క‌విత‌ విచార‌ణ‌…ఆ త‌ర్వాత ఏంటి?

తెలంగాణ సీఎం కేసీఆర్ త‌న‌య క‌వితను సీబీఐ విచారించేందుకు ముహూర్తం ఖ‌రారైంది. ఈ నెల 11న ఉద‌యం 11 గంట‌ల‌కు విచార‌ణ నిమిత్తం మీ ఇంటికి వ‌స్తామ‌ని క‌విత‌కు సీబీఐ వ‌ర్త‌మానం పంపింది. నిజానికి…

తెలంగాణ సీఎం కేసీఆర్ త‌న‌య క‌వితను సీబీఐ విచారించేందుకు ముహూర్తం ఖ‌రారైంది. ఈ నెల 11న ఉద‌యం 11 గంట‌ల‌కు విచార‌ణ నిమిత్తం మీ ఇంటికి వ‌స్తామ‌ని క‌విత‌కు సీబీఐ వ‌ర్త‌మానం పంపింది. నిజానికి ఈ నెల 6న క‌విత నుంచి సీబీఐ వివ‌రాలు సేక‌రించాల్సి వుండింది. సీబీఐ నోటీసుల‌పై టీఆర్ఎస్ అనేక త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌ల అనంత‌రం … చివ‌రికి విచార‌ణ ఎదుర్కోడానికి అధికార పార్టీ సిద్ధ‌మైంది. దీంతో సీబీఐ విచార‌ణ‌పై కవిత స్ప‌ష్ట‌త ఇచ్చింది.

ఈ నెల 11, 12, 14, 15 తేదీల్లో తాను అందుబాటులో వుంటాన‌ని సీబీఐ అధికారుల‌కు క‌విత స‌మాచారం చేర‌వేశారు. క‌విత ఇచ్చిన తేదీల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్నామ‌ని, 11న ఉద‌యం 11 గంట‌ల‌కు మీ ఇంటికి విచార‌ణ నిమిత్తం వ‌స్తామ‌ని, అందుబాటులో ఉండాలంటూ సీబీఐ డీఐజీ రాఘ‌వేంద్ర వ‌త్స ఎమ్మెల్సీ క‌విత‌కు మెయిల్ పంపారు. సానుకూలం వ్య‌క్తం చేస్తూ క‌విత స్పందించారు.

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో క‌విత‌ను సీబీఐ విచారించాల‌ని అనుకోవ‌డం కీల‌క ప‌రిణామంగా చెబుతున్నారు. ఎందుకంటే సీబీఐ విచారించిన త‌ర్వాత కవిత పాత్ర ఏమీ లేద‌ని తేల్చేస్తే… రాజ‌కీయంగా అది బీజేపీపై తీవ్ర ప్ర‌భావం చూపుతుంది. దీన్ని టీఆర్ఎస్ రాజ‌కీయంగా త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకుంటుంది. ఆ అవ‌కాశాన్ని కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ ఇస్తుంద‌ని అనుకోలేం. క‌విత‌ను ఇరికించే వ్యూహంలో సీబీఐ వేస్తున్న మొద‌ట అడుగుగా రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

సీబీఐ విచార‌ణ వ‌ర‌కూ వెళ్లి, ఆ త‌ర్వాత బీజేపీ వెన‌క్కి తగ్గే అవ‌కాశాలు లేవ‌ని దేశ వ్యాప్తంగా ఆ పార్టీ చ‌ర్య‌ల‌ను గ‌మ‌నిస్తున్న వారు చెబుతున్న మాట‌. కేసీఆర్ కుమార్తె కావ‌డంతో టీఆర్ఎస్ ఆందోళ‌న చెందుతోంది. త‌మ అధినాయ‌కుడి కుటుంబాన్నే టార్గెట్ చేస్తున్న బీజేపీకి, ఇక తామో లెక్క అని టీఆర్ఎస్ ముఖ్య నేత‌లు వాపోతున్నారు. సీబీఐ విచార‌ణ త‌ర్వాత జ‌ర‌గ‌బోయే ప‌రిణామాలు తెలంగాణ‌లో రాజ‌కీయంగా కీల‌క మ‌లుపున‌కు దారి తీసే అవ‌కాశం వుంది.