మొదటి రోజు వసూళ్లలో రికార్డు సృష్టించాలని కంకణం కట్టుకున్నారు. టిక్కెట్లు రేట్లు భారీగా పెంచాలని నిర్ణయించుకున్నారు. సోలో రిలీజ్ తో హయ్యస్ట్ థియేటర్లు ఆల్రెడీ దక్కించుకున్నారు. ఇలా రికార్డుల కోసం వకీల్ సాబ్ చేయని ప్రయత్నం లేదు. అయితే ఇప్పుడు వకీల్ సాబ్ కు అనుకోని విధంగా ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో కొన్ని మండల కేంద్రాల్లో లాక్ డౌన్ విధించారు. కేసులు ఇలానే పెరిగితే, మరో 3-4 రోజుల్లో థియేటర్లు, షాపింగ్ మాల్స్ పై కూడా పాక్షికంగా ఆంక్షలు విధించే అవకాశం ఉందని స్వయంగా అధికారులే చెబుతున్నారు. మరీ ముఖ్యంగా థియేటర్లలో ఆక్యుపెన్సీని 50 శాతానికి తగ్గించేలా నిర్ణయాలు తీసుకోవచ్చని అంటున్నారు. అదే జరిగితే వకీల్ సాబ్ కు పెద్ద ఎదురుదెబ్బ.
ఇటు తెలంగాణలో ప్రస్తుతానికి ఎలాంటి సంకేతాలు అందడం లేదు. లాక్ డౌన్ పెట్టేది లేదని ప్రభుత్వం తెగేసి చెప్పేసింది. అయినప్పటికీ పెరుగుతున్న కరోనా కేసుల్ని దృష్టిలో పెట్టుకొని పరిమిత ఆంక్షలు విధించే అవకాశాల్ని పరిశీలిస్తోంది. వచ్చే వారం దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించబోతున్నారు.
మరోవైపు వకీల్ సాబ్ బెనిఫిట్ షోలపై అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. అటు నిర్మాతలు కూడా దీనిపైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. వెయ్యి రూపాయల నుంచి 1500 రూపాయల వరకు టిక్కెట్ పెట్టి.. మిడ్ నైట్ షో తో పాటు ఎర్లీ మార్నింగ్ షోలు ప్లాన్ చేయాలని భావించింది యూనిట్. కానీ కరోనా కేసులు పెరుగుతుండడంతో బెనిఫిట్ షోలకు తెలుగు రాష్ట్రాల్లో అనుమతి దక్కడం దాదాపు కష్టంగా కనిపిస్తోంది.
ఈ పరిణామాలన్నీ కలిసి వకీల్ సాబ్ వసూళ్లకు భారీగా గండికొట్టబోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 78 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే వకీల్ సాబ్ సినిమా వంద శాతం ఆక్యుపెన్సీని కొనసాగిస్తూ.. బ్లాక్ బస్టర్ అవ్వాలి.