కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నిక ఎలాంటి ఉత్కంఠ లేకుండానే సాగుతోంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, జనసేన ఉప ఎన్నిక బరి నుంచి తప్పుకోవడంతో బద్వేలు ఉప పోరు నామమాత్రమైంది. రేపటితో నామినేషన్ ప్రక్రియ ముగియనుంది. ఈ నెల 30న పోలింగ్, వచ్చే నెల 2న కౌంటింగ్ జరగనున్నాయి.
బద్వేలు ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు తలపడనున్నారు. ఈ రెండు పేరుకు జాతీయ పార్టీలే అయినప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌లో వాటి బలం నామమాత్రమే. రాష్ట్ర విభజన నిర్ణయం ఆ రెండు పార్టీలకు ఏపీలో ఉనికి లేకుండా చేసిందని చెప్పొచ్చు. ఇదిలా ఉండగా వైసీపీ తమ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య సతీమణి డాక్టర్ సుధను బరిలో దింపింది. కాంగ్రెస్ అభ్యర్థి కమలమ్మ, బీజేపీ తరపున పనతల సురేష్ ఏపీ అధికార పార్టీతో తలపడనున్నారు.
అయితే పోటీలో లేని టీడీపీ, జనసేన ఓట్లు ఎవరికి పడతాయనే చర్చకు తెరలేచింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి డాక్టర్ వెంకటసుబ్బయకు 95,482 ఓట్లు, టీడీపీ అభ్యర్థి డాక్టర్ రాజశేఖర్‌కు 50,748 ఓట్లు దక్కాయి. వైసీపీ అభ్యర్థి ఘన విజయం సాధించారు. ఇదే ఎన్నికలో నాడు జననేన తన మిత్రపక్షమైన బీఎస్పీని బరిలో దింపగా 1,321 ఓట్లు, బీజేపీకి 735 ఓట్లు లభించాయి.
ఈ నేపథ్యంలో కనీసం వెయ్యి ఓట్లు కూడా రాని బీజేపీ ఈ ఉప ఎన్నికలో పోటీ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్నట్టు బీజేపీ ప్రకటించింది. అయితే బలమైన కేడర్ కలిగిన టీడీపీ, అలాగే అంతో ఇంతో అభిమానులున్న జనసేనాని పవన్‌కల్యాణ్ అభిమానుల ఓట్లు ఎవరికి వెళ్తాయనే చర్చ జరుగుతోంది.
ముఖ్యంగా ఈ ఎన్నిక బీజేపీకి లాభిస్తుందని చెబుతున్నారు. ఉప ఎన్నిక బాధ్యతల్ని కడప జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌నాయుడు, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి తమ భుజాన వేసుకున్నారు. వీళ్లద్దరూ నిన్నమొన్నటి వరకూ టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
అందులోనూ బద్వేలు టీడీపీ నేతలతో సీఎం రమేష్, ఆదినారాయణరెడ్డిలకు మంచి సంబంధాలున్నాయి. ఆ సాన్నిహిత్యాన్ని ఈ ఉప ఎన్నికలో వాడుకోనున్నారనే ప్రచారం జరుగుతోంది. మున్ముందు పొత్తు పెట్టుకునేందుకు బద్వేలు ఉప పోరును సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచనతో బీజేపీలో ఉంటున్న టీడీపీ నేతలు ఉన్నారని సమాచారం.
బద్వేలు ఉప ఎన్నికలో తమకు సహకరిస్తే, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి కలిసి పని చేసేందుకు ఆలోచించొచ్చనే ప్రతిపాదనను టీడీపీ ముందు బీజేపీ నేతలు పెట్టినట్టు సమాచారం. దీంతో క్షేత్రస్థాయిలో బీజేపీకి సహకరించాలనే పరోక్ష సంకేతాల్ని గ్రామస్థాయి నేతలకు టీడీపీ అధిష్టానం పంపినట్టు సమాచారం.
ఇదే వర్కౌట్ అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం మారే అవకాశం లేకపోలేదు. ఈ ఎన్నికలో బీజేపీ గౌరవ ప్రదంగా ఓడిపోయేందుకు టీడీపీ సహకరిస్తే, భవిష్యత్‌లో అనూహ్య పరిణామాలకు దారి తీసే అవకాశాలున్నాయనే చర్చ జరుగుతోంది.
ఇందుకు సీఎం రమేష్, ఆదినారాయణరెడ్డి తమ వంతు ప్రయత్నాలను బద్వేలులో వేగవంతం చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. వీళ్లందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉమ్మడి శత్రువు కావడంతో, రాజకీయంగా ఎలాంటి పరిణామాలైనా చోటు చేసుకోవచ్చనేది మెజార్టీ ప్రజానీకం అభిప్రాయం.