‘మా’ ఎన్నికల రచ్చలో తానేం తక్కువ కాదంటూ మరో నటుడు ముందుకొచ్చాడు. ఆయనే పృథ్వీరాజ్. మంచు ప్యానల్ తరపున ఈయన పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రకాశ్‌రాజ్‌పై తనదైన స్టైల్‌లో తాజాగా విమర్శలు గుప్పించాడు. ‘మా’ ఎన్నికల ముంగిట… పృథ్వీరాజ్ ఫోన్‌కాల్ ఆడియో దుమారం రేపుతోంది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు చెందిన ఓ సభ్యుడికి పృథ్వీరాజ్ ఫోన్‌లో మాట్లాడిన ఆడియో బయటికొచ్చింది.
పాత విషయాల్ని పృథ్వీరాజ్ తవ్వితీశాడు. తనతో ఒకప్పుడు ప్రకాశ్‌రాజ్ వ్యవహరించిన తీరును తప్పు పడుతూ, ఇప్పుడాయన ఎలా పోటీ చేస్తారంటూ నిలదీయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతిమంగా తెలుగేతరుడైన ప్రకాశ్‌రాజ్‌ను ఓడించాలనేది ఆయన పిలుపు సందేశ సారాంశం. ఆ ఆడిమో రికార్డులో ఏముందంటే…
‘మీరు ఇటీవల ప్రకాశ్ రాజ్‌ని సన్మానించడం నాకు ఏ మాత్రం నచ్చలేదు. ఆయనకు మీరు ఎలా మద్దతు ఇస్తారు? ప్రకాశ్‌రాజ్ క్రమశిక్షణ బాలేదని ఫిల్మ్ ఛాంబర్ అసోసియేషన్ ఆయన్ని రెండుసార్లు సస్పెండ్ చేసింది. నేను ఓ కన్నడ సినిమా షూట్‌లో ఉన్నప్పుడు.. ‘కన్నడ వాళ్లు మాత్రమే ఇక్కడ నటించాలి’ అని నాపై ఆయన కేకలు వేశాడు.
భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయవచ్చు. కానీ మనల్ని మాత్రం పరిపాలించకూడదు. అలాంటిది మీకు ఆయన ఎందుకు అంత నచ్చాడు? పరాయిభాష వాళ్లపై మీకు అంత ఇష్టమేమిటి? ఏదీ ఏమైనా నా స్లోగన్ ఒక్కటే ‘తెలుగువాడిని గెలిపిద్దాం.. తెలుగు ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం’ అని పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ప్రకాశ్‌రాజ్ తెలుగేతరుడనే సెంటిమెంట్‌ను ప్రత్యర్థులు వ్యూహాత్మకంగా తెరపైకి తెస్తున్నారనేందుకు ఇది మరో ఉదాహరణ. నిన్న రవిబాబు అనే నటుడు ఇదే రీతిలో ప్రకాశ్‌రాజ్ పేరు ప్రస్తావించకుండానే ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
నేడు పృథ్వీరాజ్ మరింత బలంగా ప్రకాశ్‌రాజ్‌కు టాలీవుడ్‌తో సంబంధం ఏంటనే రీతిలో ప్రశ్నించాడు. అలాగే తెలుగువాడిని గెలిపిద్దాం.. తెలుగు ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం అనే నినాదం మంచు ప్యానల్‌కు ఎంత వరకూ రాజకీయంగా ప్రయోజనం కలిగిస్తుందో చూడాలి.