సాధారణ ఎన్నికల్లో ఓటుకు నోటు గురించి విన్నాం. కానీ ‘మా’ ఎన్నికల్లో మాత్రం ఓటుకు క్యారెక్టర్ ఎర వేయడం చర్చనీయాంశమైంది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు మరో మూడు రోజలు మాత్రమే గడువు వుంది. దీంతో పెద్ద ఎత్తున ప్రలోభాల పర్వానికి తెరలేచినట్టు సినీ ఇండస్ట్రీ ప్రముఖల మాటలే చెబుతున్నాయి.
నిన్నటికి నిన్న మెగా బ్రదర్ నాగబాబు మాట్లాడుతూ మంచు విష్ణు ప్యానల్ ఎలాగైనా గెలుపొందాలనే పట్టుదలతో ఉందన్నారు. దీంతో ఒక్కో ఓటుకు రూ.10 వేలు చొప్పున ఇస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందని సంచలన ఆరోపణ చేశారు.
ఇదిలా వుండగా తాజాగా ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ దర్శకుడు అజయ్ భూపతి ‘మా’ ఎన్నికల్లో ఓటింగ్ తీరుపై సంచలన ట్వీట్ చేశారు. ఓ దర్శకుడితో మాట్లాడానని.. ‘మా’ ఎన్నికల్లో తనకు నచ్చిన ప్యానల్ సభ్యులకు మద్దతిచ్చిన వారికే సినిమాల్లో క్యారెక్టర్లు రాస్తానంటూ ఆయన చెప్పారని అజయ్ భూపతి పేర్కొన్నారు. అజయ్ భూపతి ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వెయ్యి లోపు ఓట్లున్న ‘మా’ సంస్థలో చోటు చేసుకుంటున్న ప్రలోభాల తీరును సమాజానికి తెలియజేయాలనే ఉద్దేశమే అజయ్ భూపతి ట్వీట్ ప్రతిబింబిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అప్పుడప్పుడు సమాజంలో కుళ్లిపోయిన రాజకీయాలను వెండితెర ద్వారా చూపే సినిమా… చివరికి తన రంగంలో అంతకంటే దారుణ పరిస్థితులను ఎప్పుడు తెరకెక్కిస్తుందోనని నెటిజన్లు కామెంట్స్ పెడుతుండడం విశేషం.