గవర్నర్ తమిళిసైపై సీఎం కేసీఆర్ ఏ రోజూ నేరుగా విమర్శలు చేయలేదు. కానీ ఆమె వ్యవహారశైలిపై మాత్రం ఆయన తీవ్ర ఆగ్రహంగా ఉన్నారనేది జగమెరిగిన సత్యం. గవర్నర్‌పై తాను మాట్లాడ్డం ద్వారా ఆమె పరపతి పెంచినట్టు అవుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే ఆయన గవర్నర్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆమెపై తన మార్క్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గవర్నర్ తమిళిసైపై సీపీఐని కేసీఆర్ సర్కార్ ఉసిగొల్పినట్టు చర్చ జరుగుతోంది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్, సీపీఐ మధ్య అన్యోన్య సంబంధం ఏర్పడింది. అప్పటి నుంచి టీఆర్ఎస్‌ను నెత్తికెత్తుకుని వామపక్షాలు ఊరేగుతున్నాయి. కేసీఆర్‌కు ఇబ్బంది కలిగించే వారిపై టీఆర్ఎస్ కంటే ముఖ్యంగా సీపీఐ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ తెలంగాణలో రాజ్‌భవన్ ముట్టడికి సీపీఐ పిలుపు ఇవ్వడం వెనుక అధికార పార్టీ వుందన్న అభిప్రాయాల్ని కొట్టి పారేయలేం.
గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలనే డిమాంత్‌తో సీపీఐ రాజ్‌భవన్‌ను ముట్టడించాలని అనుకోవడం గమనార్హం. గవర్నర్ వ్యవస్థతో ఖూనీ అవుతోందని తెలంగాణ సీపీఐ నేతలు విమర్శించారు. అందుకే ఆ వ్యవస్థను రద్దు చేయాలని వారు డిమాండ్ చేయడం విశేషం. ఇదే రీతిలో సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ కూడా గవర్నర్ వ్యవస్థపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం చూశాం. తాజాగా కేసీఆర్ కోసం సీపీఐ మరింత దూకుడుగా వ్యవహరించనుంది.
అసలే ఉప్పు, నిప్పులా కేసీఆర్ సర్కార్, గవర్నర్ మధ్య సంబంధాలున్నాయి. రాజ్‌భవన్ ముట్టడితో కేసీఆర్ సర్కార్, గవర్నర్ మధ్య మరింత గ్యాప్ పెరిగే అవకాశాలున్నాయి. రాజ్‌భవన్‌ను ముట్టడించేది సీపీఐ అయినప్పటికీ, దాని వెనుక మాత్రం టీఆర్ఎస్ ఉందని గవర్నర్ నమ్ముతున్నారు. ఇక మీదట గవర్నర్‌పై తన మిత్రపక్ష పార్టీలతో టీఆర్ఎస్ రాజకీయ దాడి చేయించే అవకాశం ఉంది. ఇది మొదలు మాత్రమే అని చెప్పొచ్చు.