సంచయిత గజపతిరాజు. పూసపాటి వారి వంశంలో మూడవ తరానికి చెందిన వారసురాలు. ఆనందగజపతిరాజు పెద్ద కుమార్తె. ఆమె వారసత్వాన్ని గుర్తించి వైసీపీ సర్కార్ అటు మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ గా. ఇటు సుప్రసిధ్ధ సింహా చలం దేవస్థానం బోర్డు చైర్ పర్సన్ గా నియమించింది. ఆమె నియామకాన్ని ఏ పార్టీ విమర్శించనంతగా నాడు బీజేపీ బాణాలు ఎక్కుపెట్టింది.
సరే అది గతం. ఇపుడు వర్తమానంలో ఏపీ బీజేపీకి కొత్త ప్రెసిడెంట్ వచ్చారు. దాంతో సంచయిత మన పార్టీ అంటూ సోము వీర్రాజుకు విషెస్ చెప్పడమే విశేషం. వీర్రాజు గారు మీ నాయకత్వంలో మన పార్టీ అభివ్రుధ్ధి సాధించాలని కోరుకుంటున్నానని సంచయిత పేర్కొన్నారు. అందుకు గానూ ఆ సింహాచల దేవుడి నిండు ఆశీస్సులు వీర్రాజు ఉండాలని కోరుకుంటున్నట్లుగా కూడా చెప్పారు.
ఇంతకాలం ఆమె వైసీపీలో చేరుతారు అన్న ప్రచారం జరిగింది. నిజానికి ఆమెకు ఇంతటి ఉన్నత హోదా కల్పించడానికి వైసీపీయే ప్రధాన కారణం అన్నది తెలిసిందే. లేకపోతే కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు వంటి రాజకీయ దిగ్గజాన్ని ఢీ కొట్టడం అయ్యే పనే కాదు.
సరే సంచయిత బీజేవైఎంలో ఉన్నారని కూడా అప్పట్లో చెప్పారు. అయినా సరే తమ పార్టీ నాయకురాలు ఇంతటి కీలకస్థానంలో ఉన్నారని సంతోషించడానికి బదులు బీజేపీ నాలుగు రాళ్ళు ఆమె మీద వేసి టీడీపీతో కలసి విమర్శలు చేసింది. ఆమె సింహాచల ట్రస్ట్ పోస్టుకు అనర్హురాలని ఇదే బీజేపీ నేతలు నాడు తూలనాడారు.
మరి ఇపుడు ఆమె సోము వీర్రాజు నియామకాని గట్టిగా సపోర్టు చేయడమే కాకుండా మన పార్టీ అభివ్రుధ్ధి సాధించాలి అని కోరుకోవడాన్ని బట్టి చూస్తూంటే గత కన్న లక్ష్మీనారాయణ నాయకత్వంలో ఆమె కూడా బీజేపీకి దూరంగా ఉంటూ వచ్చారా అన్న డౌట్లు వస్తున్నాయి. ఇక ఆమె వీరానందం చూసి అటు బీజేపీ మాత్రమే కాదు, ఇటు టీడీపీ కూడా షాక్ తింటోంది. మొత్తానికి యువరాణి రాజకీయం బాగానే నేర్చారని అంటున్నారు.