ఒకవైపు రాష్ట్రంలో తాము ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని భారతీయ జనతా పార్టీ తెగ ప్రయత్నాల్లో ఉంది. రాష్ట్రానికి ఏ మేలూ చేయకపోయినా, ఇచ్చిన హామీలను కూడా తుంగలో తొక్కినా బీజేపీ ఆశలకు మాత్రం అంతులేదు.
వివిధ రాష్ట్రాల్లో బీజేపీ ఈ మధ్యకాలంలో అధికారాన్ని సంపాదించుకుందంటే ఆ రాష్ట్రాలను ఉద్ధరించింది ఏమీ లేదు. అక్కడున్న రాజకీయ పరిస్థితులను క్యాష్ చేసుకుంటూ మాత్రమే ఆ పార్టీ ఎదిగింది. మరి ఏపీలో కూడా అలాంటి ఛాన్స్ ఉందా? అనే చర్చ జరుగుతున్న వేళ భారతీయ జనతా పార్టీకి మరో మంచి అవకాశాన్ని ఇచ్చారు ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు.
అధికార పార్టీకి ప్రత్యామ్నాయం అనే హోదాలో ఉండాల్సిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ స్థానిక ఎన్నికల రణరంగం నుంచి తప్పుకుని భారతీయ జనతా పార్టీకి మంచి అవకాశం ఇచ్చింది. అయితే ఇప్పటికే టీడీపీ తరఫున స్థానిక ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఆ పార్టీ పోటీలో ఉన్నట్టే. బీజేపీ తరఫున కూడా కొత్తగా నామినేషన్లు ఏవీ ఉండవు. ఆల్రెడీ ఏవైనా నామినేషన్లు పడి ఉంటే అక్కడ మాత్రమే ఆ పార్టీ పోటీలో ఉంటుంది. అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ తీవ్ర మైన నిర్ణయమే తీసుకుంది.
ఒక్కసారి ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్నాకా.. తెలుగుదేశం పార్టీ ఒక వ్యాక్యూమ్ ను మాత్రం క్రియేట్ చేసినట్టే. రేపు పెండింగ్ లో ఉన్న మున్సిపల్-కార్పొరేషన్ ఎన్నికలు వస్తాయి, ఊహించని మరేవో ఉప ఎన్నికలు రావొచ్చు.. అప్పుడు కూడా ఇలాగే టీడీపీ తప్పుకుంటుందా? లేక మళ్లీ పోటీ చేస్తుందా? మళ్లీ ఇలాంటి ఎన్నికల్లో పోటీ చేస్తే.. అప్పుడు ఎందుకు పోటీ చేస్తున్నట్టు? ఇప్పుడు ఎందుకు తప్పుకున్నట్టు? అనే ప్రశ్నకు తెలుగుదేశం పార్టీ సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. తమకు తోచినట్టుగా చేస్తామంటే కుదరకపోవచ్చు!
ఇష్టమైతే పోటీ చేస్తాం లేకపోతే లేదు.. అనే పార్టీలు ఏపీ రాజకీయంలో ఇప్పటి వరకూ రెండే ఉన్నాయి. అందులో ఒకటి కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ, రెండు పవన్ కల్యాణ్ కు చెందిన జనసేన పార్టీ. ఇవి ఉనికి ఉంటాయి. అయితే పోటీ మాత్రం వాటి అధినేతల ఇష్టం. అన్ని చోట్లా పోటీలో ఉండవు, అన్ని ఎన్నికల్లోనూ పోటీ చేయవు. అవే అనుకుంటే.. వాటికి తోడు ఇప్పుడు టీడీపీ జత అవుతోంది.