తెలుగులో సంచలన విజయం సాధించిన ఆర్ఎక్స్100 సినిమా హిందీ రీమేక్ రెడీ అవుతోంది. ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న పాయల్ రాజ్ పుత్, హిందీ రీమేక్ పై స్పందించింది. మరీ ముఖ్యంగా బాలీవుడ్ రీమేక్ లో తనకు ఎందుకు అవకాశం రాలేదో చెప్పుకొచ్చింది.
“ఆర్ఎక్స్100లో నా నటనను అంతా మెచ్చుకున్నారు. నాకు తెలిసిన కొంతమంది బాలీవుడ్ ప్రముఖులు కూడా నా పెర్ఫార్మెన్స్ ను మెచ్చుకున్నారు. ఈ సినిమా హిందీలోకి రీమేక్ అవుతోంది. సాజిద్ నడియావాలా రీమేక్ చేస్తున్నారు. ఆయన కూడా నా నటనను మెచ్చుకున్నారు. కానీ నేను రీమేక్ లో అవకాశం ఇవ్వమని అడగలేదు. వాళ్ల కమిట్ మెంట్స్ వాళ్లకున్నాయి. అందుకే తారా సుతారియాను తీసుకున్నారు. నేను మాత్రం కమిట్ అవ్వలేదు.”
మరోవైపు తాజా చిత్రం ఆర్డీఎక్స్ లవ్ పై వస్తున్న విమర్శలపై కూడా పాయల్ స్పందించింది. ఈ సినిమా టీజర్ చూసిన తర్వాత చాలామంది తనను పోర్న్ స్టార్ అంటూ ట్రోల్ చేస్తున్నారని చెప్పుకొచ్చింది. తను బాగా రాటుదేలానని, మానసికంగా ఎవ్వరూ డిస్టర్బ్ చేయలేరని అంటోంది.
“ఆర్డీఎక్స్ లవ్ సినిమా టీజర్ చూసిన తర్వాత చాలామంది సోషల్ మీడియాలో నన్ను పోర్న్ స్టార్ అన్నారు. ఆ క్షణంలో నాకు చాలా బాధేసింది. ఓ రాత్రి ఏడ్చేశాను కూడా. కానీ మానసికంగా నేను చాలా దృఢంగా ఉంటాను. వెంటనే ఆ ట్రోల్స్ నుంచి బయటకు వచ్చేశాను. బోల్డ్ డైలాగ్స్, బోల్డ్ సీన్స్ ఉన్న ఇలాంటి పాత్రల్ని నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు.”
ఆర్డీఎక్స్ లవ్ ప్రమోషన్ లో భాగంగా మాట్లాడిన పాయల్.. ఇకపై కూడా హాట్ క్యారెక్టర్స్ చేయడానికి ఏమాత్రం ఆలోచించనని ప్రకటించుకుంది. ప్రస్తుతం ఓ హాట్ ఐపీఎస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నానని చెప్పుకొచ్చింది. పాయల్ ఏం చేయబోతోందో క్లియర్ గా చెప్పేసింది. సో.. ఇక ఆమెకు స్టార్ హీరోల సరసన అవకాశాలు కష్టమే.