లుకలుకలు మొదలు.. వీర్రాజుపై జనసైనికులు ఫైర్

2024లో అధికారం మాదే. ఏ పార్టీకాపార్టీ అంచనాలు ఇలాగే ఉంటాయి. కానీ బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం మరో అడుగు ముందుకేసి ముఖ్యమంత్రి ఎవరనే విషయాన్ని ప్రస్తావించారు. 2024 ఎన్నికల తర్వాత …

2024లో అధికారం మాదే. ఏ పార్టీకాపార్టీ అంచనాలు ఇలాగే ఉంటాయి. కానీ బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం మరో అడుగు ముందుకేసి ముఖ్యమంత్రి ఎవరనే విషయాన్ని ప్రస్తావించారు. 2024 ఎన్నికల తర్వాత  బీజేపీ-జనసేన అభ్యర్థి ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. ఆ అభ్యర్థి ఎవరనేది అధిష్టానం నిర్ణయిస్తుందని అన్నారు. అంటే జనసైనికులు అనుకుంటున్నట్టు పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థి కాదా? ఒకవేళ ఆయనే సీఎం క్యాండిడేట్ అయితే మరి బీజేపీ నాయకులు ఎందుకు కామన్ అభ్యర్థి అని చెప్పుకుంటున్నారు. వారిలో కూడా ఏవైనా ఆశలున్నాయా?

అసలు 2024లో ఏపీలో అధికార మార్పిడి జరుగుతుంది అనుకోవడమే పెద్ద అత్యాశ అయితే, అందులోనూ బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి ముఖ్యమంత్రి అవుతారనుకోవడం మరీ దురాశ. ఆశలకు హద్దుల్లేవన్నట్టు వీర్రాజు ఆ మాట అన్నారు. అయితే ఆ అత్యుత్సాహమే జనసైనికుల్లో ఆగ్రహ జ్వాలలు రగిల్చింది. తమ నాయకుడి సత్తా ఏంటో తెలిసినా కూడా మిత్రపక్షం ఇలా మాట్లాడ్డం సరికాదని కొంతమంది వీర విధేయ జన సైనికులు సోషల్ మీడియాలో తమ అసంతృప్తి వెళ్లగక్కారు.

ఎన్నికల ప్రచారంలో సీఎం సీఎం అంటూ పవన్ కల్యాణ్ ని ఆకాశానికెత్తేసిన జనసైనికులు.. రెండు చోట్ల అధినాయకుడు పోటీ చేస్తే ఒక్క చోట కూడా గెలిపించుకోలేకపోయారు. అలాంటి జనసైనికులకు కూడా వీర్రాజు మాటలు కోపం తెప్పించాయనడం హాస్యాస్పదమే అవుతుంది. కానీ సైనికులు తగ్గడం లేదు. ఆరు నూరైనా వచ్చే దఫా ఏపీ సీఎం పవన్ కల్యాణే అని అంటున్నారు. 

పవన్ కల్యాణ్ మాత్రం ఈ విషయంపై సైలెంట్ గా ఉన్నారు. వీర్రాజు స్టేట్ మెంట్ ని ఆయన స్వాగతించలేదు, కనీసం బదులు చెప్పలేదు. మొత్తమ్మీద పార్టీ పగ్గాలు చేపట్టగానే ఓ వీరావేశ డైలాగ్ వేసి అందరిలో ఆత్మస్థైర్యం నింపుదామనుకున్న నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు అనుకోకుండా జనసైనికులకు ఇలా బుక్కయ్యారు.

ఇంతకీ ఆ కామన్ అభ్యర్థి ఎవరో, ఆయన్ని ఎవరు డిసైడ్ చేస్తారో, అది ఎన్నికలకు ముందో, లేక రిజల్ట్ చూసుకున్న తర్వాతో.. కొత్త అధ్యక్షుడు చెబితే బాగుండేది. ఎన్నికల ముందు ఎలాగూ చెప్పరు, ఆ తర్వాత చెప్పాల్సిన అవసరమే ఉండదు.

పేషేంట్లకి బెడ్ ఇవ్వలేకపోతే మనం మనుషులమే కాదు

త‌ప్పంతా నాదే…రోజా నాకు అక్క లాంటిది