టాలీవుడ్లో ‘మా’ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. సాధారణ రాజకీయాల్లోని అవలక్షణాలన్నీ సినీ ఎన్నికల్లో కూడా ఉన్నాయనేందుకు ప్రస్తుత పరిణామాలు చెబుతున్నాయి.
ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు ప్యానళ్లు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. ‘మా’ లో వెయ్యికి లోపే ఓటర్లున్నారు. షూటింగ్‌లు కారణంగా పెద్దగా ఓటింగ్‌లో పాల్గొనరనే ఆందోళన ఇరువైపు ప్యానళ్ల నుంచి వ్యక్తమవుతోంది.
ఈ నేపథ్యంలో నిర్మాతల మండలి ఓ కీలక విజ్ఞప్తి చేసింది. నటీనటులందరూ ఈ నెల 10న జరగనున్న ‘మా’ ఎన్నికల్లో ఓటు వేసిన తర్వాతే షూటింగ్‌ల్లో పాల్గొనాలనేది ఆ ప్రకటన సారాంశం.
ఎన్నికల అధికారి అభ్యర్థన మేరకే ఈ నిర్ణయం తీసుకుని, విజ్ఞప్తి చేస్తున్నట్టు నిర్మాతల మండలి ప్రకటించడం గమనార్హం. నిర్మాతల మండలి చొరవతో ఓటింగ్ పెరిగే అవకాశాలున్నాయి.
ఓటింగ్‌లో ఎక్కువ మంది పాల్గొనడం వల్ల ఒనగూరే లాభనష్టాలపై టాలీవుడ్లో చర్చకు దారి తీసింది. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు ప్యానళ్లు ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు రకరకాల ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఉత్కంఠ పోరులో గెలుపెవరిని వరిస్తుందో తెలుసుకునేందుకు మరో మూడు రోజులు ఎదురు చూడాల్సిందే.