ఆమెపై బాబులో కొర‌వ‌డిన మునుప‌టి మ‌మ‌త‌!

ప‌శ్చిమ‌బెంగాల్ సీఎం మ‌మ‌తాబెన‌ర్జీపై చంద్ర‌బాబునాయుడిలో మునుప‌డి మ‌మ‌త క‌రువైంది. ఢిల్లీలో స‌మావేశ మందిరంలో మొక్కుబ‌డి ప‌ల‌క‌రింపున‌కే చంద్ర‌బాబు ప‌రిమితం అయ్యారు. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల ముందు మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వంపై యుద్ధం అంటూ…

ప‌శ్చిమ‌బెంగాల్ సీఎం మ‌మ‌తాబెన‌ర్జీపై చంద్ర‌బాబునాయుడిలో మునుప‌డి మ‌మ‌త క‌రువైంది. ఢిల్లీలో స‌మావేశ మందిరంలో మొక్కుబ‌డి ప‌ల‌క‌రింపున‌కే చంద్ర‌బాబు ప‌రిమితం అయ్యారు. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల ముందు మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వంపై యుద్ధం అంటూ సీఎం హోదాలో చంద్ర‌బాబు నానా హ‌డావుడి చేశారు. రాజ‌కీయంగా బ‌ద్ధ శ‌త్రువైన కాంగ్రెస్‌తో సైతం ఆయ‌న చేతులు క‌లిపారు. అలాగే ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తాబెన‌ర్జీ, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి అఖిలేష్ యాద‌వ్‌, జ‌మ్ములో నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ అధినేత ఫ‌రూక్ అబ్దుల్లా త‌దిత‌రుల‌ను క‌లుపుకుని మోదీని దించేస్తున్నామంటూ ఊద‌ర‌గొట్టారు.

దేశ వ్యాప్తంగా త‌న ప‌రిచ‌యాల‌ను ఏపీలో వినియోగించుకున్నారు. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున మ‌మ‌తాబెన‌ర్జీ, ఫ‌రూక్ అబ్దుల్లా త‌దిత‌రులు ప్ర‌చారం నిర్వ‌హించారు. త‌న‌తో పాటు వాళ్లిద్ద‌రితో  కూడా జ‌గ‌న్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేయించారు. చివ‌రికి ఫ‌లితం టీడీపీని చావు దెబ్బ‌తీసింది. మ‌ళ్లీ కేంద్రంలో మోదీ స‌ర్కార్ కొలువుదీరింది.

జ‌మ్ము క‌శ్మీర్‌లో అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. జ‌మ్ముక‌శ్మీర్‌లో ప్ర‌తిప‌క్ష నేత‌ల్ని నెల‌ల త‌ర‌బ‌డి గృహ నిర్భంధంలో ఉంచారు. అంత వ‌ర‌కూ ఫ‌రూక్ అబ్దుల్లాను రాజ‌కీయంగా వాడుకున్న చంద్ర‌బాబు… ఎలా వున్నావ‌ని ప‌ల‌క‌రించిన పాపాన పోలేదు. ఫ‌రూక్‌తో మాట్లాడితే బీజేపీకి కోపం వ‌స్తుంద‌నే భ‌యం చంద్ర‌బాబు నోటిని క‌ట్టి ప‌డేసింది. అలాగే ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌త విష‌యంలోనూ చంద్ర‌బాబు అమాన‌వీయంగా వ్య‌వ‌హ‌రించారు.

ప‌శ్చిమ‌బెంగాల్ ఎన్నిక‌ల్లో మ‌మ‌త‌ను ఓడించేందుకు బీజేపీ చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. ప్ర‌యోగించ‌ని అస్త్రం లేదు. కానీ ఆమె వీర‌నారిలా పోరాడి మళ్లీ అధికారాన్ని ద‌క్కింకుని శ‌భాష్ అనిపించుకుంది. త‌న‌కు అండ‌గా నిల‌వాల‌ని ప‌లుమార్లు చంద్ర‌బాబును ఫోన్‌లో అభ్య‌ర్థించేందుకు మ‌మ‌త ప్ర‌య‌త్నించ‌గా… ఆయ‌న అందుబాటులోకి రాలేద‌ని అప్ప‌ట్లో వార్త‌లొచ్చాయి. మ‌మ‌తతో మాట్లాడితే మోదీ, అమిత్‌షాల‌కు కోపం వ‌స్తుంద‌నే భ‌యంతోనే చంద్ర‌బాబు ఆమెకు ముఖం చాటేశార‌ని ప్ర‌చారం జ‌రిగింది.

ఈ నేప‌థ్యంలో జీ-20 స‌న్నాహ‌క స‌మావేశానికి చంద్ర‌బాబు వెళ్లారు. ఈ స‌మావేశానికి మ‌మ‌త కూడా హాజ‌ర‌య్యారు. స‌మావేశంలో క‌నిపించిన మమ‌త‌, చంద్ర‌బాబు ప‌ర‌స్ప‌రం ప‌ల‌క‌రించుకున్నారు. అంత‌కు మించి గ‌తంలో మాదిరిగా వాళ్లిద్ద‌రి మ‌ధ్య ప్ర‌త్యేక స‌మావేశం జ‌ర‌గలేదు. ఢిల్లీలో ఉన్న చంద్ర‌బాబును ఫ‌రూక్ అబ్దుల్లా క‌లిశారు. కానీ చంద్ర‌బాబు అవ‌కాశ‌వాద రాజ‌కీయాల‌ను ప‌సిగ‌ట్టిన మ‌మ‌త ఆయ‌న‌కు దూరంగా వుండ‌డ‌మే ఉత్త‌మ‌మ‌ని గ్ర‌హించిన‌ట్టున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

అలాగే దేశాన్ని కుదిపేసిన పెగాస‌స్‌కు సంబంధించి చంద్ర‌బాబుకు సంబంధం ఉన్న‌ట్టు ఆ మ‌ధ్య అసెంబ్లీలో మ‌మ‌త ప్ర‌క‌టించ‌డం ఏపీలో తీవ్ర రాజ‌కీయ దుమారం చెల‌రేగింది. బీజేపీపై పోరాటంలో భాగంగా క‌ష్ట‌కాలంలో ఉన్న‌ప్పుడు చంద్ర‌బాబు వెన్ను చూపార‌నే ఆవేద‌న మ‌మ‌తలో వుంది. అందుకే గతంలో మాదిరిగా చంద్ర‌బాబును ఆమె ప్ర‌త్యేకంగా చూడ‌లేదు. మ‌మ‌త ఉద్దేశాన్ని గుర్తించిన చంద్ర‌బాబు త‌న‌కు ఆమెతో స్నేహం ఉంద‌న్న విష‌యాన్ని  మ‌రిచిన‌ట్టు ప్ర‌వ‌ర్తించారు. సాధార‌ణ ప‌ల‌క‌రింపున‌కే ప‌రిమితం అయ్యారు. రాజ‌కీయం అంటే ఇదే కాబోలు.