మొగుడు మగాడు కాదని తెలుసుకున్న ఆ యువతికి జీవితం అంధకారమైంది. తొలిరాత్రే ఎక్కడ తన నిజ స్వరూపం బయటపడుతుందోననే భయంతో …ఏదో సాకు చెప్పి తప్పించుకున్నాడు. ఆ తర్వాత ఆ యువతికి అనుమానం వచ్చి నిలదీసి అడిగే సరికి చావు కబురు చల్లగా…తాను మగాడిని కాదని, ఆడవాళ్లంటే ఆసక్తి లేదని చెప్పాడు. దీంతో ఎన్నో ఆశలతో అత్తగా రింట్లో అడుగు పెట్టిన ఆ యువతికి భవిష్యత్ పగలే చీకట్లు అలుముకున్నట్టైంది.
ఈ వ్యవహారం కాస్తా గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి దృష్టికి వెళ్లింది. దిశ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. దిశ పోలీసులు, బాధితురాలి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.
గుంటూరు ఏటీ ఆగ్రహారానికి చెందిన యువతికి ఆర్టీసీ కాలనీకి చెందిన ఎన్ఆర్ఐతో ఈ ఏడాది మార్చి 18న వివాహం జరిపించారు. వరుడు అమెరికాలో సాప్ట్‌వేర్ ఇంజనీర్. దీంతో తమ బిడ్డ సుఖంగా ఉండాలనే ఉద్దేశంతో వధువు తల్లిదండ్రులు తమ స్తోమతకు మించి రూ.50 లక్షల నగదు, 55 సవర్ల బంగారం కట్నంగా ఇచ్చారు. అలాగే అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించారు. పెళ్లి ఖర్చే రూ.15 లక్షలు అయింది.
ఎన్నో ఆశలతో తొలిరాత్రికి ఆమె సిద్ధమైంది. వధువులోని ఉత్సాహం వరుడిలో కనిపించలేదు. తనకు ఆరోగ్యం బాగా లేదని ఆ రాత్రి బయటికి వెళ్లిపోయాడు. ఆమె పాజిటివ్‌గా అర్థం చేసుకుని ఆ రాత్రికి సరిపెట్టుకొంది. ఆ తర్వాత కూడా అతనిలో అదే వైఖరి. తనను దగ్గరికి రానివ్వకపోవడంతో ఆమెలో ఏదో అనుమానం, భయం కలిగాయి. ఆమె భయపడ్డంత పనే జరిగింది. దీంతో కాలర్ పట్టుకుని ఇదేంటని గట్టిగా నిలదీసింది. అప్పుడు అతను చెప్పిన మాటలు విని…నిలువునా భూమిలోకి దిగిపోతున్నట్టనిపించింది. ఇంతకూ ఆ నవ వధువుకు షాక్ కలిగించే ఆ మాటలు ఏంటంటే…
‘నాకు ఆడవాళ్లంటే ఆసక్తి లేదు. అమెరికాలో నా స్నేహితుడు ఉన్నాడు. నువ్వు అక్కడికి వచ్చాక అతనితో సుఖపడుదువులే. నేను కూడా కలుస్తాను. ముగ్గురం ఎంజాయ్ చేద్దాం’ అని మూడు వేసిన భార్యతో ఎన్ఆర్ఐ మొగుడు కూసిన కూతలివి. కొడుకు సంసారానికి పనికిరాడని తెలిసీ అత్తమామలు తన గొంతు కోశారని ఆ యువతి గుండెలు బాదుకుంటూ చెబుతోంది. తనకు న్యాయం చేయాలని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డికి ఫిర్యాదు చేసింది.
తన స్నేహితుడే కోసమే పెళ్లి చేసుకున్నానని.. అమెరికా తీసుకెళ్లి తన బాయ్‌ఫ్రెండ్‌కు అప్పజెబుతానని, అతనితో సంసారం చేయాలని చెప్పడంతో తాను భయాందోళనకు గురైనట్టు బాధిత యువతి ఆవేదనతో చెబుతోంది. మగాడు కాదని తెలిసి తననెందుకు మోసం చేశావని నిలదీయగా, కట్నం కోసం తన తల్లిదండ్రులు బలవంతం చేయడంతో తప్పలేదని చెప్పాడని తెలిపింది.
ఈ విషయమై తాను అత్తమామలు, ఆడపడుచుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని ఆమె తెలిపింది. ‘వాడు నీతో సంసారం చెయ్యడు.. కావాలంటే నువ్వూ ఒక బాయ్‌ఫ్రెండ్‌ను వెతుక్కో’ అని ఉచిత సలహా ఇచ్చారని బాధితురాలు వాపోయింది. ఈ తతంగం సాగుతుండగానే తన భర్త అమెరికా వెళ్లిపోయాడని, ఫోన్ చేస్తుంటే తీయడం లేదని తెలిపింది. తనకు చావే శరణ్య మని. న్యాయం చేయాలని పోలీసులను వేడుకొంది. ఈ యువతి వివాహ బంధానికి చివరికి ముగింపు ఏ విధంగా ఉంటుందో, పోలీసులు ఎలాంటి న్యాయం చేస్తారో కాలమే జవాబు చెప్పాల్సి ఉంది.