కంగన రనౌత్ ‘తలైవి’ పాటలో ఏముంది?

త్వరలో తెరమీదకొస్తున్న జయలలిత బయోపిక్ కి “తలైవి” గా నామకరణం చేసారు. తమిళంలో దీని అర్థం “నాయకురాలు”. అయితే హిందీ కి, తెలుగు కి కూడా అదే టైటిల్ పెట్టేసారు. “తలైవా” అంటే రజనీకాంత్…

త్వరలో తెరమీదకొస్తున్న జయలలిత బయోపిక్ కి “తలైవి” గా నామకరణం చేసారు. తమిళంలో దీని అర్థం “నాయకురాలు”. అయితే హిందీ కి, తెలుగు కి కూడా అదే టైటిల్ పెట్టేసారు. “తలైవా” అంటే రజనీకాంత్ అని “చెన్నై ఎక్స్ప్రెస్” కారణంగా దేశమంతా తెలిసినట్టు “తలైవి” అంటే జయలలిత అని ఫిక్స్ చేసేసారు.  

ఇక కంగనా రనౌత్ టైటిల్ రోల్ పొషించిన ఈ చిత్రం ట్రైలర్ కి మంచి స్పందనే వచ్చింది. మూడు భాషల్లోనూ మిలియన్ల వ్యూస్ దాటెసింది. ఈ రోజు తొలి పాట కూడా విడుదలయింది. 

“ఇలా ఇలా తేలాను” అంటూ సాగే ఆ పాట బహుశా 1970లలో జయలలిత సినిమా షూటింగ్ సన్నివేశానికి సంబంధించిన పాట కావొచ్చు. అదే నిజమైతే ఇక్కడ గమనించాల్సిందేమిటంటే మహానటి, ఎన్.టి.ఆర్ కథానయకుడు లో పాత పాటల్ని వాడుకున్నట్టు కాకుండా ఇక్కడ కొత్త గా కంపోజ్ చేసి రాయించుకున్నారనుకోవాలి. లేకపోతే ఇది జయలలిత పాత్ర తనలో తాను పాడుకునే భావగీతం అయినా కావొచ్చు. 

ఏదైనా రెట్రో స్టైల్లో జీవీ ప్రకాష్ సమకూర్చిన బాణీకి సిరాశ్రీ సాహిత్యంలోని తూకం సరిపోయింది. పదాలు కూడా రెట్రో స్టైల్లోనే 1970 ల నాటి పాటలని గుర్తు చేసేలా ఉన్నాయి. 

కళ్లుమూసుకుని వింటుంటే డైరెక్ట్ తెలుగు సినిమా పాట వింటున్నట్టుంది. కళ్లు తెరిచి చూస్తుంటే మాత్రం డబ్బింగ్ సినిమా ఫీలింగొస్తోంది. కొన్ని చోట్ల లిప్ సింక్ అయినా, కొన్ని చోట్ల కాలేదు. హింది, తమిళ్ వెర్షన్స్ మాత్రం సింక్ అయ్యాయి- రెండూ విడిగా తీసినట్టున్నారు. తెలుగులో రాసేటప్పుడు లిప్ సింక్ ని దృష్టిలో పెట్టుకొని రాసుంటే ఇంకా బాగుండేది.

ఇక సాహిత్యం విషయానికొస్తే తమిళ వెర్షన్ ని పక్కన పెట్టి స్వేచ్ఛగా రాయడం వల్ల తెలుగుదనం వినిపిస్తోంది. పైగా జయలలిత పాత్రలోని ఆంతర్యాన్ని ఆవిష్కరించినట్టు కూడా ఉంది. ముఖ్యంగా, “శభాషనేలా, తమాషగానే నా మాయ చూపించనా-నా ప్రేమతోటి పాషాణమైనా ప్రాణాన్ని పొందేయదా” అన్నప్పుడు రాజకీయంగా “తలైవి” అనిపించుకుని ఆమె చూపించిన మాయ, “అమ్మ” అని పిలిపించుకుని ఆమె పంచిన ప్రేమ స్ఫురిస్తాయి. 

అలాగే, “కన్నుల్లో ఉన్న కనుపాప కూడా కలలేవో కంటూ ఉంది-నేలమ్మ మనసే ఆ నింగికిచ్చి ఓ ముద్దు కోరుతోంది” అనే పంక్తులు కవిత్వపరంగా బాగున్నాయి. గాయని సైంధవి మూడు భాషల్లోనూ వినసొంపుగా పాడింది. చరణాల్లోని హై పిచ్ లైన్స్ కూడా కీచుగింతు వినపడకుండా చక్కగా అందుకోగలింది. మొత్తానికి “తలైవి”లోని మొదటిపాట పాతపాటలు ఇష్టపడేవారికి నచ్చేటట్టే ఉంది.