మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మళ్లీ ఫుల్ బిజీ అయిపోయారు. ఆయన ప్రతీ రోజూ ప్రెస్ నోటూ వీడియో బైటూ మీడియాకు పెడుతూ వైసీపీ సర్కార్ మీద జగన్ మీద విమర్శలు మొదలెట్టేశారు. మరి ఇన్నాళ్ళూ ఆయన ఇదే పని కదా చేసింది అంటే అవును చేశారు. కానీ మధ్యలో ఇటీవల కొంత విరామం ఇస్తున్నట్లుగా వ్యవహరించారు.
దానికి గల కారణాలు అందరికీ తెలిసిందే. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు వర్ధంతి వేడుకల వేళ ఆయన ఏకంగా వైఎస్ జగన్ మీద వ్యక్తిగత విమర్శలకు దిగిపోయి సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. ఫలితంగా ఏపీలో రాజకీయాలు కూడా హీటెక్కాయి. అయ్యన్న వర్సెస్ వైసీపీ అన్నట్లుగా వాతావరణం మారింది.
ఒక దశలో అయ్యన్నను అరెస్ట్ చేస్తారని కూడా ప్రచారం జరిగింది. ప్రస్తుతానికి కేసులు పెట్టినా కోర్టు నుంచి ఉపశమనం దక్కడంతో అయ్యన్న మళ్ళీ దూకుడు మొదలెట్టేశారు అంటున్నారు. ఆయన జగన్ సర్కార్ మీద తుగ్లక్ నిర్ణయాలు అంటూ విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇక ఏపీలో రైతుల కడగండ్లు పడుతున్నారంటూ ఏకంగా జగన్ కే లేఖ రాసి తగ్గేది లేదు అనిపించుకున్నారు.
అయితే అయ్యన్నకు ధీటుగా వైసీపీ నేతలూ స్పందిస్తున్నారు. మంత్రి కురసాల కన్నబాబు అయితే ఏపీలో వ్యవసాయ సాగు బాగానే సాగుతోంది. గంజాయి సాగు మాత్రమే ఎక్కడా సరిగ్గా సాగడంలేదనే ఈ అక్కసు అంతా అంటూ అయ్యన మీద ఇండైరెక్ట్ గా విమర్శలు చేశారు.
మొత్తానికి చూస్తే అయ్యన్న విమర్సలకు ప్రతి విమర్శలు తప్పవని తెలిసినా సుదీర్ఘ అనుభవం అనుకుంటూ అనాల్సిన నాలుగు అంటున్నారు, ఆ వెంటనే పడాల్సినవి కూడా ఆయనకు అలా వచ్చి పడుతున్నాయి మరి.