ఒకవైపు అమెరికాలో కోవిడ్ -19 వ్యాక్సిన్ మీద తుది పరీక్షలు ఊపందుకుంటున్నాయి. అక్కడ వ్యాక్సిన్ ను సిద్ధం చేసిన మోడెర్నా- ఫైజర్ లు ఏకంగా 30 వేల మంది మీద హ్యూమన్ ట్రయల్స్ కు రంగం సిద్ధం చేశాయి. ఇప్పటి వరకూ ప్రయోగాలు ఆశాజనకమైన ఫలితాలను ఇచ్చాయని ఆ సంస్థలు ప్రకటించాయి, ఈ నేపథ్యంలో 30 వేల మంది ప్రయోగాల ద్వారా కరోనా వ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్ ను దాదాపు పూర్తి అవుతాయేమో. ఈ ప్రయోగాలు విజయవంతం కాగానే ఐదు కోట్ల మందికి రెండు డోస్ ల వ్యాక్సిన్ ను రెడీ చేయనున్నాయట ఆ సంస్థలు. ఈ సంస్థల నుంచి వ్యాక్సిన్ ను కొనుగోలు చేయడానికి అమెరికన్ ప్రభుత్వం కూడా ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
మరోవైపు బ్రిటీష్ వర్సిటీ ఆక్స్ ఫర్డ్ ఆధ్వర్యంలో రూపొందిన వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ కు ఇండియా కూడా వేదిక కానున్నదని తెలుస్తోంది. ఇండియాలో కూడా కొంతమందిపై ఈ వ్యాక్సిన్ ను మూడో దశలో ప్రయోగించనున్నట్టుగా డిపార్ట్ మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ప్రకటించింది. ఆక్స్ ఫర్డ్ – ఆస్ట్రాజెనికా సంయుక్తంగా రూపొందించిన ఈ వ్యాక్సిన్ ను ఇండియాలో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేయనుంది. తుదిదశ ఫలితాలతో సంబంధం లేకుండానే వ్యాక్సిన్ ఉత్పత్తిని ప్రారంభిస్తున్నట్టుగా సీరమ్ ఇది వరకే ప్రకటించింది.
ఇలా అమెరికన్, బ్రిటీష్ వ్యాక్సిన్ ప్రయోగాలు కీలకమైన మూడో దశ ప్రయోగాలకు చేరుకున్నాయి. మరో మూడు నెలల్లో కరోనా వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని ప్రకటిస్తూ, ఆ లక్ష్యానికి చేరువ అవుతున్నట్టుగా ఆ సంస్థలు విశ్వాసంగా చెబుతున్నాయి. అయితే భారీ స్థాయి ఉత్పత్తి మాత్రం ఇంకా ప్రశ్నార్థకంగానే ఉన్నట్టుంది. విజయవంతం అయిన వ్యాక్సిన్ వచ్చినా, భారతీయుల్లోని సామాన్యులకు అది చేరువ అయ్యేందుకు మాత్రం నెలల సమయమే పట్టే పరిస్థితులు అగుపిస్తున్నాయి ప్రస్తుతానికి.