ఏపీలో కాంగ్రెస్ ఉందా అంటే ఉంది. దానికి నేతలు ఉన్నారా అంటే కూడా అక్కడక్కడ కొంతమంది ఉన్నారు. వారిలో కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ కూడా ఒకరు. ఆయన ఈ మధ్యనే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడారు.
ఆయన తాజాగా విశాఖలో మాట్లాడుతూ ఏకంగా దివంగత నేత వైఎస్సార్ మీద పెద్ద మాటలే అనేశారు. అసలు ఏపీలో కాంగ్రెస్ నష్టపోవడానికి వైఎస్సారే కారణమంటూ మండిపడ్డారు. 2004లో వైఎస్సార్ ని సీఎం ని చేయడమే కాంగ్రెస్ చేసిన తప్పు, వైఎస్సార్ సీఎం అవడం వల్లనే నేడు జగన్ కూడా సీఎం అయ్యారు అంటూ లాజిక్ కి అందని మాటలను కూడా పేర్చుకుంటూ పోయారు.
అసలు ఏపీలో కాంగ్రెస్ పార్టీ 2004 ఎన్నిక ముందు ఎలా ఉందో తెలిస్తే చింతా మోహన్ ఇలాంటి మాటలు అనగలరా అన్న చర్చ అయితే ఉంది.
నాడు మండుటెండలో ప్రాణాలకు తెగించి వైఎస్సార్ చేసిన పాదయాత్ర పుణ్యమా అనే 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. మరి వైఎస్సార్ ని కాంగ్రెస్ సీఎం గా చేయకుండా ఉండాల్సింది అన్న ఆలోచనలు కాంగ్రెస్ నేతలకు ఈ రోజున ఎలా వస్తోందో అర్ధం కావడంలేదు.
జగన్ సీఎం అయ్యారు అంటే ఆయన పదేళ్ళ పోరాట కృషి మాత్రమే. అంతే తప్ప వారసత్వంగా కాంగ్రెస్ ఆయనని తెచ్చి సీఎం ని చేయలేదు. ఈ సంగతి కూడా అందరికీ తెలిసినా కాంగ్రెస్ ఏపీలో నష్టపోవడానికి వైఎస్సార్ జగన్ కారణమని చెప్పడం అంటే దాన్ని కేవలం రాజకీయ బాధగా అర్ధం చేసుకోవాలేమో.
వచ్చే ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అని చింతా మోహన్ అనడమే అసలైన ట్విస్ట్. దీనికి ముందు ఆయన మాట్లాడుతూ ఏపీలో కాంగ్రెస్ కి నేతల కొరత ఉందని కూడా చెప్పుకున్నారు. మరి ఈ రెండింటికీ లింక్ ఎలా కుదురుతుందో బహుశా ఆయనే చెప్పాలేమో.