ఓటమి ఎరుగని బీజేపీని ఓడించిన మొనగాడిగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌ను సొంతం చేసుకుంది. 15 ఏళ్లుగా బీజేపీ అక్కడ పరిపాలన సాగిస్తోంది. ఎట్టకేలకు బీజేపీ కంచుకోటను ఆప్ బద్ధలు కొట్టింది. మరీ ముఖ్యంగా దేశ రాజధాని కేంద్రంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా ఆప్ పరపతి మరింత పెరిగింది.
దేశ వ్యాప్తంగా ఒకట్రెండు రాష్ట్రాల్లో మినహాయిస్తే… బీజేపీ అంటే విజయానికి చిరునామాగా మారిన సంగతి తెలిసిందే. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు సంబంధించి మొత్తం 250 వార్డులకు ఈ నెల 4న ఎన్నికలు జరిగాయి. ఇవాళ కౌంటింగ్ జరిగింది. ఆప్ 134 స్థానాలను దక్కించుకుని అధికారాన్ని హస్తగతం చేసుకుంది. బీజేపీ 104 స్థానాలతో సరిపెట్టుకుంది. కాంగ్రెస్ 9 వార్డులకే పరిమితమైంది.
ఇదిలా వుండగా చివరిగా 2017లో 270 మున్సిపల్ వార్డులకు జరిగిన ఎన్నికల్లో 181 వార్డులను బీజేపీ దక్కించుకుని అధికారాన్ని సొంతం చేసుకుంది. అప్పుడు ఆప్ 48 , కాంగ్రెస్ 30 స్థానాలను గెలుచుకున్నాయి. ఇప్పుడు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌ను ఆప్ సొంతం చేసుకోవడం ద్వారా ప్రజల్లో తన పట్టును ఆ పార్టీ నిలుపుకున్నట్టైంది.
ఇప్పటికే ఢిల్లీలో ఆప్ పరిపాలన సాగిస్తున్న సంగతి తెలిసింది. దేశ రాజధానిలో పట్టు కోల్పోవడం బీజేపీకి ఒకింత షాక్ అని చెప్పొచ్చు. తాజాగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పోటీ చేసిన సంగతి తెలిసిందే. రేపు గుజరాత్ కౌంటింగ్ జరగనుంది. అక్కడ ఫలితాలు ఎలా వుంటాయో చూడాలి.