అవంతి శ్రీనివాసరావు ఇపుడు అతి ముఖ్యుడు అయిపోయారు. ఆయన మంత్రిగా ఉన్నా కూడా అంతకంటే కూడా ఎక్కువ బాధ్యతనే ఇపుడు నెత్తికెక్కించుకున్నారు. విశాఖకు రాజధాని తరలివస్తుందన్న ప్రచారం నేపధ్యంలో ఆ జిల్లా మంత్రిగా అవంతి మరింత కీలకం అయ్యారు.
దాంతో ఆయన గతానికి తన వ్యవహార శైలికి భిన్నంగా టీడీపీ మీద హాటు హాటుగా ఘాటుగా స్పందిస్తున్నారు. టీడీపీలో పెదబాబు, చినబాబులతోనే నేరుగా చెడుగుడే ఆడుకుంటున్నారు. విశాఖ రాజధాని విషయంలో ఎందుకు ఇంత వ్యతిరేకత మీకు అంటూ సూటిగానే అడుగుతున్నారు.
విశాఖను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం తప్ప వేరే పని లేదా అని కూడా నిగ్గదీస్తున్నారు. ఈ రోజుకు విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ బాధితులను పరామర్శించే తీరిక లేకపోయింది కానీ ఎక్కడో హైదరాబాద్ లో కూర్చుని విశాఖ మీద మాత్రం ప్రేమ ఉన్నట్లుగా ట్వీట్లు వేయడాన్ని ఆయన తప్పుపడుతున్నారు.
మొత్తానికి ఏడాది మంత్రిగా అవంతి బాగానే రాటుదేలారు, ఎవరికి ఎక్కడ కీలెరిగి వాత పెట్టాలో బాగానే నేర్చుకున్నారు. ముఖ్యంగా టీడీపీ తరచూ విశాఖ మీద చిందిస్తున్న విషానికి విరుగుడు అన్నట్లుగా అవంతి తనదైన పంచ్ లతో అదుర్స్ అనిపిస్తున్నారు. తమ్ముళ్లకే కాదు, ఇద్దరు బాబులకూ గట్టి సవాలే విసురుతున్నారు. ఉత్తరాంధ్రా జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని గట్టి వార్నింగులే ఇస్తున్నారు.