవమని తేలిపోయాయి. అయితే ఇప్పుడు జగన్ చేస్తున్న యజ్ఞాన్ని చంద్రబాబు అడ్డుకుంటారా?
-కొమ్మినేని శ్రీనివాసరావు