ఎన్సీబీ కస్టడీలో ఉన్న బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కు పొద్దుపోవడానికి సైన్స్ పుస్తకాలు ఇచ్చారట అధికారులు. అతడి ఫోన్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
దాన్నుంచి అవసరమైన వివరాలను రాబట్టడానికి ఫోరెన్సిక్ విభాగానికి పంపించినట్టుగా సమాచారం. 24 యేళ్ల వయసు కుర్రాడికి అధికారులు సైన్స్ పుస్తకాలే కరెక్ట్ అని భావించినట్టుగా ఉన్నారు. మరి వాటిపై ఆర్యన్ ఖాన్ ఆసక్తి ఏపాటిదో బయటి వారికి తెలియని అంశమే.
ఇక క్రూజ్ షిప్ లో డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి మరిన్ని అరెస్టులు చోటు చేసుకున్నాయి. షారూక్ తనయుడితో సహా మొదట ఎనిమిది మందిని ఎన్సీబీ అధికారులు అదుపులోకి తీసుకోగా, వారి నుంచి సేకరించిన సమాచారాన్ని బట్టి.. మరి కొందరిని అరెస్టు చేసినట్టుగా తెలుస్తోంది.
ఆర్యన్ ఖాన్ ను అరెస్టు చేసి.. డ్రగ్స్ కు సంబంధించిన మూలాలను శోధించాలని అధికారులు కోర్టుకు విన్నవించారు. ఈ నేపథ్యంలో అతడి కస్టడీని న్యాయస్థానం పొడిగించింది. అయితే ఆర్యన్ నుంచి ఎన్సీబీ అధికారులు ఎలాంటి డ్రగ్స్ స్వాధీనం చేసుకోలేదనేది అతడి తరఫు లాయర్ వాదన. కానీ కోర్టు కస్టడీని పొడిగించింది.
ఆర్యన్ ఏం చెప్పాడో కానీ, ఫోన్ నుంచి మొత్తం కూపీ లాగేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని స్పష్టం అవుతోంది. ఈ రోజుల్లో ఒకరి ఫోన్ ను పరిశీలించడం అంటే.. వారి గుట్టుమట్టులన్నింటినీ గుప్పిట్లో పెట్టుకోవడమే. ఈ నేపథ్యంలో ఆర్యన్ ఖాన్ కు డ్రగ్స్ ఎలా వచ్చాయి, రెగ్యులర్ గా తీసుకునే వాడా.. అనే అంశాలపై అధికారులకు స్పష్టత రావొచ్చు.
మరి వారు కోరిన కస్టడీ సమయం ముగిశాకా.. అయినా ఆర్యన్ ను వదులుతారా లేక మరింత పొడిగింపును కోరతారా ఆనేది తదుపరి విచారణలో తేలనుంది.