వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలకు ప్రధాని మోదీ ఫోన్ చేసి పది నిమిషాలు మాట్లాడారనే వార్తలపై జనసేన రగిలిపోతోంది. తమ నాయకుడిపై ఏపీ ప్రభుత్వం అణచివేత చర్యలకు పాల్పడిన సందర్భంలో మోదీ నుంచి ఇలాంటి స్పందన ఎందుకు రాలేదని జనసేన నాయకులు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఏపీ సీఎం జగన్ సోదరి కావడం వల్లే షర్మిలకు మోదీ ఫోన్ చేశారని వారు అంటున్నారు.
ఇటీవల తెలంగాణలో షర్మిల పాదయాత్రపై కేసీఆర్ సర్కార్ ఉక్కుపాదం మోపడం, ఆమె తీవ్రంగా ప్రతిఘటిస్తుండడం తెలిసిందే. కేసీఆర్ సర్కార్ అణచివేతకు ఏ మాత్రం భయపడకుండా షర్మిల ముందుకెళ్లడం సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. ఈ నేపథ్యంలో షర్మిలకు ప్రధాని ఫోన్ చేసి మాట్లాడారనే వార్తలు పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతున్నాయి.
మోదీకి షర్మిల కృతజ్ఞతలు చెప్పడం జనసేనకు మరింత కోపం తెప్పిస్తోంది. విశాఖలో కౌలు రైతులకు చెక్కుల పంపిణీకి వెళ్లిన సందర్భంలో చోటు చేసుకున్న వివాదాన్ని జనసేన గుర్తు చేస్తోంది. కనీసం హోటల్ రూమ్ నుంచి కూడా పవన్‌ను కదలనివ్వలేదని, పోలీసులు నోటీసులు ఇచ్చి అక్కడి నుంచి విజయవాడకు వెళ్లేలా చేశారని జనసేన నాయకులు చెబుతున్నారు. పవన్‌కు ఏపీ బీజేపీ నేతలతో పాటు చంద్రబాబు సంఘీభావం చెప్పారని గుర్తు చేస్తున్నారు.
కానీ షర్మిలకు ఫోన్ చేసి తామున్నామనే భరోసా మిత్రుడైన తమ నాయకుడికి మోదీ ఎందుకు ఇవ్వలేదని జనసేన కార్యకర్తలు, నాయకులు ప్రశ్నిస్తున్నారు. పవన్‌పై మోదీ ప్రేమ ఇదేనా? అని నిలదీస్తున్నారు. బీజేపీని మతతత్వ పార్టీగా విమర్శించే షర్మిలపై మోదీ సానుభూతి చూపడం దేనికి సంకేతమని వారు ప్రశ్నిస్తున్నారు. అలాగే జీ-20 సన్నాహక సమావేశానికి పవన్‌ను ఆహ్వానించకపోవడం ….బీజేపీ నిర్లక్ష్యానికి నిదర్శనమని జనసేన విమర్శిస్తోంది. పవన్‌కు మోదీ ఫోన్ చేయకపోవడం కంటే, షర్మిలతో మాట్లాడాన్ని జనసేన జీర్ణించుకోలేకపోతోంది.