కరోనా విపత్తును ఎదుర్కోవడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంటూ ఆదర్శంగా నిలుస్తోంది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలతో స్పందన కార్యక్రమంపై సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడిన మాటలు ఎంతో స్ఫూర్తిని, ఉత్తేజాన్ని కలిగించేలా ఉన్నాయి.
రోజువారీ కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఏపీ అగ్రస్థానంలో ఉందన్నారు. రోజుకు 50 వేలకు పైగా పరీక్షలు చేస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం మనదేనని సీఎం జగన్ ఎంతో ధీమాగా చెప్పారు. ప్రతి పది లక్షల మందికి 31 వేలకు పైగా పరీక్షలు చేస్తున్నట్టు సీఎం చెప్పారు. కరోనా కేసులు ఎక్కువ నమోదు అవుతున్నా రిపోర్టుల్లో ఏ మాత్రం తగ్గించి చూపాలనే ప్రయత్నం చేయలేదని సీఎం స్పష్టం చేశారు.
కరోనా నియంత్రణలో అధికారులు, కలెక్టర్లు బాగా పనిచేశారని సీఎం ప్రశంసించారు.. కొవిడ్ వస్తుంది.. పోతుంది, దానితో కలిసి జీవించాల్సిన పరిస్థితి ఏర్పడిందని మరోసారి సీఎం స్పష్టం చేశారు. వ్యాక్సిన్ వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందేనని సీఎం అన్నారు. మధ్యప్రదేశ్ సీఎంకు కూడా కరోనా వచ్చిందని, కరోనా రావడం అనేది పాపమో, నేరమో కాదని సీఎం స్పష్టం చేశారు.
కరోనాతో చనిపోయినవారిలో కొన్ని గంటల తర్వాత వైరస్ ఉండదన్నారు. మానవత్వమే మరగున పడుతున్న పరిస్థితులను చూస్తున్నామని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కారణంగా చనిపోయిన వారి అంత్యక్రియలకు ప్రభుత్వం రూ.15 వేలు అందిస్తోందని జగన్ తెలిపారు. కరోనా నియంత్రణలో జగన్‌పై ప్రతిపక్షాలు, ఒక వర్గం మీడియాలో ఎంత నెగటివ్ ప్రచారం చేస్తున్నా…గణాంకాలు మాత్రం ఆయన చిత్తశుద్ధిని తెలియజేస్తున్నాయి. ఇదే వాళ్లకు మింగుడు పడని అంశం.