ఒకరకంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించాలన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహం రైటే. ఎందుకంటే ఆయనకు అంతకు మించి ఛాయిస్ లేదు. పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తుల్లేకుండా జరిగాయి, దీంతో ఆ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు చాలా చోట్ల గెలిచారంటూ, తమకు 40 శాతం ఓట్లు వచ్చాయంటూ చెప్పుకోవడానికి చంద్రబాబుకు అవకాశం ఏర్పడింది.
తీరా మున్సిపల్-కార్పొరేషన్ ఎన్నికలు పార్టీ గుర్తుల మీద జరిగాయి. తెలుగుదేశం పార్టీ జాతకం మొత్తాన్నీ అవి బయటపెట్టాయి. పార్టీ గుర్తుల్లేకుండా ఎన్నికలు జరిగితే చంద్రబాబుకు నోరుంది కాబట్టి, ఆయనకు మీడియా ఉంది కాబట్టి.. కావాల్సినన్ని సీట్లలో గెలిచినట్టుగా ప్రకటించుకోవచ్చు. రేపటి ఎంపీటీసీ-జడ్పీటీసీ ఎన్నికలు మళ్లీ పార్టీ గుర్తు మీదే జరుగుతాయి.
అందులోనూ తెలుగుదేశం పార్టీకి ఇంకా పట్టు మిగిలే ఉందనుకున్న అర్బన్ లో అంతో ఇంతో అయినా ఉనికి కనిపించింది. రేపు మళ్లీ పల్లెలు కూడా ఓటేస్తాయి. దీంతో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటో మరింత స్పష్టంగా బయటపడుతుంది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనే జీరో అయిన పార్టీ.. రేపటి ఎంపీటీసీ-జడ్పీటీసీ ఎన్నికల్లో జీరో గా మిగలడం తప్ప మరో ఫలితం వెల్లడి కాదు.
ఈ నేపథ్యంలో.. తెలుగుదేశం పార్టీ పరిస్థితి మరింత చర్చనీయాంశంగా మారుతుంది. జగన్ పాలన రెండేళ్లను పూర్తి చేసుకుంటున్న తరుణంలో వెల్లడయ్యే స్థానిక ఎన్నికల ఫలితాలతో.. తెలుగుదేశం పార్టీ ఏ మాత్రం కోలుకోలేదు సరి కదా, గతం కన్నా మరింత పతనావస్థలోకి జారిపోయిందనే విషయం సూటిగా, సుత్తి లేకుండా స్పష్టం అవుతుంది. ఈ నేపథ్యంలో.. తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్నికల రణరంగం నుంచి తప్పుకున్నట్టుగా ప్రకటించేశారు.
పోటీ చేస్తే అసలు కథ బయటపడుతుంది. పోటీ నుంచి తప్పుకుంటే.. పలాయనవాదాన్ని వినిపించవచ్చు. తాము పోటీలో ఉండి ఉంటే.. బోలెడన్ని సీట్లను నెగ్గేవాళ్లమంటూ చెప్పుకోవడానికి తెలుగుదేశం పార్టీ వాళ్లకు ఇప్పుడు అవకాశం లభిస్తుంది. ఒక రకంగా చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న వ్యూహం రైటే. పోటీ చేసి జీరో అనిపించుకోవడం కన్నా.. పోటీ చేయలేదు.. బహిష్కరణ అంటూ పెద్ద పెద్ద మాటలు చెబుతూ పలాయనవాదం వినిపించడమే ఆ పార్టీకి మిగిలిన మార్గంలా ఉంది.
అయితే తెలుగు రాష్ట్రాల రాజకీయంలో ఇలాంటి పలాయనవాదం పనికి రాదు. ఇంత వరకూ ఇలా ఎన్నికల పోటీ నుంచి తప్పుకుని ఏదో నిరూపించుకోవాలన్న వ్యూహాలను ఫాలో అయిన వారు లేరు. రాజకీయంగా అమీతుమీ తేల్చుకోవడమే తెలుగు వారి రాజకీయం. ఉందో లేదో అన్నట్టుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటికీ ప్రతి ఎన్నికల్లోనూ పోటీ చేస్తూ ఉంటుంది.
నియోజకవర్గానికి కనీసం ఐదారు వందల ఓట్ల ను పొందలేని పరిస్థితుల్లో కూడా బీజేపీ పోటీలో నిలిచింది. ఇదీ తెలుగు ప్రజలు స్వాగతించే రాజకీయం. అంతే కానీ పోటీ నుంచి నిష్క్రమించి ఉనికి చాటాలనుకోవాలనే ప్రయత్నాలను ప్రహసనంగా భావిస్తూ తెలుగులో చాలా సామెతలున్నాయి. చేతగాని శౌర్యమెలా.. అంటూ మొదలుపెడితే మంగళవారం మాటలు అనేంత వరకూ ముతక సామెతలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కి వర్తించేలా ఉన్నాయి.