బీజేపీకి ఏపీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు సొంతంగా గెలిచిన వారు లేరు. ఇక టీడీపీ పుణ్యమాని ఎమ్మెల్సీలుగా ఇద్దరు ఉన్నారు. అందులో ఒకరు విశాఖకు చెందిన పీవీఎన్ మాధవ్. ఆయన యువకుడు, బీసీ వర్గాలకు చెందిన వారు. విశాఖ రాజధాని అవుతుందని వార్తలు వస్తున్న నేపధ్యంలో మాధవ్ కి ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ ఇస్తారని అంతా భావించారు.
పైగా యువ సీఎం జగన్ ఏపీలో ఉన్నారని, ఆయన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు బీసీ నేతగా యుకు ఎమ్మెల్సీగా ఉన్న మాధవ్ కి కిరీటం తప్పదనుకున్నారు. పైగా ఆయన బీజేపీ దిగ్గజ నేత, ఉమ్మడి ఏపీ తొలి బీజేపీ ప్రెసిడెంట్ పీవీ చలపతిరావు కుమారుడు కూడా. దాంతో ఆయనే కొత్త ప్రెసిడెంట్ అనుకున్నారు.
కానీ అనూహ్యంగా అధ్యక్ష పదవి మాధవ్ చేజారిపోయింది. దానికి కారణాలు అనేకం అంటున్నారు. టీడీపీ నీడ ఏ మాత్రం పడని నేతలు దూకుడుగా పాలిటిక్స్ చేసే వారే బీజేపీకి ఇపుడు కావాలని అంటున్నారు. ఇక విశాఖలో చూసుకుంటే మాధవ్ కి ఇంకా వయసు ఉంది. అనుభవం కూడా కావాలి.
పైగా చంద్రబాబు లాంటి వారికి దూరంగా జరగాలన్నా, టీడీపీని చీల్చిచెండాడాలన్నా మాధవ్ కంటే సోము వీర్రాజే బెటర్ అని బీజేపీ హై కమాండ్ భావించింది అని విశ్లేషిస్తున్నారు. రానున్న రోజుల్లో సైతం బాబుని ఎవరైతే గట్టిగా ఎదుర్కొంటారో వారికే పగ్గాలు అన్న సూత్రాన్ని కూడా ఈ విధంగా తేల్చిచెప్పినట్లైంది.
ఇక మాధవ్ తటస్థ వాదం కూడా ఆయనకు అధ్యక్ష కిరీటం దక్కకపోవడానికి ఒక కారణం అంటున్నారు. వెంకయ్యనాయుడు శిష్యుడు, చంద్రబాబుకు గతంలో అతి సన్నిహితుడుగా పేరు గడించిన హరిబాబు రాజకీయ ప్రభావం ఏమైనా మాధవ్ మీద పడిందా అన్న చర్చ కూడా ఉంది. ఏది ఏమైనా మాధవ్ కి చాన్స్ జస్ట్ మిస్ అంటున్నారు.