కర్నూలు పర్యటనలో చంద్రబాబు నోరు జారడం ఆయన నెత్తిమీదకు తెచ్చింది. ముఖ్యంగా జగన్‌కు వజ్రాయుధం ఇచ్చినట్టైంది. ఈ దఫా అధికారం అప్పగించకపోతే తనకివే చివరి ఎన్నికలని చంద్రబాబు భయంతో జనానికి అప్పీల్ చేసుకున్నారు. ఆ ప్రకటన బూమరాంగ్ అయ్యింది. ఆ తర్వాత నాలుక్కరుచుకున్నారు. తనకు కాదు… జనానికే చివరి అవకాశమని మరోసారి టంగ్ స్లిప్ అయ్యారు. రాజకీయ చరమాంకంలో చంద్రబాబు తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నారు.
చంద్రబాబు మాటల్నే తీసుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫుట్‌బాల్ ఆడుతున్నారు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలనే నినాదాన్ని ఎత్తుకున్నారు. గత సార్వత్రి ఎన్నికల్లో బైబై బాబు అని వైసీపీ చేసిన ప్రచారం ఆ పార్టీకి రాజకీయంగా ఎంతో మేలు చేసింది. తాజాగా ఇక చంద్రబాబుకు వీడ్కోలు పలకడం గమనార్హం.
విజయవాడలో ఇవాళ వైసీపీ నేతృత్వంలో బీసీ మహాసభ జరిగింది. ఈ సభలో జగన్ ప్రసంగిస్తూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. తన వయసు 49 ఏళ్లని, చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చి 45 ఏళ్లు అవుతోందని జగన్ చెప్పుకొచ్చారు. బాబు అనుభవమంత వయసున్న తనతో 2024లో ఒంటరిగా తలపడతానని చంద్రబాబు ధైర్యంగా చెప్పలేకపోతున్నారని విమర్శించారు. బీసీల కోసం ఫలానా మంచి చేశానని చెప్పుకోడానికి చంద్రబాబు వద్ద ఏదీ లేదన్నారు.
2024 ఎన్నికలు ఖచ్చితంగా చంద్రబాబుకు చివరి ఎన్నికలే అని జగన్ తేల్చి చెప్పారు. బాబుకు బ్యాక్ బోన్ ఎల్లో బ్రదర్స్, దత్త పుత్రుడు ఏ సామాజిక వర్గానికి ప్రతినిధులో ఆలోచన చేయాలని ఆయన పిలుపు నిచ్చారు. జగన్ ప్రసంగాన్ని బాగా గమనిస్తే… రానున్న ఎన్నికల్లో వైసీపీ వ్యూహం ఏంటో తెలుసుకోవచ్చు. బాబుకు చివరి ఎన్నికలంటూ జనాన్ని హిప్నటైజ్ చేస్తున్నారు. ఈ సారి టీడీపీకి ఓటు వేయకపోతే బాబు మొహాన్ని శాశ్వతంగా చూడాల్సిన పని వుండదని ప్రతిపక్ష నాయకుడి వ్యతిరేకుల్లో ఓ ఆలోచన కలిగించేందుకు జగన్ వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నారు.
అలాగే ఎల్లో మీడియా అధిపతులు, పవన్‌కల్యాణ్ సామాజిక వర్గాలను తమకు వ్యతిరేకులుగా చూడాలని బీసీలకు జగన్ బహిరంగంగానే పిలుపునివ్వడం రాజకీయంగా సంచలనమే అని చెప్పొచ్చు. బహుశా ఇంత ధైర్యంగా, మొండిగా మరే నాయకుడు కులాలను చూపుతూ… పరోక్షంగా అంతు చూడాలని పిలుపునివ్వడం సాహసమే అని చెప్పాలి. జగన్ ఆడుతున్న ఈ రాజకీయ చదరంగంలో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.